సినీజోష్ రివ్యూ లక్కీ భాస్కర్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ, రాంకీ, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, సచిన్ కేడ్కర్, సాయి కుమార్ తదితరులు
సినిమాటోగ్రఫి: నిమిష్ రవి
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
నిర్మాత: నాగవంశీ సూర్యదేవర, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
రిలీజ్ డేట్: 2024-10-31
మలయాళ హీరోనే అయినా మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ తో సినిమాలు చేసేందుకు తెలుగు దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దుల్కర్ ఇమేజ్ కి సరిపోయే కథలతో అతన్ని లాక్ చేస్తున్నారు. అలానే క్లాస్ మూవీస్ స్పెషలిస్ట్ అయిన దర్శకుడు వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ తో నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్ లో లక్కీ భాస్కర్ ని తెరకెక్కించారు. పలుమార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ చివరికి దీపావళి పండగను క్యాష్ చేసుకునే ఉదేశ్యంలో మరికొన్ని సినిమాలతో గట్టి పోటీకి సిద్ధపడింది లక్కీ భాస్కర్. ప్రెస్ షోలను వ్యతిరేఖించే నిర్మాత నాగవంశీ లక్కీ భాస్కర్ ను ప్రీమియర్స్ కు దించడం, లక్కీ భాస్కర్ టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చెయ్యడం తో ఈ రోజు విడుదలైన లక్కీ భాస్కర్ పై అంచనాలు పెరిగాయి. మరి ప్రేక్షకుల అంచనాలను లక్కీ భాస్కర్ అందుకున్నాడో, లేదో సమీక్షలో చూసేద్దాం.
లక్కీ భాస్కర్ స్టోరీ:
మిడిల్ క్లాస్ లో పుట్టిన భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) బ్యాంకులో క్యాషియర్. చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ కోసం నానా తంటాలు పడుతూ ఉంటాడు. బ్యాంకు లో నిజాయితీగా కనిపించే భాస్కర్ కి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు వచ్చినా ప్రమోషన్ మాత్రం ఇవ్వరు.. కుటుంబాన్ని పోషించడం భారంగా మారడంతో భాస్కర్ ఓ నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం వలన భాస్కర్ చిక్కుల్లో పడ్డాడా, లేదంటే డబ్బు సంపాదించి హీరో అయ్యాడా అనేది లక్కీ భాస్కర్ మిగతా కథ.
లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లే:
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితులపై ఎన్నో సినిమాలు తెరకెక్కినా లక్కీ భాస్కర్ కథను మాత్రం దర్శకుడు వెంకీ అట్లూరి ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకుడు ఫిదా అవుతాడు. అంతేకాదు ఈ కథకు తొందరగా కనెక్ట్ అయ్యేలా కథనం కనిపిస్తుంది. ఫ్యామిలీ కోసం తపన పడే వ్యక్తి అదే ఫ్యామిలీ కోసం తప్పుడు మార్గంలోకి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు చూపించాడు. భాస్కర్ పాత్రపై జాలి కలిసాగిస్తూనే అతనేం చేసినా కరెక్ట్ అనేలా ఆడియన్స్ ను కథలో ఇవాల్వ్ చేసిన విధానం బాగుంది.
సీబీఐ అరెస్ట్‌తో కథ ఇంటెన్స్‌గా, సీరియస్ నోట్‌లో మొదలైనప్పటికీ.. వెంటనే ఫ్యామిలీ జోన్‌లోకి తీసుకెళ్లి సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చిన విధానంతోనే ప్రేక్షకులు బలంగా కనెక్ట్ అయిపోతారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఇంటెలిజెంట్, బ్రిల్లియెంట్ స్క్రీన్ ప్లే సినిమాను ఓ రేంజ్‌కు చేర్చింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగదీత అనిపించినా కొన్నిసన్నివేశాల్లో ఎమోషన్స్ జొప్పించిన విధానం సినిమాకు బలంగా మారింది. ఒక్కో డైలాగ్స్‌తో కేక పెట్టించాడు దర్శకుడు వెంకీ అట్లూరి.
లక్కీ భాస్కర్ ఎఫర్ట్స్ :
ఎప్పటిలాగే దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో క్లాప్స్ కొట్టించేసాడు. తన నటనతో సినిమాని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. భాస్కర్ కేరెక్టర్ లో ఒదిగిన విధానం, ఆ పాత్రకు తగినట్టుగా మారిన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్ని అద్బుతంగా అనేలా ఉంటాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరీకి మొదటిసారి మంచి పాత్ర దక్కింది. సుమతి కేరెక్టర్ లో ఆమె కనిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. సెకండాఫ్‌లో మీనాక్షి దుల్కర్‌తో పోటీపడి నటించింది. ఇంకా ఈ చిత్రంలో నటించిన సచిన్ కేడ్కర్, సాయి కుమార్, సుధ,రాంకీ, కసిరెడ్డి, హైపర్ ఆది తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నీకల్ గా.. జీవీ ప్రకాశ్ BGM సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్‌తో కేక పెట్టించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కానివ్వండి, నిమిష్ రవి సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్, సన్నివేశాలను రిచ్‌గా క్లాస్ టచ్‌తో కెమెరాలో బంధించారు. అంతేకాదు ఆర్ట్ వర్క్ కారణంగా సినిమా పీరియాడిక్ మూడ్‌ను ఎలివేట్ చేసింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
వెంకీ అట్లూరి కథను చెప్పిన తీరు, రాసుకున్న స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. డైలాగ్స్ మాత్రం గుండెల్ని తాకుతాయి. డబ్బు సంపాదించడం అవసరం, ఇప్పుడు వ్యసనం అంటూ తండ్రి చెప్పే డైలాగ్, జూదం ఎంత గొప్పగా ఆడావ్ అన్నది కాదు, ఎప్పుడు ఆపాం అన్నది ముఖ్యం అంటూ చెప్పే డైలాగ్స్ బాగుంటాయి.
లక్కీ భాస్కర్ ఎనాలసిస్ :
దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపానికి, జీవీ ప్రకాశ్ BGM లక్కీ భాస్కర్ మూవీ ప్రమాణంగా నిలిచింది. వెంకీ అట్లూరి రాసుకొన్న పాత్రలు, తెరపైన ఆయా నటులు బిహేవ్ చేసిన విధానం ఈ సినిమాకు బలంగా నిలిచాయి. స్మూత్ గా సాగే కామెడీ, ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. లక్కీ భాస్కర్ ఈ దీపావళికి మూవీ లవర్స్ బెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు.
లక్కీ భాస్కర్ పంచ్ లైన్: దుల్కర్ హ్యాట్రిక్
లక్కీ భాస్కర్ రేటింగ్: 3/5