Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: యానిమల్


సినీజోష్ రివ్యూ: యానిమల్

Advertisement
CJ Advs

బ్యానర్ : T-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ 

నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా తదితరులు

సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా 

కథ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా

విడుదల తేదీ: 01-12- 2023  

భగభగ మండే అగ్నికి ధగధగలాడే ఆజ్యం తోడైతే

ఇక నిప్పుకీలలు ఉప్పెనల్లే ఎగిసిపడవా... 

జోరున కురిసే వానకి హోరున వీచే గాలి జతయితే 

ఆ తాకిడికి లోకమంతా తత్తరపడదా... 

ఆల్ మోస్ట్ అలాంటిదే జరిగింది రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి ల కలయితో.! 

యునానిమస్ గా అందరూ అద్భుత నటుడని అంగీకరించే రణబీర్  

యునిక్ డైరెక్టర్ అనే గుర్తింపుని సంపాదించుకున్న సందీప్ 

చేతులు కలిపారు. ప్రాజెక్ట్ కై పావులు కదిపారు. 

తామిద్దరం ఓ వైల్డ్ యానిమల్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తామంటూ ప్రకటించారు. 

అక్కడ్నుంచీ మొదలైంది అసలు హంగామా. 

వారిద్దరూ కలిసి సినిమా చెయ్యాలని అనుకున్నారో.. 

కసిగా సినిమా తియ్యాలని అనుకున్నారో కానీ 

యానిమల్ కి సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ ఇచ్చినా 

అది వైరల్ అవుతూనే వుంది. సోషల్ మీడియాలో సెగలు రేపుతూనే వచ్చింది. 

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ట్రైలర్ ఇంజెక్ట్ చేసిన కిక్కుతో 

దేశమంతా యానిమల్ ఫీవర్ వ్యాపించేసింది. 

యువతరమైతే యానిమల్ మ్యానియాలో పూర్తిగా మునిగిపోయింది. 

మరింతటి భారీ అంచనాల నడుమ 

నేడు థియేటర్స్ లో ఘర్జించేందుకు వచ్చిన ఈ యానిమల్ 

ఎంత వైల్డ్ గా ఉందో...  ఎందుకంత వయొలెంట్ గా మారిందో రివ్యూలో చూద్దాం..!

యానిమల్ స్టోరీ రివ్యూ:

స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు. రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) బల్బీర్ సింగ్ కి కుమారుడు. విజయ్ కాస్త అగ్రెసివ్. తన అక్కను కాలేజ్ లో ర్యాగింగ్ చేశారని కాలేజీకి గన్ తీసుకెళ్లి అక్కడి స్టూడెంట్స్ ని భయపెడతాడు. కొడుకు రణ్ ప్రవర్తన బల్బీర్ సింగ్ కి అస్సలు నచ్చదు. దానితో కొడుకుని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. అక్కడినుంచి వచ్చాక బావతో జరిగిన గొడవ కారణంగా తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెడుతుంది. రణ్ విజయ్ సింగ్ అమెరికా వెళ్ళిపోయి ఏడెనిమిదేళ్లు తండ్రికి దూరంగానే ఉంటాడు. కానీ తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి ఇండియా వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళని చంపేస్తా అంటూ శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అనేది యానిమల్ పూర్తి కథ.  

యానిమల్ ఎఫర్ట్స్:

సంజు లో రణబీర్ కపూర్ నటన చూసాక ఇప్పుడు అతని పెరఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సంజయ్ దత్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని తాను చేసినా సరే, రణబీర్ అంత బాగా చేయలేరని కాంప్లిమెంట్స్ వచ్చాయి. యానిమల్ లో రణ్ విజయ్ సింగ్ పాత్రకు రణబీర్ ప్రాణం పోశారు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా ప్రతి వివిధ దశలో అద్భుతంగా కనిపించాడు. రణబీర్ కపూర్ తర్వాత సినిమాలో హైలైట్ అంటే బాబీ డియోల్ నటన. ఆయన కేవలం కళ్ళతో భయపెట్టారు. కాకపోతే బాబీ డియోల్ స్క్రీన్ స్పేస్ తక్కువ. రణబీర్, బాబీ మధ్య యాక్షన్ సీన్ డిజైనింగ్ బావుంటుంది. పృథ్వీరాజ్ పాత్ర నిడివి తక్కువ. కానీ ఆ పాత్రకి ఇంపాక్ట్ ఉంటుంది. రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటనలో సీనియారిటీ చూపించారు. గీతాంజలి పాత్రకు రష్మిక మందన్న న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ సన్నివేశాలకి క్లాప్స్ పడతాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి అలాగే మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా..

హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. దానితో హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. అమిత్ రాయ్ కెమెరా వర్క్ టాప్ క్లాస్. ఎడిటర్ సందీప్ రెడ్డి వంగా కావడంతో దర్శకుడిగా తాను తీసిన సన్నివేశాలపై ప్రేమ ఎక్కువ కావడంతో కత్తెర వేయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. అందుకే సెకండ్ హాఫ్ లో అక్కర్లేని సీన్స్ ఇబ్బంది పెట్టాయి, నిడివిని పెంచేసాయి. T-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. 

విశ్లేషణ:

సోది కథలతోనే కమర్షియల్ సినిమాలు కాసులు కొల్లగొట్టొచ్చు. సో సో గా అనిపించే ప్రేమకథలు పాస్ అయిపోవచ్చు. కానీ ఇలా ఓ పర్టిక్యులర్ పర్సెప్షన్ తో కొందరు దర్శకులు చేసే ప్రయత్నాలకు మిక్సడ్ రెస్పాన్స్ రావడం మన దగ్గర మామూలే. జనరల్ ఆడియన్సుకి నచ్చేసే ఇలాంటి సినిమాలు జనరేషన్ గ్యాప్ వచ్చేసినవారికి ఎక్కకపోవచ్చు. A సర్టిఫికెట్ యానిమల్ థియేటర్ కి వెళ్లి K విశ్వనాధ్ సినిమా ఆశించే చాదస్తపు జనం సంగతి వదిలేస్తే... కుర్రకారుకి కిర్రెక్కించి, మాస్ ఆడియన్సుకి మాంచి మసాలా ట్రీట్ ఇచ్చే సినిమా యానిమల్. అఫ్ కోర్స్... సినిమా నిడివి పై, సినిమాలోని హింసపై, బోలెడు ఉన్న బోల్డ్ డైలాగ్స్ పై కంప్లైట్స్ ఉండొచ్చు. కానీ కట్టిపడేసే ఎమోషనల్ డ్రామా ముందు, ఎక్సట్రార్డినరీ పర్ ఫార్మెన్సుల ముందు అవి ఇట్టే కొట్టుకుపోతాయి. అందుకే ఆ భావోద్వేగాలకు కనెక్ట్ అయిన ఆడియన్స్ యానిమల్ ని కల్ట్ క్లాసిక్ అంటున్నారు. అసలు కథని వదిలేసి కొసరు సాకులు వెతికే వీరులు బోరుమంటున్నారు. పాపం.. వాళ్లకి జూలో ఉండే యానిమల్స్ కీ... అడవిలో తిరిగే యానిమల్స్ కీ డిఫరెన్స్ తెలియదేమో.!

ఫినిషింగ్ టచ్:

తొలి చిత్రం అర్జున్ రెడ్డి తోనే తన ప్రత్యేక నైజం చాటుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ కి వెళ్లినా, బడా స్టార్ దొరికినా కూడా తన తీరు మారదంటూ మరింత ఘాటుగా మలిచారు యానిమల్ ని. స్థిరంగా నమ్మి రాసుకున్న స్క్రిప్ట్ కి అంతే బలంగా నిలబడుతూ, ఆర్టిస్టుల నుంచి అద్భుతమైన అవుట్ ఫుట్ రాబడుతూ ఆద్యంతం అనుకున్నది అనుకున్నట్టు తెరపైకి తెచ్చారు సందీప్. ఈ ప్రాసెస్ వల్ల కథలో కాస్త నస పెరిగినా, కథనం నిదానించినా మళ్ళీ క్లయిమాక్స్ కాపాడేసింది సినిమాని. ప్రస్తుతం పబ్లిక్ లో ఉన్న క్రేజ్ వైజ్ అయితే టాక్ ఎలా ఉన్నా, రివ్యూస్ ఎలా వచ్చినా యానిమల్ వీకెండ్ రాకింగ్ తథ్యం. ఆపై ఈ వైల్డ్ యానిమల్ కి, బోల్డ్ కంటెంట్ కి బాగా కనెక్ట్ కాగలిగే యూత్ ఆడియన్సే ఫీడర్స్ అవుతారు. బాక్సాఫీస్ ఫేట్ డిసైడర్స్ అవుతారు.!

పంచ్ లైన్ : బోల్డ్ అండ్ వైల్డ్ యానిమల్ !!

రేటింగ్: 3/5

Cinejosh Review : Animal :

Animal Telugu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs