సినీజోష్ రివ్యూ: గుంటూరు కారం
బ్యానర్: హారిక హాసిని క్రియేషన్స్
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: S.S థమన్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: ఎస్ రాధాకృష్ణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
రిలీజ్ డేట్: 12-01-2024
సంక్రాంతి సీజన్‌లో సూపర్ స్టార్ మహేష్-త్రివికమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన మూవీ వస్తుంది అంటే.. ఆ ఊపే వేరు. పల్లెటూర్లలో పందెం కోళ్లు కొట్లాడుకుంటే.. చూసేవారి సందడి ఎలా ఉంటుందో.. థియేటర్స్ ఎదుట సూపర్ స్టార్ ఫాన్స్ రచ్చ అలా ఉంటుంది. ఇక మహేష్ బాబుని అతడులో సీరియస్‌గా, ఖలేజాలో కామెడీ చేయిస్తూ దేవుడిగా చూపించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. గుంటూరు కారంలో అదే మహేష్‌ని ఊర మాస్‌గా చూపించాలనుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత జోడి కట్టిన త్రివిక్రమ్-మహేష్.. ఈసారి పూనకాలు తెప్పిస్తారని సూపర్ స్టార్ ఫాన్స్ మాత్రమే కాదు, సగటు ప్రేక్షకుడు నమ్మకంతో వున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీలని హీరోయిన్‌గా రంగంలోకి దించి.. మరో బ్యూటీ మీనాక్షి చౌదరితో మాస్-యాక్షన్ ఎంటర్టైనర్‌కి గ్లామర్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్. తనెంత చెబితే అంత అన్నట్టుగా త్రివిక్రమ్‌కి ఆస్థాన నిర్మాత అయిన రాధాకృష్ణ(చిన బాబు) దొరికారు. అంతేకాకుండా రమణగాడ్ని చూడగానే మజా వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఈల వేయాలనిపిస్తుంది అంటూ పెంచిన హైప్ ఒకవైపు.. కుర్చీ మడతపెట్టి వెబ్రేషన్స్ మరోవైపు. ఇన్ని పాజిటివ్ థింకింగ్స్ మధ్య గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గుంటూరు కారంలో ఘాటు ఎంత ఉందీ అనేది సమీక్షలో చూద్దాం..
గుంటూరు కారం స్టోరీ
రమణ అలియాస్ భోగినేని వెంకటరమణ (మహేష్ బాబు) ఐదేళ్ల వయసులోనే తల్లి వసుంధర (రమ్యకృష్ణ), తండ్రి సత్యం (జయరామ్) విడిపోవడంతో గుంటూరులో ఉన్న అత్త (ఈశ్వరీరావు) దగ్గరే పెరుగుతాడు. తల్లి ప్రేమను పొందడం కోసం పాతికేళ్లుగా ఎదురుచూసిన రమణకి.. తల్లికి దగ్గరవుదామనుకున్న ప్రతిసారి వసుంధర తండ్రి వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) అడ్డుపడుతూ ఉంటాడు. రమణ తల్లి వసుంధర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. వసుంధర రాజకీయ జీవితానికి అడ్డంకిగా ఉన్న రమణని.. తన తల్లితో ఎలాంటి సంబంధం లేదని సంతకం చేయమని బెదిరిస్తూ ఉంటాడు తాత (ప్రకాష్ రాజ్). మరి తల్లి ప్రేమ, పిలుపు కోసం ఎదురు చూసే రమణ, వెంకటస్వామి అడిగినట్టుగా తల్లికి దూరమవ్వడానికి ఒప్పుకుంటాడా? అందుకు సంతకం చేశాడా.. లేదా? అనేది సింపుల్‌గా గుంటూరు కారం కథ.
గుంటూరు కారం స్క్రీన్‌ప్లే:
సినిమాకు కావాల్సిన బలమైన పాయింట్‌ను తొలి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ ఆ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్‌లో ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్‌ను తీసుకొచ్చారు. మహేష్ ఎనర్జిటిక్ ఎంట్రీ అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది. తెలిసిన కథనే తన మార్క్ స్టయిల్లో ప్రెజెంట్ చేసే త్రివిక్రమ్ ఈసారి అందులో పూర్తిగా విఫలమయ్యారు. తల్లి-కొడుకుల నడుమ భావోద్వేగాలని చూపించడంలో ఫెయిల్ అయ్యారు. మహేష్ ని గుంటూరు-హైదరాబాద్ మధ్యన తిప్పడం, నాది నెక్లెస్ గొలుసు, ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్సులు, ఇంటర్వెల్‌కు భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఫస్టాఫ్‌ను ముగించారు. సెకండాఫ్ లో రమ్యకృష్ణకి మహేష్ కి మధ్యన ఎమోషనల్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకుడికి క్లైమాక్స్ కి చేరువయ్యే వరకు నిరాశే మిగులుతుంది. రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ క్యారెక్లర్లతో డిజైన్ చేసిన సీన్స్, లేడీస్ ఫైట్ ఎపిసోడ్, ప్రకాశ్ రాజ్- రావు రమేష్ కాంబో సీన్లు, మహేష్ తో సంతకం చేయించడం కోసం ప్రకాష్ రాజ్ చేసే సిల్లీ పనులు ఇవన్నీ ప్రేక్షకులని ఇబ్బంది పెట్టేవే. ప్రీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు తో గుంటురు కారం ముగించేశారు. ఇది చూసాక ఓ అత్తారింటికి దారేది, ఓ అల వైకుంఠపురములో గుర్తుకు వస్తుంది.. తప్ప గుంటురు కారంలో కొత్తగా చూడడానికి ఏమి కనిపించదు.
గుంటూరు కారం ఎఫర్ట్స్:
మహేష్ బాబు మరోసారి చితక్కొట్టారు.. తన నుంచి అసలు సిసలు మాస్ మసాలాను అభిమానులకి గుంటూరు కారంలో అందించారు. లుక్స్, పెర్ఫామెన్స్, మాస్ అప్పీరెన్స్, కామెడీ టైమింగ్, బాడీ ఈజ్, డాన్స్ నెక్స్ట్ లెవల్, నక్కిలీసు గొలుసు సాంగ్ కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో కానీ, కుర్చీ మడత పెట్టే సాంగ్ కానీ.. రమణగాడిగా గట్టిగానే ఘాటు చూపించారు. హీరోయిన్స్ లో శ్రీలీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్, గ్లామర్ పరంగాను, డాన్సులు పరంగాను మరోసారి తన మార్క్ చూపించింది. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఏదో ఉందంటే ఉంది. రెండు మూడు సీన్లకి పరిమితం చేశారు. రమ్యకృష్ణ పాత్ర త్రివిక్రమ్ గత సినిమాల్లోని సీనియర్ హీరోయిన్లను గుర్తు చేస్తుంది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, మురళీశర్మ, జయరామ్, రావు రమేష్ ఇలా పెద్ద నటులని త్రివిక్రమ్ సరిగ్గా వాడుకోలేకపోయారు. మిగతా నటులు తమ పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా.. ఈసారి తమన్ బీజియమ్ వర్కౌట్ అవ్వలేదు, ఇంట్రో సాంగ్, కుర్చీ మడత సాంగ్స్ అభిమానులని ఊపేశాయి.. ఒక పాట అరవింద సమేత సినిమాలోని పాటని గుర్తుకు తెస్తే.. మిగతా పాటలు చప్పగా అనిపించాయి. మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సూపర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
గుంటూరు కారం ఎనాలసిస్:
బలమైన నేపథ్యం ఉన్న కథకు బలమైన సన్నివేశాలు తోడైతే రిజల్ట్ సాలిడ్‌గానే ఉంటుంది. అందులోనూ మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ హై రేంజ్‌లో ఉంటాయి.. కానీ గుంటూరు కారంతో ఆ రేంజ్ అంచనాలను అందుకోలేకపోయారు. మాటలతో మాయ చేయడం అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు.. కొన్నిసార్లు కథ కూడా కచ్చితంగా కుదరాల్సిందే. స్టార్ హీరో ఉన్నాడు కదా అని.. ఎలా పడితే అలా తీస్తే ప్రేక్షకులు చూసేస్తారు అనుకుంటే పొరబాటే. 4 కామెడీ సీన్లు.. 3 యాక్షన్ సీన్లు రాసుకుంటే ప్రేక్షకులు మెచ్చరు. ఎమోషన్ కూడా బలంగా వర్కవుట్ అయినప్పుడే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది.. గుంటూరు కారంలో త్రివిక్రమ్ ఇదే మిస్ అయ్యారు. గుంటూరు కారంలో మదర్ సెంటిమెంట్ అనేది కథకి బేస్ పాయింట్ అయినా.. చివరి వరకూ కూడా తల్లీ కొడుకుల మధ్య బలమైన ఎమోషన్ సీన్ పడలేదు. ప్రీ క్లైమాక్స్‌లో తల్లీకొడుకుల మధ్య సీన్ లాంటిది ఇంటర్వెల్‌కి ముందు పడి ఉంటే.. సెకండాఫ్‌పై మరింత పట్టు ఉండేది. మహేష్ మ్యాజిక్‌ని.. ఆయన మేనరిజంని చూడ్డం తప్పితే.. కథకోసం కాదన్నట్టుగా మారింది పరిస్థితి. త్రివిక్రమ్ పెన్ పవర్ కనిపించేదే ఎమోషనల్ సీన్స్‌లో.. బంధాలకు, భావోద్వేగాలకు పెద్ద పీట వేసే త్రివిక్రమ్.. కథని ఎమోషనల్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ చేసే స్కోప్ ఉన్నా భారం మొత్తం మహేష్ మీదే వదిలేశారు.
ఇక మహేష్ మాత్రం తన జాబ్‌ని పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు. రమణగాడి పాత్ర వరకూ గుంటూరు కారం సినిమాకి ఫుల్ మార్కులే పడ్డాయి. కానీ అసలు కంప్లైంట్ అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే. కుటుంబ కథా చిత్రానికి జస్ట్ పొలిటికల్ టచ్ ఇచ్చారంతే. ఫస్టాఫ్‌లో నాది నకిలీసు గొలుసు, సెకండాఫ్‌లో కుర్చీ పాట ఫాన్స్ కు ఫుల్ మీల్స్.. ఎమోషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మ్యాటర్ వీక్ అయింది. మాస్ డాన్సులు, పంచ్ డైలాగులు వరకు గుంటూరు కారం పాస్ మార్కులు వేయించుకుంటుంది.. ఏ సీన్ ఎలా ఉన్నా, డైలాగ్ వచ్చినప్పుడల్లా.. అందరూ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ కోసమే వెతికారు.. అదే అన్నిచోట్లా మిస్ అయ్యింది.
సినీజోష్ పంచ్ లైన్: గుంటూరు కారం.. గురూజీదే నేరం
సినీజోష్ రేటింగ్: 2.25/5