సినిమాకి సంబంధించి గతంలో ఎన్నో పుస్తకాలు రచించిన సీనియర్ జర్నలిస్ట్ యు.వినాయకరావు తాజాగా మహిళా దర్శకురాలు, గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన శ్రీమతి విజయనిర్మల జీవితకథను పుస్తకరూపంలోకి తెచ్చారు. ఫిబ్రవరి 20 శ్రీమతి విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకొని ఈ పుస్తకావిష్కరణను ఆమె నివాసంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘గిన్నిస్‌బుక్ విజేత’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
కె.రాఘవేంద్రరావు: నాకు ఎంతో ఇష్టమైన దర్శకురాలు విజయనిర్మల. జయ బి., నందినిరెడ్డి వంటి లేడీ డైరెక్టర్స్‌కి విజయనిర్మలే స్ఫూర్తి. వినాయకరావు రచించిన ఈ పుస్తకం డైరెక్టర్స్ కావాలనుకుంటున్న మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
విజయనిర్మల: నేను పుట్టినరోజు జరుపుకోవాలని అనుకోలేదు. కానీ, అభిమానులు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజును ఒక వేడుకగా నిర్వహిస్తున్నారు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకు సంబంధించి వినాయకరావుగారు సమగ్రంగా రాశారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులకు, అభిమానులకు ధన్యవాదాలు.
కృష్ణ: ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుక జరుపుకున్నా ఈ పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత వుంది. అదే వినాయకరావు రచించిన ‘గిన్నిస్‌బుక్ విజేత’. ఇందులో అన్నీ విపులంగా రాశారు.
జయ బి.: నాకు నిజంగా విజయనిర్మలగారే ఇన్‌స్పిరేషన్. ఆమె చాలా వేరియేషన్స్ వున్న సినిమాలు తీశారు. అది ఎవరి వల్లా కాదు. సినిమాకి సంబంధించి ఆమె ఎంతో కృషి చేశారు. ఎన్నో అఛీవ్ చేశారు. అలాంటి విజయనిర్మలగారి గురించి ఒక పుస్తకాన్ని రచించిన వినాయకరావుగారిని అభినందిస్తున్నాను.
బి.ఎ.రాజు: ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకురాలిగా విజయనిర్మలగారు రికార్డు సృష్టించారు. విజయనిర్మలగారు 50 సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.
నరేష్: విజయనిర్మలగారి గురించి వినాయకరావుగారు రాసిన ఈ పుస్తకం మా అందరికీ ఎంతో గర్వకారణం. విజయనిర్మల మంచి నటి మాత్రమే కాదు, మంచి దర్శకురాలు కూడా అని దాసరి నారాయణరావుగారు గత పుట్టినరోజు సందర్భంగా అన్నారు. నాకు తెలిసినంత వరకు ఆమె మంచి రైతు, మంచి సంఘ సంస్కర్త కూడా.
నవీన్ విజయకృష్ణ: నేను సినిమాల్లోకి రావడానికి నాన్నగారు స్ఫూర్తి. అయితే నాన్నగారికి నానమ్మ స్ఫూర్తి. నానమ్మ గురించి అద్భుతంగా ఒక పుస్తకాన్ని రచించిన వినాయకరావుగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
వినాయకరావు: ఏ తారకీ దక్కని గౌరవం విజయనిర్మలగారికి దక్కింది. గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్న విజయనిర్మలగారి పుట్టినరోజు సందర్భంగా నేను అందించే చిరు కానుక ఇది. అలాగే ఇప్పటివరకు ఏ హీరోకీ రాని ఎక్కువ పేజీలతో కృష్ణగారి గురించి ఒక పుస్తకాన్ని రచిస్తున్నాను.