ధనుష్, అమైరా దస్తూర్ జంటగా ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.వి.ఆనంద్ దర్శకత్వంలో కల్పాతి ఎస్.అఘోరమ్, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ తమిళ్‌లో నిర్మించిన భారీ చిత్రం ‘అనేగన్’. ఈ చిత్రాన్ని ‘అనేకుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. మార్చి 5న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో ఆదివారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్‌మీట్‌లో చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్, సంగీత దర్శకుడు హేరిస్ జయరాజ్, రచయిత సాహితి, ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఎన్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్.వి.ప్రసాద్: తమిళ్‌లో ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. మొదటి మూడు రోజుల్లో 2 కోట్ల షేర్‌ను సాధించి తెలుగులో విడుదలైన ధనుష్ చిత్రాల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా ‘అనేకుడు’ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా కె.వి.ఆనంద్‌గారి డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగం’ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. కొత్త జోనర్‌లో, కొత్త స్క్రీన్‌ప్లేతో ధనుష్ చిత్రాల్లోనే హయ్యస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కె.వి.ఆనంద్: నాలుగు విభిన్నమైన కథలు వుండడంతో ఈ సినిమాకి ఒక కొత్తదనం వచ్చింది. పునర్జన్మల కథాంశంతో ఇంతకుముందు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులో అదే కాన్సెప్ట్‌ని విభిన్నంగా చూపించడానికి మేం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. బుక్స్ చదవడంవల్ల, టి.వి. చూడడం వల్ల, ఎంతో మంది చెప్పిన కథలు వినడంలో మైండ్ కొన్ని విషయాలు బలంగా నాటుకుంటాయి. వాటివల్ల గత జన్మ స్మృతులు వారికి గుర్తొచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. కొంత మంది చిన్న పిల్లలు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు వారికి గుర్తున్నాయని, గత జన్మలో తాము తిరిగిన ప్రదేశాల్ని కూడా చూపించారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంతవరకు నిజం వుంది అనేది సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు. దీనికి సంబంధించిన నిజానిజాలు పక్కన పెడితే మూడు జన్మల్లో సఫలం కాని ఒక ప్రేమ, నాలుగో జన్మలో ఎలా సఫలం చేసుకున్నారన్న పాయింట్‌తో ఈ సినిమా చెయ్యడం జరిగింది. ప్రేక్షకులు ఈ సినిమాని చూసి కొత్త అనుభూతికి లోనయ్యారు. తమిళ్‌లో పెద్ద హిట్ చిత్రంగా నిలిచిన ‘అనేగన్’ తెలుగులో కూడా విజయం సాధించడం ఆనందంగా వుంది.
హేరిస్ జయరాజ్: ఇది చాలా ఇంటలెక్చువల్ మూవీ. ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించిన కె.వి.ఆనంద్‌గారికి థాంక్స్. నాలుగు క్యారెక్టర్స్, నాలుగు జనరేషన్స్‌తో విభిన్నంగా చేసిన ఈ సినిమాకి మంచి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ‘బంగ్లాగూడ’ అనే పాటకి తెలుగులో చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ధనుష్, అమైరా చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
సాహితి: కె.వి.ఆనంద్‌గారు తెరకెక్కించిన ఈ కొత్త తరహా చిత్రాన్ని అందరూ లైక్ చేస్తున్నారు. ఈమధ్యే మా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకి వెళ్ళాను. మాతో వున్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ సినిమా ఎంతగానో నచ్చింది. ధనుష్, అమైరాల పెర్‌ఫార్మెన్స్‌గానీ, కె.వి.ఆనంద్‌గారి టేకింగ్‌గానీ అద్భుతం అనిపించేలా వుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్‌లో వచ్చే బర్మా ఎపిసోడ్ చూస్తుంటే టైటానిక్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. ఇలాంటి డిఫరెంట్ మూవీని బడ్జెట్‌కి వెనకాడకుండా ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు ఎంతో భారీగా నిర్మించారు. తెలుగులో కూడా ఈ చిత్రానికి వస్తోన్న అప్లాజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది.