సినీజోష్ రివ్యూ: పుష్ప 2 - ది రూల్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, జగదీశ్, సునీల్, అనసూయ, శ్రీలీల (ప్రత్యేక గీతం) తదితరులు
సినిమాటోగ్రఫీ: మిరొస్లా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్
రచన, దర్శకత్వం: సుకుమార్
గత కొన్ని రోజుల్నుంచి పిచ్చ పిచ్చగా రచ్చ చేస్తూ వచ్చింది పుష్ప 2.
ఓ వైపు సీక్వెల్ అడ్వాంటేజ్
మరోవైపు భారీ అంచనాల భారం
ఓ వైపు ప్రచారపు జోరు
మరోవైపు వివాదాల హోరు
ఓ వైపు లెక్కకు మిక్కిలి థియేటర్లు
మరోవైపు చుక్కలనంటిన టిక్కెట్ రేట్లు
ఇలా ఇటు పాజిటివ్ గాను - అటు నెగెటివ్ గాను
రెండు విధాలా నిత్యం వార్తల్లోనే వుంటూ,
రోజు రోజుకీ మరింత క్రేజు పెంచుకుంటూ వచ్చిన
మచ్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2 - ది రూల్
ప్రకటించిన విడుదల తేదీకంటే ఒకరోజు ముందుగానే
ప్రీమియర్ షోస్ తో బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలుపెట్టేసింది.
మరి పుష్పరాజ్ యాటిట్యూడ్, హీరోయిజం, మేనరిజమ్స్ కి ఫిదా అయిపోయి
పుష్ప ది రైజ్ కి పాన్ ఇండియా సక్సెస్ కట్టబెట్టిన
ప్రేక్షకుల అభిమానాన్ని, అంచనాలను
ఈ పార్ట్ 2 నిలబెట్టుకోగలిగిందా,
పుష్ప రూల్ అనుకున్న గోల్ కొట్టకలిగిందా.?
వివరాలకై విశ్లేషణలోకి వెళదాం.!
పుష్ప పయనం
ది రైజ్ అంటూ పార్ట్ 1 లో రెడ్ శాండల్ స్మగ్లింగ్ సిండికేట్ కి బాస్ గా ఎదిగిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) పార్ట్ 2 లో ఆద్యంతం తన రూలింగ్ చూపించాడు. తనపై ప్రతీకారంతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) కి ఛాలెంజ్ విసిరి మరీ తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. భార్య శ్రీవల్లి (రష్మిక) పైన ఇతర అతివలంతా అసూయపడేంత ప్రేమను కురిపించాడు. తనతో ఫోటో దిగేందుకు నిరాకరించిన ముఖ్యమంత్రిని ఆ పదవిలోంచే దించేసాడు. ఇంటి పేరు ఇవ్వనని వేధించిన అన్నని తన ఇంటికి రప్పించి, తల్లి కాళ్లపై పడేలా చేసాడు. అన్న కూతురిని అపహరించిన వాళ్ళని అంతం చేసాడు. ఆ ప్రయత్నంలో కొత్త ప్రత్యర్థులను సృష్టించుకున్నాడు. ఇదీ క్లుప్తంగా ఈ పార్ట్ 2 లో పుష్ప పయనం. ఇక ఇతర అంశాలు చూద్దాం.!
పుష్ప కథనం
క్రేజీ ఫ్రాంచైజీలో హీరోకి ఎటువంటి ఇంట్రో ఉండాలో, ఆ వెంటనే నేరుగా అసలు కథలోకి ఎలా దూసుకుపోవాలో లెక్కలేసుకుని చెక్కి మరీ చక్కబెట్టేసారు సుకుమార్. ఇక షెకావత్ తో సమరాన్ని - శ్రీవల్లితో సరసాన్ని సరదా సరదాగా కానిచ్చేస్తూనే.. ఎక్సట్రార్డినరీ ఎలివేషన్ సీన్స్ తో ఆడియన్సుకి అందాల్సిన కిక్కునీ అలవోకగా ఇచ్చేసాడు పుష్పరాజ్. ఆపై ఇంటర్వెల్ సీక్వెన్స్ అసలు సిసలు పుష్పని తెరపైకి తీసుకురాగా... పోస్ట్ ఇంటర్వెల్ కసికసిగా కాలు దువ్వి కదం తొక్కింది పుష్ప కథనం. కానీ ఓ దశలో పట్టు సడలిందే అనుకునేలోపు రెండు అద్భుతమైన ఎపిసోడ్స్ ఆడియన్స్ నోళ్లు మూయించేస్తాయి. ఆన్ స్క్రీన్ కనిపించే విజువల్స్ కళ్ళు విప్పారేలా చేస్తాయి. ఆపై సినిమా లెంగ్త్ ని సైడ్ చేస్తాయి. పుష్ప స్ట్రెంగ్త్ ని ప్రూవ్ చేస్తాయి. అవి ఏంటంటే...
పుష్ప పూనకం
ముందునుంచి వినవచ్చినట్టుగానే జాతర ఎపిసోడ్ పుష్పకి మేజర్ హైలైట్ గా నిలిచింది. ఆ గెటప్ లో అల్లు అర్జున్ చేసిన డాన్స్ అండ్ పెర్ ఫార్మెన్స్ చూస్తుంటే నిజంగానే పూనకం వచ్చేసిందా లేక పిచ్చెమైన పట్టేసిందా అనే భావనకు లోనవుతారు ప్రేక్షకులు. దానికి కొనసాగింపుగా వచ్చే సూసేకి సాంగ్ సూడముచ్చటగా అనిపిస్తుంది. ఆ వెంటనే అదే గెటప్ పై అక్కడే డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ మాస్ ఆడియన్స్ తోనే కాదు క్లాస్ ఆడియన్సుతో కూడా క్లాప్స్ కొట్టించేస్తుంది. మొత్తంగా ఆ జాతర ఎపిసోడ్ మొత్తం అల్లు అర్జున్ వీరంగం ఆడేస్తే.. ముగింపులో మాత్రం రష్మిక మార్కులు కొట్టేసింది. తన భర్తపై మాట పడనివ్వని శ్రీవల్లిగా రష్మిక చెప్పే సింగల్ షాట్ డైలాగ్ కి ఫామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతారు.
పుష్ప తాండవం
పుష్ప పూనకానికే మంత్ర ముగ్ధులైపోయిన జనానికి పుష్పగాడి తాండవం ఎలా ఉంటుందో క్లైమాక్స్ ఫైట్ లో చూపించి ఒళ్ళు గగుర్పొడిచేలా చేసారు సుకుమార్. నిజానికి ఆ ఫైట్ కి కావాల్సినంత ఎమోషన్ కథలో బిల్డ్ కాకపోయినా, ఆ ఎపిసోడ్ ని అల్లు అర్జున్ రక్తి కట్టించిన విధానం వావ్ అనిపిస్తుంది. వారెవ్వా ఇది కదా నేషనల్ బెస్ట్ యాక్టర్ పొటెన్షియాలిటీ అనుకునేలా చేస్తుంది. ఆ యాక్షన్ కొరియోగ్రఫీకి ఎంత క్రెడిట్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ క్రెడిట్ తనకే దక్కాలి అనేంత రప రపా రఫ్ఫాడించేసాడు అల్లు అర్జున్. ఓ విధంగా చెప్పాలంటే అది కేవలం మనం రెగ్యులర్ గా చూసే పోరాట దృశ్యం కాదు. బీటింగ్, బైటింగ్, షౌటింగ్ అన్నీ మిక్స్ అయిన ఫాబ్యులస్ ఫైటింగ్. ఓవరాల్ గా అయితే ఆడియన్సుకి ట్రీటు. ఫ్యాన్సుకి ఫీస్టు.!
పుష్ప మెరుపులు
ఇంట్రో ఫైట్ నుంచి పుష్ప పలికే డైలాగ్స్ అన్నీ డైనమైట్స్ లా పేలాయి. వాటిలో కొన్ని చమక్కులుంటాయి. కొన్ని కొంతమందికి చురుక్కుమంటాయి. అలాగే ఎలివేషన్స్ అయితే అల్లు అర్జున్ అభిమానులకి పండగలా అనిపిస్తాయి. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ తీసుకున్న ప్రత్యేక జాగ్రత్త ఏమిటంటే... ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్ కి పుష్పని పూర్తి స్థాయి స్మగ్లింగ్ కింగ్ గా మార్చెయ్యకుండా భార్యని అమితంగా ప్రేమించి, గౌరవించే భర్తగా, తమకు పుట్టబోయే బిడ్డకు ఇంటి పేరు ఇవ్వలేనని వేదన చెందే తండ్రిగా చూపించడం ఈ చిత్రాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే దారిని పరిచింది. నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రిని మార్చాలనే నిర్ణయానికి, అందుకు అవసరమయ్యే డబ్బు కోసం చేసే దందాకి కారణం కూడా భార్యతో పుష్పకున్న బాంధవ్యమే.!
పుష్ప కుదుపులు
ఏంది మచ్చా.. పుష్పగానికి అన్నీ మెరుపులేనా, మెలికలు - మరకలు ఏమి లేవా ఎట్టా అంటారేమో. అవీ ఉన్నాయ్. ఇంటి పేరే లేదంటూ అంతా అవమానిస్తుంటే రగిలిపోయిన కూలోడు రాజుగా ఎదగడం (అది ఏ విధంగా అయినప్పటికీ) పార్ట్ 1 లో సగటు సినీ ప్రేక్షకుడిని సంతృప్తి పరిచింది. పార్ట్ 2 లో మాత్రం అందరిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేసే ఆల్ రెడీ బ్రాండెడ్ పుష్ప వల్ల ఆ తరహా అనుభూతి కొరవడింది. శ్రీవల్లి ప్రేమకై పరితపిస్తూ అక్కడ పుష్ప పండించిన వినోదంలో పది శాతమైనా పంచలేక పార్ట్ 2 నీరసించింది. కొండారెడ్డి, జాల్ రెడ్డి, మంగళం శ్రీను లని దాటుకుని షెకావత్ తో తలపడిన అప్పటి పుష్ప కంటే ఇప్పటి పుష్ప ఇంకా పవర్ ఫుల్ అయినప్పటికీ దానికి ధీటైన ప్రత్యర్థులే లేక స్క్రీన్ ప్లే సీదాసాదాగా సాగింది. దేశాన్నంతటిని ఊపేసి ఊఁ అనిపించిన స్థాయిలో లేని కిస్సిక్ సాంగ్, టైటిల్ సాంగ్ లో మిస్ అయిన ఫోన్ కాల్ బిట్ పుష్ప ఫాన్స్ ని డిజప్పాయింట్ చేస్తాయి. ముఖ్యమంత్రినే మార్చెయ్యడం, రెండు వేల టన్నుల సరుకుని జస్ట్ ఎడ్ల బళ్ళమీద చెన్నైకి చేర్చెయ్యడం వంటివి ఓవర్ సినిమాటిక్ లిబర్టీకి నిదర్శనంగా నిలుస్తాయి. తన తమ్ముడి కొడుక్కి జాతరలో అంతటి అవమానం జరిగితే ఆ విషయం అసలే మాత్రం తెలియని, తెలిసినా పట్టించుకోని జగపతిబాబు క్లయిమాక్స్ టైమ్ కి మాత్రం ఉన్నట్టుండి ఊడిపడ్డం మరో విడ్డూరం. వాటన్నిటినీ మించి సుకుమార్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా ఇతర దర్శకులను అనుసరిస్తారా అనిపించేలా చేసాయి సినిమాలోని కొన్ని సందర్భాలు. వాటిలో మచ్చుకి కొన్ని...
పుష్పని కట్టేసి వేలాడదీసే ఎంట్రీ సీన్ తో పాటు ఆపై పుష్ప చైల్డ్ హుడ్ సీన్ గుర్తు చేసుకోవడం, కొన్ని ఎలివేషన్ సీన్లు KGF ని టక్కున తలపిస్తాయి.
యాక్షన్ ఎపిసోడ్స్ లో అల్లు అర్జున్ చేత హూ అనే సౌండ్ చేయించడం, పూనకంతో ఊగిపోవడం వంటివి కాంతర ని గుర్తు చేస్తాయి.
మధ్య మధ్యలో అకస్మాత్తుగా వచ్చే టైటిల్ కార్డ్స్ యానిమల్ ని యాదికి తెస్తాయి.
ఏదేమైనా ఇలాంటి కొన్ని కుదుపులు ఉన్నప్పటికీ మరీ అదుపు తప్పకుండా పుష్ప ప్రయాణాన్ని ప్రణాళిక ప్రకారమే తీర్చిదిద్దారు సుకుమార్.
