సినీజోష్ రివ్యూ : హాయ్ నాన్న
బ్యానర్ : వైరా ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, విరాజ్ అశ్విన్, అంగద్ బేడీ, శృతి హాసన్ తదితరులు
ఎడిటింగ్ : ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : సాను వర్గీస్
సంగీతం : హషీమ్ అబ్దుల్ వాహబ్
నిర్మాతలు : మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల, మూర్తి KS
రచన, దర్శకత్వం : శౌర్యువ్
విడుదల తేదీ : 07-12-2023
నాకు నచ్చిన కథను
నిబద్దతతో చేస్తాను
అని తరచూ చెప్పే నేచురల్ స్టార్ నాని ఇది తన మనసును హత్తుకున్న కథ అంటూ నేడు హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈసారి కూడా మరో కొత్త దర్శకుడు శౌర్యువ్ కి అవకాశం ఇచ్చారు. మృణాళ్ ఠాకూర్ తో జత కట్టారు - శృతి హాసన్ తో స్టెప్పులేశారు. ప్రేమికుడిగా, భర్తగా, తండ్రిగా మూడు కోణాల్లో ముందుకొచ్చారు. మరి వినసొంపైన పాటలతోను, వినూత్నమైన పబ్లిసిటీతోను ఇన్నాళ్లూ ఆడియన్సుని ఆకర్షిస్తూనే వచ్చిన హాయ్ నాన్న థియేటర్స్ లో ఎంతవరకూ ఆకట్టుకున్నాడు, ఎటువంటి అనుభూతిని పంచాడు అనే అంశంలోకి వెళితే.....
స్టోరీ : ముంబైలో నివసించే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ విరాజ్ (నాని)కి తన కూతురు మహి (కియారా) అంటే ప్రాణం. ఆరోగ్య సమస్యతో పోరాడే ఆ పసి పాపకు ఏవేవో కథలు చెబుతూ, కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు విరాజ్. అయితే ఓ రోజు తనకు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. తండ్రి పెట్టిన కండిషన్ మేరకు కష్టపడి క్లాస్ ఫస్ట్ వచ్చి మరీ అమ్మ కథ కావాలని మారాం చేస్తుంది. కానీ విరాజ్ చెప్పకపోవడంతో అలిగిన ఆ చిన్నారి బయటికి వెళ్లిపోయి ఓ ప్రమాదానికి గురి కాబోతుండగా తనని కాపాడుతుంది యష్ణ (మృణాల్ ఠాకూర్). కూతురిని వెతుకుతూ వచ్చిన విరాజ్ ఇక తప్పక ఆమెకు అమ్మ కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ కథలో మహి తనకు అమ్మగా యష్ణను ఊహించుకుంటుంది. ఇంతకీ మహి తల్లి వర్ష ఎవరు, కూతురికి దూరంగా ఎందుకు ఉంటోంది, వర్షకీ - యష్ణకీ ఉన్న రిలేషన్ ఏంటి, అప్పటికే పెళ్లి నిశ్చయమై ఉన్న యష్ణ విరాజ్ ని ఎందుకు ప్రేమించింది వంటి పలు మలుపుల సమాహారమే హాయ్ నాన్న కథాంశం.
స్క్రీన్ ప్లే : ఓ సాధారణమైన కథని సాధ్యమైనంత హృద్యంగా తెర పైకి తెచ్చే ప్రయత్నమే హాయ్ నాన్న. ఇటువంటి అమ్మ నాన్నల ప్రేమకథలు మన ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కానీ ఈ కథనంలోని కొన్ని మలుపులు ఆకట్టుకునేలా అనిపిస్తాయి. అయితే తండ్రీ కూతుళ్ళ బంధంలో కనిపించిన బలం ఇతర ట్రాక్స్ లో లోపించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులో విరాజ్ - వర్ష, విరాజ్ - యష్ణ ల మధ్య సాగే రెండు ప్రేమ కథలు ఉన్నప్పటికీ ఆ రెండిటిలో ఒక్కటి కూడా ఇంప్రెస్ చేసేంత ఇంపాక్ట్ చూపించలేదు. ప్రేమ కలగడం - బ్రేకప్ జరగడం ఏదో కమ్ అండ్ గో అన్నట్టే తప్ప కదిలించేలా ఉండదు. అయితే ప్రథమార్థం కాస్త నిదానంగానే సాగినా... నిజానికి మహి ఎవరి కూతురు అనే మలుపుతో కథనంలో కదలిక తీసుకొచ్చి ద్వితీయార్ధాన్ని భావోద్వేగ భరితంగా నడిపించాడు దర్శకుడు. దాంతో విరాజ్, యష్ణ, మహి పాత్రలలోని సంఘర్షణతో రిలేట్ కాగలుగుతారు టార్గెట్ ఆడియన్స్.
ఎఫర్ట్స్ : నాని సహజ నటన గురించి సరికొత్తగా చెప్పేది ఏముంది. విరాజ్ పాత్రలో మరోమారు తన విలక్షణత చూపించారు నాని. బేబీ కియారతో కలిసి నాని పండించిన భావోద్వేగాలే ఈ సినిమా బలం. దసరా వంటి రస్టిక్ ఫిలిం, రగ్గడ్ రోల్ తర్వాత మళ్ళీ హాయ్ నాన్న కోసం కూల్ లుక్ లోకి వచ్చేసిన నాని చాలా ఎట్రాక్టీవ్ గా కనిపించారు. ఎమోషనల్ పర్ ఫార్మెన్స్ తో ఈ చిత్రాన్ని, పాత్రని వన్ ఆఫ్ హిజ్ బెస్ట్ గా నిలుపుకున్నారు. మృణాల్ ఠాకూర్ కూడా లుక్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ మంచి మార్కులే పొందుతుంది కానీ నాని - మృణాల్ మధ్య లవ్ స్టోరీకి కావాల్సిన కెమిస్ట్రీ లేకపోవడంతో ఆ ట్రాక్ కి రావాల్సిన రెస్పాన్స్ మిస్ అయింది. అయితే ప్రీ క్లైమాక్స్ సీన్స్ లో మాత్రం వాళ్లిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అనేది ఇండివిడ్యువల్ గా ప్రూవ్ చేసేసుకున్నారు. ఇక నటనలో ఆ ఇద్దరితో పోటీ పడి మరీ ఎక్కువ స్కోర్ చేసేసింది బేబీ కియారా. ఇన్నోసెంట్ లుక్ తో క్యూట్ గా మాట్లాడుతూనే, ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేసిన కియారా థియేటర్ నుంచి వచ్చేసాక కూడా ప్రేక్షకుల కళ్ళల్లో కదులుతూనే ఉంటుందని చెప్పొచ్చు. జయరామ్ పాత్ర కథలోని కీలక మలుపుకి దోహదపడితే, ప్రియదర్శి, అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్ తదితరులు కథనానికి తోడ్పడ్డారు. శృతి హాసన్ ఊపు నిచ్చే పాటలో ఊరిస్తూ మెరిసింది.
ఇక సాంకేతిక అంశాలన్నీ సముచితంగా అమరాయి. ముఖ్యంగా సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. మెలోడియస్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హాయ్ నాన్నను హాయిగా చూసేలా చేసాడు సంగీత దర్శకుడు హేషం. అలాగే సాను వర్గీస్ విజువల్స్ కూడా కలర్ ఫుల్ గా, కళాత్మకంగా అనిపిస్తాయి. ప్రొడక్షన్ ఫస్ట్ టైమే అయినా సున్నితమైన కథను ఎంచుకుని, మంచి నిర్మాణాత్మక విలువలతో క్లీన్ ఫామిలీ ఫిలిం ఇచ్చారు నిర్మాతలు. దర్శకుడు శౌర్యువ్ తనకు నాని అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయ శక్తులా కృషి చేసాడు. కథనం కాస్త కొత్తగానే రాసుకున్నా, మాటల్లోనూ మంచి మంచి మెరుపులున్నా అసలు కథ అంతా అందరూ ఊహించేసేదే కావడం హాయ్ నాన్న ఫలితాన్ని పరిమితం చేసేసింది.
ఎనాలసిస్ : హీరో నాని ముందు నుంచీ చెబుతూ వచ్చినట్టుగానే హాయ్ నాన్న అనేది ఓ చిన్న ఎమోషనల్ హై ఇచ్చే స్వీట్ అండ్ సాఫ్ట్ ఫిలిం. ఓ వైపు థ్రిల్లర్స్, మరోవైపు యాక్షన్ మూవీస్ ఉధృతంగా వస్తోన్న ప్రస్తుత దశలో చిల్డ్రన్స్ కోసం, ఫామిలీస్ కోసం ఒక సున్నితమైన సినిమాని ఇవ్వాలనుకున్న నాని సక్సెస్ ఫుల్ గా ఆ టాస్క్ ని కంప్లీట్ చేశారు. తను టార్గెట్ చేసిన ఆడియన్సుతో శెభాష్ అని కూడా అనిపించుకుంటారు. అయితే రివ్యూస్ విషయంలో, రెస్పాన్స్ విషయంలో ఢోకా లేని ఈ చిత్రానికి రెవిన్యూ అనేది మాత్రం ఆశించిన స్థాయిలో ఉంటుందా అనేది ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తోన్న సందేహం. చూద్దాం.. నాని ఎంతవరకూ లాక్కొస్తాడో.. ఈ నాన్న ఏ మేరకు రాబడతాడో..!!
పంచ్ లైన్ : హాయ్ నాన్న - హానెస్ట్ ఎటెంప్ట్ !
సినీజోష్ రేటింగ్ : 2.5/5