మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ బుడుగు. మాస్టర్ ప్రేమ్, ఇంద్రజ, శ్రీధర్రావు కీలక పాత్రలు పోషించారు. ది హైదరాబాద్ ఫిల్మ్ ఇన్నోవేటీస్ ప్రై.లి. సంస్థ తెరకెక్కించింది. మన్మోహన్ దర్శకత్వం వహించారు. భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని సుధీర్ సమర్పిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బుడుగుగా టైటిల్ రోల్లో మాస్టర్ ప్రేమ్ నటించాడు. చాలాకాలం తరవాత ఇంద్రజ ఓ కీలక మైన పాత్ర పోషించింది.
బన్నీ అనే ఎనిమిదేళ్ల కుర్రాడికి సంబంధించిన కథ. అమ్మా,నాన్న ఇద్దరూ ఉద్యోగస్థులే. హైదరాబాద్లోని ఓ గ్రేటెడ్ కమ్యునిటీలోని ఓ ఫ్లాట్లో నివాసం ఉంటుంటారు. డాలీ అనే చెల్లాయి, ట్రాయ్ అనే కుక్క పిల్ల... వీళ్లే బుడుగు కుటుంబం. అమ్మానాన్నలు తెల్లారితే ఆఫీసు, ఫైల్సు అంటూ హడావుడిలో ఉంటారు. పిల్లల్ని పట్టించుకొనే తీరిక ఉండదు. బన్నీ మనస్తత్వం కాస్త విభిన్నంగా ఉంటుంది. ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడడు. ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తుంటాడు. స్కూలు నుంచి కూడా బన్నీ పై ఫిర్యాదులు వస్తుంటాయి. ఇక లాభం లేదని ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తారు. అక్కడ బన్నీ ప్రవర్తన అందరికీ షాక్ కలిగిస్తుంది. బన్నీకి ఎవరెవరో అపరిచిత వ్యక్తులు కనిపిస్తుంటారు. బన్నీకి కనిపించినవాళ్లెవ్వరూ మిగిలినవాళ్లకు కనిపించరు. ఇదేదో మానసిక వ్యాధి అని అందరూ భయపడిపోతారు. ట్రీట్మెంట్కి తీసుకెళ్తే బన్నీ గురించిన చాలా నిజాలు బయటకు వస్తాయి. అవేంటి? బన్నీ అలా తయారవ్వడానికి కారణం ఏంటన్నది సస్పెన్స్. కొన్ని యదార్థ సంఘటనలన్నీ ఇలా `బుడుగు` రూపంలో కథగా మలిచానని చెబుతున్నారు దర్శకుడ మన్మోహన్. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.