Advertisement

సినీజోష్ రివ్యూ : దేవర


సినీజోష్ రివ్యూ: దేవర 

Advertisement

నటీనటులు: ఎన్ఠీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, అజయ్, శృతి మరాఠే, మురళి శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ 

మ్యూజిక్: అనిరుధ్

నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్, కొసరాజు హరి 

రచన, దర్శకత్వం: కొరటాల శివ  

రిలీజ్ డేట్: 27-09-2024

వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో యమా జోరుమీదున్న ఎన్టీఆర్ RRR తో పాన్ ఇండియా ఇమేజ్ పొందాక చేసిన చిత్రం దేవర.

గత చిత్రం నిరాశపరచడంతో కొరటాల శివ కసిగా కలం పట్టి ఎన్టీఆర్ అండతో అటెంప్ట్ చేసిన తొలి పాన్ ఇండియా చిత్రం దేవర. 

దేవర ఫీవర్ స్టార్ట్ చేసిన ఫియర్ సాంగ్ - గట్టిగ హిట్టయిన చుట్టమల్లే సాంగ్,

ఇంప్రెసివ్ ట్రైలర్ - ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ దేవరపై అంచనాలు పెంచేసాయి.

ఫాన్స్ కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుందన్న ఎన్టీఆర్ స్టేట్ మెంట్ 

ఓవర్సిస్ లో డాలర్స్ వర్షం కురిపించేసింది.

దేవరగా తారక్ ని తెరపై చూస్తున్నామనే ఫాన్స్ ఎగ్జయిట్ మెంట్ 

భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ని కుదిపేసింది.

మొత్తానికి నేడు మిడ్ నైట్ షోస్ నుంచే థియేటర్లలో దేవర జాతర మొదలైంది కనుక 

ఈ ప్రతిష్టాత్మక చిత్రం పంచిన కిక్కేంటో, తప్పిన లెక్కేంటో ఓ లుక్కేద్దాం రండి.. ! 

ఎర్ర సముద్రం.. రక్తం రంగు పులుముకుంది !

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని సముద్రానికి కొంత భాగం మేరకు ఎర్ర సముద్రం అనే పేరు ఏర్పడుతుంది. అది ఎందుకు వచ్చిందీ, అక్కడ ఎందుకు రక్తం ప్రవహించింది అన్నదే క్లుప్తంగా దేవర కథ. తొలుత ఆ ప్రాంత ప్రజల అవసరాల నిమిత్తం దేవర (ఎన్టీఆర్) తన మిత్రుడు భైర (సైఫ్ అలీఖాన్) తో కలిసి సంద్రంలో నౌకల ద్వారా చేస్తోన్న అక్రమ ఆయుధాల రవాణాలో భాగమవుతాడు. అయితే తప్పని, అందరికీ ముప్పని గ్రహించక ఆపేద్దాం, ఆ పని మానేద్దాం అంటాడు. అందుకు ఒప్పుకొని భైరతో దేవర సమరం మొదలవుతుంది. ఇక ఆయుధాల ప్రతాపం, రుధిర ప్రవాహంతో ఎర్ర సముద్రం.. రక్తం రంగు పులుముకుంటుంది. సంద్రాన్ని శాసించాలనుకునే భైర - సంద్రం జోలికి రావాలంటేనే భయపెట్టే దేవరల వార్ ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు కొనసాగిందో, ఇందులో దేవర తనయుడు వర (ఎన్టీఆర్) ఎలా భాగమయ్యాడన్నదే దేవర పార్ట్-1 తక్కిన కథ.

ఎన్టీఆర్ నటన.. రక్తాన్ని ఉప్పొగించింది !

ఆరేళ్ళ విరామం తర్వాత సోలో హీరోగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ నిజంగానే ఆకలితో ఉన్న టైగర్ లా చెలరేగిపోయాడు. సాటిలేని నటనతో ఆన్ స్క్రీన్ అదరగొట్టాడు. సాలిడ్ ఫైట్స్ తో ప్రత్యర్థుల్ని బెదరగొట్టాడు. సూపర్బ్ స్టెప్పులతో ప్రేక్షకుల కళ్ళు చెదరగొట్టాడు. ఎమోషనల్ ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ ప్రేక్షకాభిమానుల రక్తాన్ని ఉప్పొగించేలా ఉంది. ముఖ్యంగా దేవర - వర రెండు పాత్రల పోషణలో తను చూపిన వైవిధ్యానికి వహ్వా ఎన్టీఆర్ అనాల్సిందే. మరీ మితమైన పాత్రలో కనిపించిన జాన్వీ కపూర్ చుట్టమల్లే పాటలో మాత్రం చూపు తిప్పుకోలేంత అమితంగా ఆకర్షించింది. సైఫ్ అలీఖాన్ భైర పాత్రకి సరిగ్గా సెట్ అయ్యాడు. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, అజయ్, శృతి మరాఠే, మురళి శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు తమ తమ పాత్రలకున్న పరిధిలో పని కానిచ్చారు.

కొరటాల పని తీరు.. రక్తాన్ని మరిగించింది !

కొరటాల పనితీరుపై కొన్ని సందేహాలున్నా, ఎన్టీఆర్ తో కాంబినేషన్ కనుక ఖచ్చితంగా ప్రాణం పెట్టేస్తాడనీ - భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తాడనీ నమ్మారు అభిమానులు. అందుకు తగ్గట్టే భారీ సెటప్ కుదిరింది. భారీ బడ్జెట్ అమరింది. భారీ తారాగణం కలిసింది. భారీ సాంకేతిక వర్గం చేరింది. భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ స్థాయి విడుదల జరిగింది. అన్నీ ఉన్నా... అన్న చందాన అభిమానులకు మాత్రం చివరికి భారీ నిరాశే మిగిలింది. ఓవైపు ఎన్టీఆర్ నట విశ్వరూపంతో ఊగిపోతుంటే, మరోవైపు అనిరుధ్ నేపథ్యం సంగీతంతో ఊపేస్తుంటే కొరటాల మాత్రం ఉసూరుమనిపించే కథనంతో తమ రక్తాన్ని మరిగించేశారని మండిపడుతున్నారు దేవర వ్యూవర్స్. ప్రథమార్ధం వరకు బాగానే ఉన్నా.. ద్వితీయార్ధంలో సినిమా వేగం మందగించడం, క్లైమాక్స్ ట్విస్ట్ కిక్ ఇవ్వకపోవడానికి కారణం దేవరను రెండు పార్టులుగా విభజించడమే అనేది సర్వత్రా వ్యక్తం అవుతోన్న కంప్లయింట్. 

దేవర టీమ్.. రక్తాన్ని చిందించింది !

కొరటాల పనితీరు ఎలా సాగినా, సినిమాని ఎంత సాగతీసినా ఇతర సాంకేతిక బృందమంతా దేవర కోసం రక్తం చిందించారా అనే స్థాయిలో శ్రమించారు. అందులో ప్రథముడు అనిరుధ్. కథ వీక్ గా ఉన్నా, కథనం డ్రాగ్ అవుతున్నాదేవర కంటెంట్ కి తన లెవెల్ బెస్ట్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు అనిరుధ్. అబ్బో అని ఆశలు రేపిన ఆయుధ పూజ సాంగ్ ప్రెజెంటేషన్ ప్రాబ్లెమ్ తో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా, డాన్సింగ్ నెంబర్ దావుడి ఎడిటింగ్ లో ఎగిరిపోయినా ఫియర్ సాంగ్ ఫాన్స్ కి పూనకాలు పుట్టించింది. చుట్టమల్లే పాట ఆడియన్స్ ఆశించే ఆహ్లాదకరమైన ట్రీట్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం తన మార్క్ అండ్ స్పార్క్ తో అదరగొట్టాడు అనిరుధ్. రత్నవేలు సైతం దేవర కు విజువల్ గ్రాండియర్ ఇచ్చేందుకు విపరీతంగా కష్టపడ్డాడు. ముఖ్యంగా సముద్రం ఎపిసోడ్స్ ని హ్యాండిల్ చేయడం ఆషామాషీ కాదు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తన ప్రత్యేకతను మరోమారు ప్రదర్శించారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎవరూ అర్ధం చేసుకోలేని ఎంతో కష్టం పడి ఉంటేనే కొరటాల సాగతీత బారినుంచి దేవర ఈ మాత్రం బయటపడ్డాడని భావించాలి. 

దేవర విశ్లేషణ.. రక్తమే మిగిలింది !

వీలైనన్ని ఆయుధాలతో విధ్వంసం సృష్టిస్తూ రక్తపుటేరులు పారించిన దేవరకు చివరకు ఆ రక్తమే మిగిలింది. రెండు భాగాల ప్రణాళికతో ప్రాజెక్టు ప్రకటించినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది ఫస్ట్ పార్ట్ విషయంలోనే. ఎందుకంటే, ఆ కథ, కథనాలు, ఆ ప్రపంచం, ఆ ప్రభావాలే రెండో భాగానికి దర్జాగా ద్వారాలు తెరుస్తాయి. లేదా దారులు మూసేస్తాయి. కథలోని కీలక అంశాలు, పాత్రల తీరుతెన్నులు, లోతుపాతులు అన్నీ రెండో భాగంలోనే చూపించాలి అనుకుంటే ఏమవుతుందని అనేదానికి దర్పణంగా మారింది దేవర. భారీ ఓపెనింగ్స్ పొందినప్పటికీ - అంతే భారీ స్థాయిలో ఈ తరహా వ్యాఖ్యలు పొందుతోన్న దేవర బాక్సాఫీస్ భారమంతా ఇక ఎన్టీఆర్ దే.! 

పంచ్ లైన్ : దేవర - ఫాన్స్ కి మాత్రమే సోదర !

సినీజోష్ రేటింగ్ : 2.5/5

Cinejosh Review: Devara:

Devara telugu review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement