మంచు లక్ష్మీ, అడవి శేష్ ప్రధాన పాత్రల్లో విద్య నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎన్.వంశీకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘దొంగాట’. ఈ చిత్రం లోగో లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషించిన ప్రభాకర్ లోగోను లాంచ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మీ, అడవి శేష్, ప్రభాకర్, కెమెరామెన్ సామల భాస్కర్, దర్శకుడు ఎన్.వంశీకృష్ణ పాల్గొన్నారు.
మంచు లక్ష్మీ: ఈ సినిమా 90 శాతం పూర్తయింది. ఇంతకుముందు మా బేనర్‌లో గుండెల్లో గోదారి, ఊ కొడతారా ఉలిక్కిపడతారా వంటి సీరియస్ సినిమాలు చేశాం. ఫస్ట్ టైమ్ ఒక కామెడీ సినిమా చేస్తున్నాం. వంశీకృష్ణ మేం చెన్నయ్‌లో వున్నప్పటి నుంచి తెలుసు. ఒక మంచి సినిమాని తీశాడు. తప్పకుండా మా బేనర్‌లో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనుకుంటున్నాను. ఇప్పటివరకు సీరియస్ క్యారెక్టర్స్ చేసిన ప్రభాకర్‌గారు ఈ చిత్రంలో ఒక కామెడీ రోల్ చేస్తున్నారు. సినిమాలో ఆయనది చాలా ముఖ్యమైన క్యారెక్టర్. ఇంతకుముందు నేను నిర్మించిన చిత్రాలకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొన్నాను. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే చాలా కూల్‌గా చేశాం. దానికి ముఖ్యకారణం వంశీకృష్ణ. అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఈ చిత్రంలో నాగార్జునగారు, రవితేజగారు, మంచు మనోజ్, రానా, శింబు, నాని, నవదీప్, సుశాంత్, సుధీర్‌బాబు, తాప్సీ మేం అడగ్గానే స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను.
అడవి శేష్: ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన వంశీకి థాంక్స్. నేను కూడా ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ కామెడీ ట్రై చేశాను. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ అనేది చాలా గ్రేసియస్ ప్రొడక్షన్. ఒక అద్భుతమైన సినిమాని తీస్తున్నారు. నేను సినిమా చేస్తూ ఎంత ఎంజాయ్ చేశానో మీరు చూస్తూ అంత ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రభాకర్: మర్యాద రామన్న తర్వాత నేను చేస్తున్న ఫుల్‌ప్లెడ్జ్‌డ్ రోల్ ఇది. ఫస్ట్ టైమ్ కామెడీ చేసే ప్రయత్నం చేశాను. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను.
వంశీకృష్ణ: సడన్‌గా ఈ సినిమా స్టార్ట్ చెయ్యడం జరిగింది. మనం ఒక సినిమా చెయ్యాలని చెప్పి లక్ష్మీగారు టూర్‌కి వెళ్ళారు. వచ్చేసరికి కథ రెడీ చేసి చెప్పాను. ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే స్టార్ట్ చేశాం. ఇది ఒక వండర్‌ఫుల్ స్క్రిప్ట్. ఒక్క సాంగ్ తప్ప సినిమా మొత్తం కంప్లీట్ అయింది. లక్ష్మీగారు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో ఒక మంచి సినిమా చేశాను. నేను గుడ్ ట్రాక్‌లో వెళ్తున్నానన్న నమ్మకం కలిగించారు. ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను.
బ్రహ్మానందం, జె.పి., గిరిబాబు, అన్నపూర్ణ, పృథ్వి, ప్రగతి, మధు నందన్, ప్రభాస్ శ్రీను, నర్సింగ్ యాదవ్, అనంత్, శ్రీనివాసరాజు, సందీప్తి, మాస్టర్ ప్రేమ్, బేబీ కావేరి, లత ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్య మహావీర్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, వరికుప్పల యాదగిరి, సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, స్క్రీన్‌ప్లే: ఎన్.వంశీకృష్ణ, మోహన్ భరద్వాజ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: రాంబాబు, వెంకట్, కో`ప్రొడ్యూసర్: గాంధీ, నిర్మాత: మంచు లక్ష్మీ, కథ, దర్శకత్వం: ఎన్.వంశీకృష్ణ.