సినీజోష్ రివ్యూ: సలార్
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, రామచంద్రరాజు, మైమ్ గోపి, ఝాన్సీ, టినూ ఆనంద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన గౌడ
మ్యూజిక్ డైరెక్టర్: రవి బస్రూర్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
నిర్మాత: విజయ్ కిరగందూర్
కథ, కథనం, దర్శకత్వం: ప్రశాంత్ నీల్
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2023
అపూర్వ విజయానికి అర్థం చెప్పింది బాహుబలి - అనూహ్య విజయానికి అద్దం పట్టింది K.G.F.
భాషాభేదాలు బద్దలుకొట్టింది బాహుబలి - భిన్న ప్రాంతాల కంచెలు తెంచింది K.G.F.
రెండూ రెండు భాగాలుగా వచ్చినవే - మొదటి భాగాన్ని రెండో భాగంతో మించినవే.
ఈ ప్రభంజనం ఇక్కడితో ఆగలేదు.
బాహుబలి కథానాయకుడితో K.G.F. దర్శకుడి కలయిక అంటూ
మరో సంచలనానికి తెరతీసింది. సలార్ పేరుతో తెరకెక్కింది.
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనే ప్రకటనతోనే ప్రకంపనలు రేపుతూ వచ్చిన ఈ సలార్ పై ఇటు రెబల్ ఫాన్స్ ఎంతగా ఆశలు పెట్టుకున్నారో, అటు మూవీ లవర్స్ ఎన్ని అంచనాలు పెంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అసలే హీరోకి నెక్సెట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ టాలెంట్ ప్రశాంత్ ది.
అసలు ఏ ఎలివేషన్ అక్కర్లేని ఆరున్నర అడుగుల పవర్ ఫుల్ కటౌట్ ప్రభాస్ ది.
మరి వీరిద్దరూ జత కలిశారు కనుక మాస్ జాతర జరిగే తీరుద్ది కదా.
అభిమానులందరి ఆకలినీ తీర్చే ఉంటుంది కదా.
ఆ విశేషాలేంటో చూద్దాం.!
Salaar: Part 1 – Ceasefire Telugu Review
సలార్ నిర్మాణం సుదీర్ఘ కాలం జరిగింది. సలార్ విడుదల తేదీ వాయిదా పడింది. సలార్ టీజర్ జస్ట్ ఓకే అనిపించుకుంది. సలార్ ట్రైలర్ మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సలార్ పబ్లిసిటీ మరీ మమ అనిపించేలా సాగింది. అయితే ఇన్ని ప్రతికూలతలు కూడా సలార్ విడుదల సమయానికి పటాపంచలు అయిపోయాయి. భారీ రేట్లు పెట్టినా సలార్ టిక్కెట్లు రెక్కలొచ్చిన పక్షుల్లా తేలిగ్గా ఎగిరిపోయాయి. ప్రభాస్ నుంచి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఆశిస్తోన్న ఫ్యాన్సు.. ప్రశాంత్ నీల్ పై కాన్ఫిడెన్సుతో ఆడియన్సు సలార్ కి అపూర్వ స్వాగతం పలికారు. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా ప్రతిచోటా సలార్ థియేటర్లకు క్యూ కట్టారు. మరీ గ్రాండ్ వెల్ కమ్ కి తగ్గట్టు సలార్ సరైన కంటెంట్ తెచ్చిందా.. సాలిడ్ ట్రీట్ ఇచ్చిందా..??
ప్రశాంత్ నీల్ కొత్త ఎత్తుగడ !!
సలార్ టీజర్ రిలీజ్ అయిన దగ్గర్నుంచీ K.G.F. నే పోలి ఉందంటూ ఆల్ మోస్ట్ అందరి నోటా ఒకే మాట వినిపించింది.. ఒకే కంప్లయింట్ వ్యక్తమయింది. అయితే అప్పటి కోలార్ గోల్డ్ ఫీల్డ్ వలెనే ఇప్పుడూ ఖాన్-సార్ అనే కల్పిత సామ్రాజ్యాన్ని సృష్టించినప్పటికీ, కథగా కొత్త ఎత్తుగడను ప్రయత్నించారు ప్రశాంత్ నీల్. కథలోని ప్రధాన పాత్రలైన దేవా (ప్రభాస్) - వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్)ల మధ్య బాల్యంలోనే ఏర్పడ్డ స్నేహ బంధాన్ని చూపించి, ఆపై కొన్ని కారణాల రీత్యా దేవా తన తల్లితో వేరే ఊరు వెళ్లిపోవడం, వెళుతూ వెళుతూ స్నేహితుడికో మాటివ్వడంతో కథనానికి కావాల్సిన పునాదిని వేసుకున్నారు. ఆపై పూర్తిగా వేరే కోణంలో వ్యవహారాన్ని ఆవిష్కరిస్తూ ప్రాణ హాని ఉన్న ఆద్య (శృతి హాసన్) కు అండగా నిలిచే వ్యక్తిగా దేవాను నిలిపారు. ముఖ్యంగా దేవాగా ప్రభాస్ పరిచయ సన్నివేశంతో పాటు, ప్రథమార్ధం లోని సగ భాగం వరకూ ప్రభాస్ వంటి మ్యాచో హీరోని, అందులోనూ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వర్ణించిన సలార్ ని మృదు స్వభావిగా చూపించడం విశేషం. ఆ విధంగా అభిమాన, ప్రేక్షకులను కాసేపు ఊరించిన ప్రశాంత్ నీల్ ఫైనల్లీ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లోకి టర్న్ చేసిన ఎపిసోడ్ తో మాత్రం వావ్ అనిపించేశారు. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ మరోమారు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ప్రత్యేకతను ప్రూవ్ చేసింది. ఇక ఖాన్-సార్ ప్రస్తావనతో ద్వితీయార్ధం లోకి ప్రవేశించాక ఆ సామ్రాజ్యాన్ని, ఆయా పాత్రలని పరిచయం చేస్తూ కాస్త తాత్సారం చేసినా, ఎమోషనల్ డ్రామాని వీలైనంత బలంగా నడుపుతూ వచ్చిన ప్రశాంత్ నీల్ ముగింపు దృశ్యాల్లో మళ్ళీ జూలు విదిల్చారు. ప్రభాస్ ని ప్రళయ రుద్రుడిలా మార్చేశారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ తో కథని క్లయిమాక్స్ కి చేర్చిన ప్రశాంత్ ముగింపులో ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. శౌర్యంగ పర్వం గా ప్రకటించిన సలార్ 2 వ భాగంపై అంచనాలను పదింతలు పెంచింది.
ప్రభాస్ నుంచి ఆశించే అసలు సిసలు ట్రీట్ !!
బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో - ఓహో అనిపించలేకపోయింది. రాధే శ్యామ్ బాధే మిగిల్చింది. అది ఆదిపురుష్ తోనూ కొనసాగింది. అయితే ఆయా చిత్రాల్లో ఏదైతే మిస్ అయిందో సలార్ తో అదే పటిష్టంగా పట్టుకొచ్చి ప్రేక్షకుల ముందు పెట్టారు ప్రభాస్. తన కటౌట్ కి తగ్గ క్యారెక్టర్ పడితే, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆ పాత్ర పవర్ ని అమాంతం పదింతలు పెంచెయ్యగల ప్రభాస్ సలార్ లోని దేవా రోల్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేసారు. తల్లితో సౌమ్యంగా, స్నేహితుడితో స్వచ్ఛంగా నడుచుకునే దేవా పాత్రలోని చిన్నపాటి అమాయకత్వం ప్రభాస్ తీరుకి అచ్చంగా అతికినట్లు సరిపోయింది. మరిక మాస్ ఎలివేషన్స్ అంటే డార్లింగ్ డైనమిజం ఎలా ఉంటుందో తెలిసిందేగా. ఓవైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొడుతూనే, మరోవైపు ఎమోషనల్ డ్రామా లోనూ ఆకట్టుకున్న ప్రభాస్ ఓవరాల్ గా రెబల్ స్టార్ నుంచి అందరూ కోరుకుంటున్న అసలు సిసలు ట్రీట్ ఇచ్చారు.
పాత్రలకు తగ్గ నటీనటులు - ప్రతిభావంతులైన టెక్నీషియన్లు
వరద రాజమన్నార్ పాత్రకి తన ఎంపిక సరైనదని చాటుకునేలా చక్కగా నటించాడు పృథ్వీరాజ్. ప్రభాస్ కీ - పృథ్వీరాజ్ కీ మధ్య ఫ్రెండ్లీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కానీ కథ రీత్యా ఇందులో పరిమిత నిడివే వున్న పృథ్వీరాజ్ పాత్రనీ, దేవా - వరదల మధ్య ఘర్షణనీ, సంఘర్షణనీ పార్ట్ 2 లో చూడొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే కథానాయికల్లా కాకుండా కథలోని ఓ కీలక పాత్రగా కనిపించింది శృతి హాసన్. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రీయ రెడ్డి, ఝాన్సీ, బాబీ సింహ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రవి బస్రూర్ స్వరపరిచిన పాటలు కథలో భాగంగా కలిసిపోయాయి కానీ, సమకూర్చిన నేపథ్య సంగీతం మాత్రం సలార్ బలం పెంచింది. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ ఇంకో పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. ఖాన్-సార్ ప్రపంచాన్ని కల్పించడంలో కళా దర్శకుని నైపుణ్యం కనిపించింది. ఎడిటింగ్ విభాగం ఎంతో కొంత మొహమాటపడ్డట్టు అనిపించింది. అందరినీ మించి ప్రత్యేకంగా ప్రశంసించాల్సింది యాక్షన్ కొరియోగ్రఫీని. ఇటు ప్రభాస్ స్టైల్ కీ - అటు ప్రశాంత్ మార్క్ కీ అనుగుణంగా కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్సెస్ రెబెల్ ఫ్యాన్స్ తో ప్రతి థియేటర్ లోనూ విజిల్స్ వేయిస్తున్నాయి.
అభిమానులకేనా.. అందరికీనా..?
తమ డార్లింగ్ రేంజుకి, ఇమేజుకీ తగ్గ మాంచి మాస్ సినిమా కోసం ఆవురావురుమంటూ ఆకలిగా వున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్సుకి సలార్ ఫుల్ మీల్స్ అనడంలో సందేహం లేదు. అయితే అభిమానులకేనా, అందరికీనా అనడిగితే - వయొలెన్స్ పట్ల బాగానే మోజు పడుతోన్న మన ప్రేక్షకుల తాజా అభిరుచి సలార్ కీ ఘన విజయాన్ని అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిపోర్ట్ పాజిటివ్ గానే ప్రచారంలో ఉంది. రెవిన్యూ ఓ రేంజ్ లో ఊపేస్తోంది. పోటీగా వచ్చిన సినిమా మ్యాటర్ వీక్ అనిపించుకుంది. క్రిస్మస్ నుంచీ న్యూ ఇయర్ వరకూ ఓపెన్ గ్రౌండ్ అందుబాటులోకి వచ్చింది. మరిక రెబల్ స్టార్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.. ప్రభాస్ ధాటికి ఖాన్-సార్ ఎరుపెక్కినట్టే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వెల్లువెత్తాలని ఆశిద్దాం.
పంచ్ లైన్: సలార్.. ప్రభాస్ ఆన్ ఫైర్ !
సినీజోష్ రేటింగ్: 3/5