పుష్ప బలం, బలగం
తెరపై పుష్పకు అన్నీ బన్నీనే - తెర వెనుక పుష్పకి సర్వం సుకుమారే.! వారిద్దరి పట్టుదల, కసి, కృషిల కలబోతే ఈ సినిమా. పుష్ప పార్ట్ 1 తోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ ఆ స్ఫూర్తితోనో లేక అది మరోమారు అందాలనే అభిమతంతోనో పార్ట్ 2 లో మరింత చెలరేగిపోయారు. ఓ పక్క సుకుమార్ తనపై వీలైనన్ని క్లోజప్ షాట్స్ పెట్టేస్తుంటే... ప్రతి షాట్ కీ, ప్రతి ఫ్రేమ్ కీ, ప్రతి ఎక్సప్రెషన్ తో ప్రాణం పోసేసారు అల్లు అర్జున్. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, రపా రపా ఎపిసోడ్, ఆ ఆహార్యం లో అతని అభినయం మరోమారు తనని జాతీయ అవార్డుకి ప్రథమ పోటీదారుడిగా నిలుపుతుంది అనడంలో సందేహం అక్కర్లేదు. అభినయానికి అవకాశం దొరికిన శ్రీవల్లి పాత్రలో రష్మిక కూడా అదరగొట్టింది. పీలింగ్స్ పాటలో ఆకర్షణీయంగా అందాలనూ ఆరబోసింది. ఫహద్ ఫాజిల్ తన ట్రెమండస్ యాక్టింగ్ తోను, టిపికల్ డైలాగ్ డెలివరీ తోను మరోమారు ఆకట్టుకున్నారు. అయితే తన పాత్రకు ఇచ్చిన ముగింపు సబబుగా అనిపించదు. జగపతిబాబు విలనీని పార్ట్ త్రీ కోసం దాచిపెట్టారు. అనసూయ అంతో ఇంతో ప్రభావం చూపింది కానీ మంగళం శీనుకి పెద్ద సీన్ లేకపోవడంతో సునీల్ తేలిపోయాడు. రావు రమేష్ తనదైన శైలిలో సెటిల్డ్ గా నటించడమే కాక మొదటిభాగం లో అల్లు అర్జున్ - ఫహద్ ఫాజిల్ చేసిన వస్త్ర విసర్జనకి ఈసారి తాను పూనుకున్నారు. అజయ్, కేశవ తదితరులంతా తమ పాత్రలను అదే ధోరణిలో కొనసాగించారు. ప్రత్యేక గీతంలో చిందేసిన శ్రీలీల తనవంతు ప్రయత్నం సిన్సియర్ గానే చేసింది కానీ పార్ట్ 1లో కనుసైగలతో సైతం కవ్వించేసిన సమంతతో సరితూగలేకపోయింది.
దేవి స్వరపరిచిన పాటలు బాగానే ఉన్నాయి కానీ నేపథ్య సంగీతం, జాతర సాంగ్, క్లైమాక్స్ ఫైట్ థీమ్ సూపర్బ్ అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ సుకుమార్ విజన్ ని జస్టిఫై చేసింది. ఎడిటింగ్ కూడా సుకుమార్ సూచనల మేరకే జరిగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం కనిపించింది. రైటింగ్ టీమ్ తపన వినిపించింది. జపాన్ ఫైట్ కేవలం బిల్డప్ కోసమే తీసారా, పార్ట్ త్రీ కి ఇవ్వాల్సిన లీడ్ విషయంలో అప్రమత్తంగా లేక అర్ధాంతర ముగింపునిచ్చారా అనే కొన్ని కంప్లైంట్స్ తప్ప సుక్కు వర్కుకి వంక పెట్టలేం. ఎస్పిషియల్లి పుష్ప వంటి మొరటు పాత్రలో సున్నితత్వాన్ని ఆవిష్కరించడం, యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఫామిలీ డ్రామాని స్మూత్ గా బ్లెండ్ చేయడం సుకుమార్ నైపుణ్యానికి మరో నిదర్శనంగా చెప్పొచ్చు. మైత్రి వారి నిర్మాణ విలువలు పుష్ప రేంజ్ లోనే నేషనల్ అనుకుంటివా - ఇంటర్నేషనల్ అనిపిస్తాయి.
పుష్ప ఫలం, ఫలితం
ప్రీమియర్ షోస్ నుంచే అంతటా అద్భుతమైన టాక్ అందిపుచ్చుకున్న పుష్ప హవా కొన్నాళ్ళు ఉధృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ నుంచే కాక నార్త్ నుంచి కూడా వస్తోన్న పాజిటివ్ రివ్యూస్ భారతీయ బాక్సాఫీస్ వద్ద పుష్ప జాతర తధ్యమనే సంకేతాలిస్తున్నాయి. బరిలో మరే భారీ చిత్రమూ పోటీలో లేదు. అల్లు అర్జున్ అనే ఆకర్షక శక్తికి అడ్డేదీ రాదు. ఎటొచ్చీ టిక్కెట్ రేట్లు సామాన్య ప్రేక్షకులకి అందుబాటులో లేవనే విమర్శలే తప్ప. నిర్మాతలు ఆ అంశంపై వెంటనే ఆలోచిస్తే - ఫ్యామిలీ ఆడియన్సుని థియేటర్సుకి ఆహ్వానిస్తే పుష్ప కలెక్షన్ల పూనకంతో కొత్త రికార్డులు సృష్టించే ఛాన్స్ సుస్పష్టం.!
పంచ్ లైన్: బన్నీ స్పార్కు - సుక్కు మార్కు !
సినీజోష్ రేటింగ్: 3/5