రాహిల్స్ మూవీ పతాకంపై రఫీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘రాహుల్ పక్కా ప్రొఫెషనల్’. ఈ చిత్రాన్ని కోఆపరేటివ్ పద్ధతిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకనిర్మాత రఫీ మాట్లాడుతూ ‘‘ఫేస్‌బుక్‌లో నేను పోస్ట్ చేసింది చూసి ‘మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్’ ట్రైలర్ రిలీజ్‌కు వివిధ జిల్లాల ప్రేక్షకులు చాలా మంది వచ్చారు. నా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ముందే వారికి చూపించి అభిప్రాయలు తెలుసుకొని వాటిని అనుసరించి రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. సినిమా ప్రదర్శన తర్వాత ప్రేక్షకుల స్పందనను వీడియో తీశాను. వారి అభిప్రాయాలను తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం, సంతృప్తి కలిగాయి. అందులోని హాస్యం, సంగీతం, సందేశం మరియు సన్నివేశాలు అత్యంత సహజంగా వున్నాయని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ట్రైలర్ చూసిన వారిలో కొందరు పంపిణీదారుల మాదిరి తమ సెంటర్లలో అడ్వాన్సులు ఇచ్చి విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఎ, బి, సిలుగా భావిస్తున్న ఆయా సెంటర్ల నుండి వచ్చిన నాన్ రిఫండబుల్ అడ్వాన్సులను బట్టి పర్సెంటేజీలను ప్రకటిస్తూ మీడియా సమక్షంలో రెండు జిల్లాలకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంటున్నాను’’ అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈమధ్య కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాలు విడుదల చేయడం చాలా కష్టమైపోయింది. ఇటువంటి తరుణంలో ఇటీవల నా బంగారు తల్లి చిత్రాన్ని క్రౌడ్ ఫండిరగ్ పద్ధతిలో రిలీజ్ చేశారు. మన కుర్రాళ్ళే చిత్రాన్ని కూడా అదే తరహాలో రిలీజ్ చేశారు. పెసరట్టు అనే చిత్రాన్ని క్రౌడ్ ఫండిరగ్‌తోనే నిర్మించారు. అదే తరహాలో రాహుల్ పక్కా ప్రొఫెషనల్ చిత్రాన్ని కోఆపరేటివ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పది నుండి పదిహేను మంది ఫండిరగ్ చేసుకొని సినిమాని రిలీజ్ చేస్తారు. దీనివల్ల ఒకరకమైన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, ప్రమోషన్స్, థియేటర్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇలాంటి కొత్త పద్ధతిని రఫీని అభినందిస్తున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలో రిలీజ్ చేస్తున్న మహమ్మద్ మౌసిమ్ చెక్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాములు, వివేక్, విమల పాల్గొన్నారు.