పందెంకోడి, పొగరు, భరణి వంటి వరుస కమర్షియల్ సక్సెస్‌లతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విశాల్. ఇటీవల ‘పూజ’ చిత్రంతో మరో కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు. తాజాగా ‘మగమహారాజు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటించింది. రీసెంట్‌గా ‘చంద్రకళ’ వంటి హర్రర్ కామెడితో ప్రేక్షకులను థ్రిల్‌కి చేసిన సుందర్.సి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్ మాట్లాడుతూ ‘‘తమిళంలో ‘ఆంబల’ పేరుతో నిర్మించిన ఈ చిత్రం ఇటీవల తమిళనాడులో విడుదలై ఘనవిజయం సాధించింది. ‘మగమహారాజు’ పేరుతో తెలుగులో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్ సక్సెస్ అయింది. గత సంవత్సరం దీపావళికి నా బ్యానర్‌లో వచ్చిన ‘పూజ’ సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నాకు మరో సూపర్‌హిట్ చిత్రంగా ‘మగమహారాజు’ నిలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. నా గత చిత్రాల్లాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
దర్శకుడు సుందర్ సి. మాట్లాడుతూ ‘‘ఇటీవల సంచలన విజయం సాధించిన ‘చంద్రకళ’ తర్వాత తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మగమహారాజు’. విశాల్‌గారి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌తో ఈ సినిమా ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వడ్డి రామానుజం మాట్లాడుతూ ‘‘ఎన్నో కమర్షియల్ సక్సెస్‌లు సాధించిన విశాల్‌గారు ‘మగమహారాజు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి వస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న 350 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. తమిళ్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో దాన్ని మించి తెలుగులో హిట్ అవుతుందన్న నమ్మకం మాకు వుంది’’ అన్నారు.
విశాల్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వైభవ్, ప్రభు, రమ్యకృష్ణ, ఐశ్వర్య తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కెమెరా: గోపి అమర్‌నాథ్, సంగీతం: హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్:ఎన్.బి.శ్రీకాంత్, ఫైట్స్: కణల్ కణ్ణన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, సాహితి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్, దర్శకత్వం: సుందర్.సి.