సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ వంటి డిఫరెంట్ చిత్రాలను అందించిన పి.సునీల్‌కుమార్‌రెడ్డి మరో విభిన్న కథాంశంతో రూపొందించిన చిత్రం ‘మిస్ లీలావతి’. కీ ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చేవారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి, నిర్మాత రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజు పాల్గొన్నారు.
పి.సునీల్‌కుమార్‌రెడ్డి: శ్రావ్య ఫిలింస్ బేనర్‌లో ఇది 12వ సినిమా. హుదూద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను చేయడం జరిగింది. ప్రకృతికి, మనిషికి, స్త్రీకి, పురుషుడికి వున్న రిలేషన్ బ్యాలెన్స్‌గా వుండాలి. అది తప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హుదూద్ కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ మనం కావాలని కొని తెచ్చుకున్నవి. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇలాంటి హుదూద్‌లాంటివి వస్తున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. చరిత్రలో ఎలాంటి యుద్ధాలు జరిగినా అది భూమి కోసమో, అమ్మాయి కోసమో జరిగినవే. లెక్కల ప్రకారం 28 కోట్ల మగవారికి పెళ్ళిళ్ళు జరిగాయి. అలాగే 29 కోట్ల మహిళలకు పెళ్ళిళ్ళు జరిగాయి. అంటే కోటి మంది మహిళలు అదనంగా వున్నారు. అంటే రెండో పెళ్ళి చేసుకున్నవారు. ఈ సినిమాలో మేం డిస్కస్ చేస్తున్నది ఇల్లీగల్ రిలేషన్స్ గురించి. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు, హుదూద్‌ల మధ్య నాకు సారూప్యం కనిపించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో హుదూద్ వంటి పరిణామాలు ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో అలాగే ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల భవిష్యత్తులో మానవ సంబంధాల్లో ఎలాంటి విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయో ఈ సినిమాలో డిస్కస్ చెయ్యడం జరిగింది. ఒక మంచి సినిమా తియ్యాలన్న యాంబిషన్‌తో వచ్చిన ఓ వైజాగ్ అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని తీసుకొని కమర్షియల్‌గా అన్ని ఎలిమెంట్స్ జోడిరచి ఈ సినిమా చెయ్యడం జరిగింది. ఈ చిత్రం ద్వారా కార్తీక్, లీలావతిని హీరో, హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం.
రవీంద్రబాబు: మా బేనర్‌లో ఇది 12వ సినిమా. మా బేనర్‌లో వచ్చిన అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకి కూడా సబ్జెక్ట్ విషయంలో ఎంతో డిస్కస్ చేసి ఒక మంచి కథతో ఈ సినిమా చేశాం. మంచి మెసేజ్‌తోపాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో వున్నాయి. ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా టోటల్‌గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది.