ప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణం కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. చరణ్ నిర్మాతగా కాపిటల్ ఫిల్మ్స్ వర్క్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'మూడు ముక్కల్లో చెప్పాలంటే...'. ప్రముఖ రచయిత వెన్నెలకంటి రెండో కుమారుడు రాకేందు మౌళి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అదితి కథానాయిక. మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.
ఈ సందర్భంగా దర్శకురాలు మధుమిత మాట్లాడుతూ - ''ఇద్దరు యువకులు తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకుంటారు. ఎలాంటి వ్యాపారం మొదలుపెడతారు? తద్వారా వారి జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? అనేది ఈ చిత్రం కీలకాంశం. వాస్తవానికి ఈ చిత్రానికి సంభాషణలు రాయించడానికి రాకేందు మౌళీని పిలిపించాం. కానీ, ఈ కథకు తనే హీరో అయితే బాగుంటుందనుకున్నాను. ఎస్.పి. చరణ్ కూడా ఓకే అన్నారు. రెండు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం చేయడాన్ని సవాల్ గా తీసుకున్నాం'' అని చెప్పారు.
నిర్మాత ఎస్.పి. చరణ్ మాట్లాడుతూ - ''చిత్రదర్శకురాలు మధుమిత 'వల్లమై తారాయో', 'కొలకొలైయ ముందిరిక్కా' అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'వల్లమై తారయో'కి తమిళనాడు రాష్ర్టం అవార్డుతో పాటు అనేక అవార్డులు దక్కాయి. రెండో చిత్రానికి కూడా మంచి స్పందన లభించింది. ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ చిత్రంలోని ఓ డైలాగ్ నే ఈ సినిమా టైటిల్ గా పెట్టాం. ఇది కథకు యాప్ట్ అయిన టైటిల్. రొమాంటిక్ కామెడీ మూవీ. రెండు భాషల్లోనూ 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ఇందులో మూడు పాటలున్నాయి. జనవరి 23న పాటలను విడుదల చేయలనుకుంటున్నాం'' అని చెప్పారు.
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, రాజా రవీంద్ర, కాదంబరి కిరణ్, వెంకీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: కార్తికేయ మూర్తి, ఎడిటింగ్: కిరణ్ గంటి, కెమెరా: శ్రీనివాస్, ఆర్ట్: మోహన్ జీ.
Advertisement
CJ Advs