Advertisement
Google Ads BL

ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌ ప్రారంభం


1993లో ప్రారంభమైన తెలుగు సినిమా ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ తమ సొంత భవనం కోసం జూబ్లీ హిల్స్‌లోని రోడ్‌ నెం.10లో కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. 2004లో దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు చేతులమీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 72 మంది సభ్యులు వున్న ఈ అసోసియేషన్‌లో అందరి భాగస్వామ్యంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. మార్చి 15న ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు భవనాన్ని ప్రారంభించగా, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్‌ సెక్రటరీ సి.కళ్యాణ్‌, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసరాజు, సెక్రటరీ అశోక్‌కుమార్‌లతో పాటు అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
దాసరి నారాయణరావు: ఈరోజు నాకు చాలా ఆనందంగా వుంది. నా చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటోంది. రెండు అంతస్థులు అసోసియేషన్‌కి కేటాయించి మరో రెండు అంతస్తులు అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచన చేసిన అసోసియేషన్‌ సభ్యులను అభినందిస్తున్నాను. నా కెరీర్‌లో అప్పటి తరంలోని అందరు ప్రముఖ కళా దర్శకులు నా సినిమాలకు పనిచేశారు. నటీనటులు ఎలాంటి ఆభరణాలు పెట్టుకోవాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటారు అనేది ఆర్ట్‌ డైరెక్టర్స్‌ చెప్పేవారు. క్రియేటివిటీ వున్న ఆర్ట్‌ డైరెక్టర్‌ అయితేనే ఇవన్నీ చెప్పగలరు. ఒక సినిమా అందంగా రావడంలో ఆర్ట్‌ డైరెక్టర్‌ పాత్ర ఎంతో వుంటుంది. మన దగ్గర వున్న ఆర్ట్‌ డైరెక్టర్స్‌ దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ముంబాయిలో ఎవరిదైనా ప్రముఖుల వివాహం జరుగుతుంటే మన దగ్గర నుంచి వెళ్ళిన వారే అక్కడ సెట్స్‌ వేసే స్థాయికి ఎదిగారు. ఈ భవనం అంతా పూర్తయింది. లిఫ్ట్‌ మాత్రమే బ్యాలెన్స్‌ వుందని తనికెళ్ళ భరణి చెప్పారు. నేను ఎంతో మంది ఆర్ట్‌ డైరెక్టర్స్‌కి లిఫ్ట్‌ ఇచ్చాను. వారి అసోసియేషన్‌ బిల్డింగ్‌కి లిఫ్ట్‌ కూడా నేనే ఇస్తానని హామీ ఇస్తున్నాను. 
తలసాని శ్రీనివాసయాదవ్‌: 1993లో ప్రారంభమైన ఈ అసోసియేషన్‌ దినదినాభివృద్ధి చెందుతూ ఈ స్థాయి వచ్చిందంటే మామూలు విషయం కాదు. అందరికీ దగ్గరలో వున్న ఈ భవనం ఆర్ట్‌ డైరెక్టర్స్‌కి ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కి తరలి రావడంలో ఎన్‌.టి.ఆర్‌.గారు, ఎఎన్నార్‌గారు, రామానాయుడుగారు, దాసరి నారాయణరావుగారు ఎంతో కృషి చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత చిత్ర పరిశ్రమ గురించి ఎన్నో రూమర్స్‌ ప్రచారంలోకి వచ్చాయి. అవన్నీ నమ్మవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను సినిమాలు నిర్మించకపోయినా చిత్ర పరిశ్రమతో నాకు దగ్గరి సంబంధం వుంది. మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.గారికి కూడా పరిశ్రమ గురించి బాగా తెలుసు. ఇక్కడ నెలకు 200 సినిమాల షూటింగ్‌ జరుగుతున్నాయంటే మామూలు విషయం కాదు. అందుకే పరిశ్రమ అభివృద్ధి కోసం 2000 ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ నిర్మిస్తామని కె.సి.ఆర్‌.గారు ప్రకటించారు. పరిశ్రమను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో మా అందరి సహకారం మీకు వుంటుంది. ఎవరికి ఎలాంటి సమస్య వున్నా పరిష్కరించడానికి మన ప్రభుత్వం సిద్ధంగా వుంది. ఈ పరిశ్రమ మీద లక్షల మంది ఆధారపడి వున్నారు. ఎలక్షన్‌ తర్వాత చాలామంది చాలా రకాల రూమర్లు ప్రచారంలోకి తెచ్చారు. వారికి ఈ విషయాల మీదే ఫోకస్‌ ఎక్కువగా వున్నట్టుగా వుంది. రకరకాల కొత్త అసోసియేషన్లు పుట్టుకొచ్చాయి. అయితే ప్రభుత్వం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదు. సినిమాకి ప్రాంతీయ భేదం అనేది లేదు. సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని మరోసారి తెలియజేస్తున్నాను.
వి.వి.వినాయక్‌: ఎవ్వరి దగ్గరా డొనేషన్స్‌ తీసుకోకుండా సభ్యులందరూ కలిసి ఇంత పెద్ద భవనం నిర్మించుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. పూరి జగన్నాథ్‌గారు, రాజమౌళిగారు, శ్రీనువైట్లగారు వీరందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అసోసియేషన్‌కి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను.
మాగంటి గోపీనాథ్‌: 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన అసోసియేషన్స్‌ అన్నీ నా నియోజకవర్గమైన జూబ్లీ హిల్స్‌లోనే వున్నాయి. మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచాను. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. నన్ను గెలిపించిన మీ అందరి రుణం డెఫినెట్‌గా తీర్చుకుంటాను. 
సి.కళ్యాణ్‌: తలసాని శ్రీనివాసయాదవ్‌గారి దగ్గరికి మా నిర్మాతలంతా వెళ్ళి కలిసినపుడు పరిశ్రమలోని వ్యక్తులు బాగుండడం కోసం ఏదైనా పూజ చేయించమని ఆరోజే సలహా ఇచ్చారు. ఇప్పుడు దైవసన్నిధానంలో మురళీమోహన్‌గారి ఆధ్వర్యంలో హోమం జరగబోతోంది. తలసానిగారు చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ అండగా వుంటున్నారు. ఇక మాగంటి గోపీనాథ్‌గారు కూడా సినిమాలు నిర్మించారు. మనలో ఒకరు. నిర్మాతల కష్టాలు ఏమిటో ఆయనకు తెలుసు. వారి సహాయ సహకారాలు మనకి ఎప్పుడూ వుంటాయి. రఘుపతి వెంకయ్యగారి వర్థంతి అయిన ఈరోజున  ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ భవనం ప్రారంభమైంది. అందరికీ అందుబాటులో అసోయేషన్‌ భవనాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా వున్నాను. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs