శర్వానంద్, నిత్యమీనన్ జంటగా కె.ఎస్.రామారావు సమర్పణలో సి.సి. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై కె.క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘మళ్ళి మళ్ళీ ఇది రానిరోజు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి నెలాఖరులో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు చిత్ర విశేషాలను తెలిపేందుకు పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ...
‘‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే మంచి పాటలోని పదాలను తీసుకొని అంతే మంచి సినిమా తీద్దామనే కోరికతో అదే టైటిల్ పెట్టడం జరిగింది. 1980 దశకంలో ఇళయరాజాగారు చేసిన ఓ మంచి పాట అది. ఇప్పటికీ అందరికీ గుర్తున్న పాట. ఈ కథకి ఆ టైటిల్ చాలా యాప్ట్ అనిపించింది. ‘ఓనమాలు’ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఈ కథ చెప్పినపుడు చాలాకాలం తర్వాత చాలా గొప్ప ప్రేమకథ అనిపించింది. ప్రతి వారం నాలుగైదు సినిమాలు ప్రేమకథలతోనే వస్తున్నాయి. కానీ, ఇది నిజంగా నిజమైన ప్రేమకథ. చాలా చక్కని పవిత్రతో కూడిన ప్రేమకథ. ఎంతో ఎమోషనల్‌గానూ, అంతకంటే అందంగానూ వుండే ప్రేమకథ. ఈమధ్య వస్తున్న సినిమాల్లో ప్రేమ అనేది అందంగా వుండడం లేదనేది నా అభిప్రాయం. కాస్త ఘాటుగా వుంటోంది. ఈ సినిమా విషయానికి వస్తే చాలా స్మూత్‌గా వుంటుంది. ఒక పుష్పగుచ్ఛాన్ని చూస్తే కలిగే ఫీలింగ్ ఈ సినిమా చూస్తే కలుగుతుంది. ఈ ప్రేమకథకు పర్‌ఫెక్ట్ కాస్టింగ్ కుదిరారు. శర్వానంద్, నిత్యమీనన్ పోటీ పడి మరీ నటించారు. నిత్యమీనన్ ఎంత అందంగా వుంటుందో, శర్వానంద్ ఎంత హ్యాండ్‌సమ్‌గా వుంటాడో మీకు తెలుసు. వాళ్ళిద్దరి మధ్య నడిచే ప్రేమకథను చాలా నేచురల్‌గా, అందరూ మెచ్చే విధంగా తీశాడు క్రాంతి మాధవ్. ఇలాంటి ప్రేమకథకి మంచి సంగీతం కూడా కావాలి. గోపి సుందర్ ఈ చిత్రానికి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మలయాళంలో ఇళయరాజా, కీరవాణి రేంజ్ వున్న మ్యూజిక్ డైరెక్టర్ అతను. ఇప్పటికే పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. జనరల్‌గా సినిమా ప్రమోషన్ కోసం ప్లాటినం డిస్క్ ఫంక్షన్లు చేస్తుంటారు. ఈ ఆడియో విషయానికి వస్తే నిజంగానే పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ప్లాటినం డిస్క్ స్టేజ్ ఆల్రెడీ వెళ్ళింది. ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే సాహితిగారు, రామజోగయ్యశాస్త్రిగారు పాటలు చాలా బాగా రాశారు. సాయిమాధవ్ చాలా నేచురల్‌గా డైలాగ్స్ రాశారు. నిజంగా ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారు అనేది చాలా క్రిస్ప్‌గా రాశారు. అరే ఒరేయ్ అనుకునేలాంటి మాటలు కాకుండా భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ రాసిన మాటలు తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయి. మా కెమెరామెన్ జ్ఞానశేఖర్ సినిమాని చాలా అందంగా చూపించాడు. హుదూద్ ముందు వైజాగ్ ఎంత అందంగా వుందనేది ఈ సినిమాలో చూడొచ్చు. హుదూద్‌కి ముందు వైజాగ్ ఇంత అందంగా వుండేదా అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. క్రాంతిమాధవ్ తను అనుకున్న కథలో ఏదైతే ఫీల్ అయ్యాడో, ఆ ఫీల్‌ని స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో జ్ఞానశేఖర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సెల్యులాయిడ్ లవ్ పోయెమ్‌లా ఈ చిత్రాన్ని తీర్చిద్దిద్దారు. మంచి కథతో, మంచి నటీనటులతో, మంచి మ్యూజిక్‌తో ఈ నెలాఖరులో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
శర్వానంద్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపిసుందర్, కెమెరా: జ్ఞానశేఖర్ వి.యస్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్.