వారాహి చలనచిత్రం పతాకంపై ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి తాజాగా ప్రేక్షకులకు అందిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తుంగభద్ర’. ఆదిత్, డిరపుల్ జంటగా సాయిశివాని సమర్పణలో శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకత్వంలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవన్ ఎకర్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. వారాహి చలనచిత్రం నిర్మించిన ‘ఈగ’ చిత్రంలో హీరో నాని, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో హీరో నాగశౌర్య సంయుక్తంగా ఈ ఆడియో ఆవిష్కరించారు. హరిగౌర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు హరి గౌర చిత్రంలోని పాటలను పాడి వినిపించారు. ఇంకా ఈ ఆడియో ఫంక్షన్‌లో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, డి.ఎస్.రావు, లగడపాటి శ్రీధర్, అంబికా కృష్ణ, హీరోలు నాని, నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్, ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కళ్యాణి కోడూరి, వందేమాతరం శ్రీనివాస్, చిత్ర దర్శకుడు శ్రీనివాసకృష్ణ గోగినేని, సంగీత దర్శకుడు హరి గౌర, హీరో ఆదిత్, హీరోయిన్ డిరపుల్, నటులు శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి: తుంగభద్ర అంటే మా ఫ్యామిలీ అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే మేమంతా అక్కడ పుట్టి పెరిగినవాళ్ళమే. ఆ టైటిల్‌తో మా సాయిగారు సినిమా చెయ్యడం చాలా ఆనందం కలిగించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు హరి చాలా టాలెంటెడ్ అని సాయిగారు చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను. ఏదైనా ఒక సిట్యుయేషన్ ఇస్తే దాని మీదే కూర్చొని ట్యూన్ చేసి దానికి లిరిక్ కూడా రాసుకుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ట్యూన్ చేయడమే కాకుండా లిరిక్ కూడా రాసుకొనే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వున్నారు. కీరవాణిగారు, దేవిశ్రీప్రసాద్‌గారు. ఈ సినిమాకి హరి చాలా మంచి మ్యూజిక్ చేశాడు. శ్రీనివాసకృష్ణ సినిమాని చాలా బాగా తీశాడు. ట్రైలర్ చూశాను. చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. క్లైమాక్స్ ఫెంటాస్టిక్‌గా తీశాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.
యం.యం.కీరవాణి: హరి చెన్నైలోనే పుట్టి, అక్కడే సంగీతం నేర్చుకున్నాడు. అతని మ్యూజిక్ వింటే చెన్నై స్టాండర్డ్ మనకి కనిపిస్తుంది. ఈ చిత్రం ద్వారా అతను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవడం చాలా సంతోషం. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. కొత్తవారికి అవకాశం ఇవ్వడం అనేది వారికి అన్నం పెట్టడం లాంటిది. అలా అవకాశం ఇచ్చినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. సాయిగారు ఈ పద్ధతిని జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటున్నాను.
అంబికా కృష్ణ: సాయిగారు కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు తీస్తుంటారు. ఆయన చాలా గ్రేట్. ఎందుకంటే ఒక నిర్మాతగా నేను ఆ సాహసం చేయలేను. ఒక హిట్ ఫార్ములాలో సినిమాలు తియ్యగలను తప్ప కొత్తవారితో సినిమా చెయ్యడం అనేది నా వల్ల కాదు. సాయిగారు చేస్తున్న సాహసానికి ఆయనకి పెద్ద విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సాయిగారికి రాజమౌళిలాంటి వ్యక్తి అండదండగా వుంటారు. ఈమధ్య పికె సినిమా 650 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. రాజమౌళిగారు మన తెలుగు సినిమాని వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే రేంజ్‌కి తీసుకెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
లగడపాటి శ్రీధర్: వారాహి చలనచిత్రం అనేది మోస్ట్ రెస్పెక్టెడ్ బేనర్. ఒకే సంవత్సరంలో మూడు సక్సెస్‌ఫుల్ మూవీస్ చేశారు. అలా చెయ్యాలని నేను కూడా చేస్తున్నాను. కానీ, నావల్ల కావడంలేదు. ఈ చిత్రానికి సంగీతం అందించిన హరి గౌర మా బేనర్‌లో వస్తోన్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రానికి కూడా మ్యూజిక్ చేశాడు. ఈ రెండు సినిమాలు మార్చిలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ చిత్రాల ద్వారా హరి మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీనివాసకృష్ణ గోగినేని: ఈ కథను మొదట నా మిత్రుడు కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ళకి వినిపించాను. కథ విని ఈ కథకు ఇద్దరు హీరోలు కావాలి. ఒకరు నటించేవారు. మరొకరు డబ్బు పెట్టేవారు. నా అదృష్టం కొద్దీ ఇద్దరూ దొరికారు. ఇది తుంగభద్ర కథ. ఈ సినిమాకి ఈ టైటిల్‌ని సజెస్ట్ చేసింది సాయిగారు. అలాగే క్లైమాక్స్‌లో మేం ఒక ఆర్‌ఆర్ పెడదాం అనుకున్నాం. అయితే అది కాకుండా మరో ఆర్‌ఆర్‌ని సజెస్ట్ చేశారు. అది హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అయింది. ఆ క్రెడిట్ కూడా ఆయనకే దక్కింది. ఆదిత్, డిరపుల్ గురించి చెప్పాలంటే నాకు ఎంతో కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా ఆదిత్ కోఆపరేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేమంతా కలిసి ఒక మంచి సినిమా చేశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది.
ఆదిత్: ఈ కథకు, ఈ క్యారెక్టర్‌కి నేను పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతానని నన్ను సెలెక్ట్ చేశారు. ఇలా గడ్డంతో వుండే క్యారెక్టర్ తమిళ్‌లో ఒకటి చేశాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా ఆశ. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
డిరపుల్: ఇంత మంది లెజెండ్స్ ఈ ఆడియో ఫంక్షన్‌కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఆదిత్ చాలా మంచి కోస్టార్. శ్రీనివాస్‌గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. హరిగారు చాలా మంచి మ్యూజిక్ చేశారు. తప్పకుండా ఈ ఆడియోతోపాటు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం.
హరి గౌర: ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నందుకు సాయిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాటలన్నీ బాగా కుదిరాయి. మా అమ్మగారు ఇందులో రెండు పాటలు రాశారు. సాహితిగారు ఒక పాట రాశారు. ముఖ్యంగా చైతన్యప్రసాద్‌గారు రాసిన పాట చాలా బాగా వచ్చింది. టోటల్‌గా అన్ని రకాల పాటలు వున్న ఈ ఆడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. శ్రీనివాస్‌గారు సినిమాని చాలా బాగా తీశారు. వారాహి చలనచిత్రం బేనర్‌లో మరో మంచి చిత్రంగా ‘తుంగభద్ర’ నిలుస్తుంది.
ఆదిత్, డిరపుల్ జంటగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సత్యరాజ్, చలపతిరావు, శివకృష్ణ, కోట శంకరరావు, సప్తగిరి, పవిత్ర లోకేష్, రాజేశ్వరి నాయర్, ధన్‌రాజ్, రవివర్మ, నవీన్ నేని, చరణ్, జబర్దస్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటింగ్: అమ్మిరాజు, పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, చైతన్యప్రసాద్, రాధా సుబ్రహ్మణ్యం, గణేష్ సెలాది, ఆర్ట్: హరివర్మ, డాన్స్: శంకర్, కో`ప్రొడక్షన్: సిల్లీమాంక్స్, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని.