కథానాయకుడిగా మాత్రమే కాకుండా వినూత్న చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచి గల నిర్మాతగా కూడా ప్రతిభను చాటుకుంటున్నాడు తమిళ నటుడు ధనుష్. తమిళంలో పలు చిత్రాల్ని నిర్మించి విజయాలను సొంతం చేసుకున్న ఆయన మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. భిన్న అంశాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం విశ్వరూపం-2, ఉత్తమ విలన్, పాపనాశం చిత్రాల్లో నటిస్తూ కమల్‌హాసన్ బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.