సినీజోష్ రివ్యూ: కస్టడీ
బ్యానర్ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్ తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి
ఎడిటర్: వెంకట్ రాజన్
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత:: శ్రీనివాస చిట్టూరి
దర్శకత్వం: వెంకట్ ప్రభు
విడుదల తేదీ: 12-05-2023
యువ సామ్రాట్ నాగ చైతన్య తొలిసారిగా తెలుగు - తమిళ బై లింగ్వల్ గా చేసిన సినిమా కస్టడీ. ఈ మధ్యే మానాడు తో తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బంగార్రాజు తర్వాత చైతు తో రెండో సారి జత కట్టింది కృతి శెట్టి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్వాలిటీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లతో ఇదేదో విషయం ఉండే సినిమాలా ఉంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసిన కస్టడీ నేడు (మే 12) న థియేటర్ల లో విడుదల అయ్యింది.
కస్టడీ స్టోరీ రివ్యూ:
1990 సంవత్సరం రాజమండ్రిలో సీఐ శివ ( నాగ చైతన్య), అంబులన్స్ కి దారి ఇవ్వడానికి ముఖ్యమంత్రి దాక్షాయణి ( ప్రియమణి) కారు ని అపడంతో అతడి పేరు మారుమ్రోగుతుంది. అదేసమయంలో అతడు చిన్ననాటి స్నేహితురాలు రేవతి( క్రితి శెట్టి) ని పెళ్ళి చేసుకోవడానికి ఆమె తల్లి దండ్రులు ఒప్పుకోకపోవడంతో, ఆమె ఒక రోజు సమయం ఇస్తుంది. శివ పోలీస్ స్టేషన్ నుండి ఆమెని కలవడానికి వచ్చేలోపు , అతడు రాజు ( అరవింద్ స్వామి) మరియు జార్జ్ ( సంపత్ రాజ్) నీ అరెస్ట్ చేస్తాడు. దీంతో అతడి జీవితంలో అనుకొని మార్పులు చోటుచేుకుంటున్నాయి. అవేమిటో పోలీస్ ఆఫీసర్ నటరాజ్ ( శరత్ కుమార్) ఎవరనేది తెరపై చూడాలి.
కస్టడీ స్క్రీన్ ప్లే రివ్యూ:
థ్రిల్లర్ లు ఎంగేజింగ్ గా తెరకెక్కిస్తాడనే పేరున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ద్విభాషా చిత్రం అనగానే కస్టడీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గ ప్రమోషనల్ కంటెంట్ కూడా డిజైన్ చేయడంతో సినిమా పై ప్రేక్షకులకు ఇంటరెస్ట్ ఏర్పడింది. హీరో, విలన్ ను కాపాడాలని ప్రయత్నిస్తాడు అని సినిమాలో కీ పాయింట్ ను ప్రమోషన్స్ లోనే రివీల్ చేయడంతో కస్టడీ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు. నిజానికి సినిమాలో దానికి కీ పాయింట్ అనడం కంటే ఓన్లీ పాయింట్ అనడం కరెక్ట్ గా ఉంటుంది. సినిమా కథే ఆ పాయింట్. మిగతా సరంజామా అంతా దాని చుట్టూ అల్లుకుందే. ఇంత చిన్న పాయింట్ మీద సినిమా అంతా ఇంటరెస్ట్ తగ్గకుండా నడపాలంటే బిగి సడలని స్క్రీన్ ప్లే ఉండాలి. సరిగ్గా కస్టడీ ఇక్కడే తేలిపోయింది. శివ ఫ్యామిలీ, ప్రేమ ఈ పాత్రలతో చిత్రం మొదలైనా రాజు గా అరవింద్ స్వామి పాత్ర ప్రవేశం తో ఊపందుకుంటుంది. ఇంటర్వల్ సమయానికి కథనం వేగవంతమయ్యి సెకండ్ హాఫ్ మీద అంచనాలు ఏర్పడేలా చేస్తుంది. కానీ, మరింత ఉత్కంఠభరితంగా ఉండాల్సిన ద్వితీయార్థంలో పోరాట దృశ్యాలు తప్ప ఇంకేమీ కనిపించవు. పతాక స్థాయికి చిత్రం ముగియగానే, ప్రేక్షకులు నిట్టూరుస్తూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ బయటకి వస్తారు.
కస్టడీ ఆర్టిస్ట్స్ రివ్యూ:
నాగ చైతన్య తన పాత్ర కోసం ఎంతో కష్ట పడ్డాడు. పోలీస్ పాత్ర కోసం తన ఆహార్యం మార్చుకున్నాడు. మాస్ అనే ముసుగులో పడకుండా నాగ చైతన్య దర్శకుని కి ఏం కావాలో అది సందర్భోచితంగా చేశాడు. కృతి శెట్టీకి అంత అవకాశం రాలేదు. చిత్రం సగ భాగం ఉన్నా, పాటలకే పరిమతమైంది. అరవింద్ స్వామి తన పాత్రలో అనేక భావాలను పండించాడు. తన పర్ఫార్మెన్స్ తో సన్నివేశాల్ని రక్తి కట్టించాడు. ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయింది. సంపత్ రాజ్, శరత్ కుమార్ లో పాత్రలకి తగ్గట్టు నటించారు. వెన్నెల కిషోర్ హాస్యం మాత్రం ఇబ్బంది పెడుతుంది.
కస్టడీ టెక్నిషియన్స్ రివ్యూ:
ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం ఆకట్టుకోలేదు. పాటలు కథనాని ఎఫెక్ట్ చేశాయి. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కథకి తగ్గట్టుగా ఉంది. మాటలు సాధారణంగా ఉన్నాయి. వెంకట్ రాజన్ కూర్పు సరిగ్గా లేదు. చాలా అనవసర సన్నివేశాలు ఉండటంతో మరీ సాగతీతగా అనిపిస్తుంది. ఎస్ఆర్ కతీర్ ఛాయాగ్రహణం కథకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి
కస్టడీ ప్లస్ పాయింట్స్:
కస్టడీ మైనస్ పాయింట్స్:
కస్టడీ ఎనాలసిస్:
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కస్టడీ ఎన్నో ఆశ మధ్య విడుదలైనా, అవన్నీ అడియాసలై ఆవిరవడానికి ఎంతో సేపు పట్టలేదు. కేవలం భారీ స్టార్ కాస్టింగ్ తోనే ప్రేక్షకుల్ని తమ కస్టడీలో పెట్టుకోవాలని అనే అపోహలుంటే, అవన్నీ కస్టడీ పటాపంచలు చేస్తుంది. బలమైన కథ, కథనమే, చిత్ర విజయానికి కారణమవుతాయని కస్టడీ మరో పెద్ద పాఠం నేర్పింది.
పంచ్ లైన్: స్టడీ గా లేని కస్టడీ
సినీజోష్ రేటింగ్: 2.25/5