Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: ఏజెంట్


సినీజోష్ రివ్యూ: ఏజెంట్ 

Advertisement
CJ Advs

బ్యానర్: ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ 

నటీనటులు: అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, సాక్షి వైద్య, డినోమోరియా, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, విక్రమ్ జిత్, అనీష్ కురువిల్లా తదితరులు 

కథ: వక్కంతం వంశీ 

ఎడిటింగ్: నవీన్ నూలి 

సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్ 

సంగీతం: హిప్ హాప్ తమిళ 

నిర్మాత: అనిల్ సుంకర 

దర్శకత్వం: సురేందర్ రెడ్డి 

విడుదల తేదీ: 28-04-2023

కష్టపడి పెంచిన కండలతో, క్యాజువల్ గా పెరిగిన జుట్టుతో ఏజెంట్ లుక్ లోకి వచ్చేసాడు అఖిల్. 

కరోనాని దాటుకుని, కాలికి తగిలిన దెబ్బను తట్టుకుని ఏజెంట్ సినిమా షూట్ చేసాడు సురేందర్. 

ప్రాజెక్ట్ లేట్ అవుతున్నా, బడ్జెట్ ఓవర్ అవుతున్నా ఏజెంట్ ని మోస్తూనే వచ్చారు సుంకర అనిల్. 

సినిమా ఎనౌన్స్ మెంట్ దగ్గర్నుంచీ స్టైలిష్ స్పై ఏక్షన్ థ్రిల్లర్ గా వెల్లడవుతూ వచ్చిన ఏజెంట్ అక్కినేని అభిమానుల్లో ఆశలు పెంచింది. అఖిల్ కి ఒక సాలిడ్ హిట్ రానుందనే అంచనాలు (అపోహలు) కల్పించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించేందుకు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అంగీకరించడం ఆడియన్సుకే కాక అక్కినేని నాగార్జునకు సైతం ఏజెంట్ పై నమ్మకాన్ని రప్పించింది. అందుకే ఏజెంట్ కి సంబందించిన ప్రమోషనల్ కంటెంట్ ఎంత వీక్ గా ఉన్నప్పటికీ సినిమాలో మ్యాటర్ ఉంటుందని భావించిన జనం నేడు విడుదలైన ఏజెంట్ ని బాగానే స్వాగతించారు. మరింతకీ ఈ ఏజెంట్ ఇంప్రెస్ చేశాడా.. ఇరిటేట్ చేశాడా అనేది సమీక్షిద్దాం.!

ఏజెంట్ స్టోరీ రివ్యూ: రా ఏజెంట్ కావాలని కలలు కనే రామకృష్ణ (అఖిల్) అందుకు చెందిన ప్రయత్నాల్లో మాత్రం విఫలమవుతూ ఉంటాడు. అయితే రా చీఫ్ కల్నల్ మహదేవ్ (మమ్ముట్టి) ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ కోసం రామకృష్ణను నియమిస్తాడు. ఇక గాడ్ (డినో మోరియా) అని పిలవబడే విలన్ మిషన్ రాబిట్ ఏమిటి, ఈ ఏజెంట్ అదెలా ఫేస్ చేసాడు, విద్య (సాక్షి వైద్య)తో అతని లవ్ జర్నీ, మిడిల్ లో మినిస్టర్ జై కిషన్ (సంపత్ రాజ్) ట్రాక్ వంటివి అన్నీ కలిసి కథని క్లయిమాక్సుకి చేరుస్తాయి.! 

ఏజెంట్ స్క్రీన్ ప్లే రివ్యూ: కొన్ని సినిమాలు ఆరంభంలో చకచకా కదిలి ఆపై చతికిల పడతాయి. మరికొన్ని మొదట్లో సోసోగా స్లో స్లో గా ఉన్నా తర్వాత పుంజుకుంటాయి. ఏజెంట్ కథనం మాత్రం మొదట్నుంచీ చివరివరకు ఒకే తరహా నిదానం, నీరసం కొనసాగించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేసింది. అర్ధం లేని క్యారెక్టరైజేషన్స్ తో, అస్సలు లాజిక్ లేని సీన్స్ తో, అసహనం కలిగించే లవ్ ట్రాక్ తో, అసందర్భంగా వచ్చేసే పాటలతో విసిగించేసి.. విరక్తి తెప్పించేసి థియేటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పేషంట్ అయ్యేలా చేసాడు ఏజెంట్. మొత్తం సినిమాలో మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ ఒక్కటే కాస్త ఊపు తెస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎంతోకొంత ఊరటనిస్తుంది.! 

ఏజెంట్ ఎఫర్ట్స్: ఏజెంట్ సినిమాకి మేజర్ ఎఫర్ట్ అండ్ మెయిన్ ఎస్సెట్ రెండూ అఖిల్ ఖాతాలోకే చేరతాయి. కథ, కథనాల్లో లోపం సినిమా ఫలితంగా మారుతుంది కానీ అఖిల్ తనని తను మార్చుకుని ఆ పాత్ర కోసం సిద్దమైన విధానంలో సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తుంది. అతని హార్డ్ వర్క్ ని అభినందించేలా చేస్తుంది. మమ్ముట్టికి ఎంత ముట్టిందో కానీ ఈ పాత్రని ఎందుకు అంగీకరించారో ఆయన అభిమానులకి అయోమయంగానే అనిపిస్తుంది. సాక్షి వైద్య జస్ట్ ఓకే మెటీరియల్ అనిపించుకుంది. డినో మోరియా, సంపత్, విక్రమ్ జిత్ అందరివీ మ్యాటర్ లెస్ క్యారెక్టర్సే. ఊర్వశి రథౌలా ఒక పాటకి పనికొచ్చింది. ఇక టెక్నిషియన్స్ లో ప్రేక్షకుల అక్షింతలు గట్టిగా వేయించుకోవడంలో పోటీ పడుతున్నారు చిత్ర దర్శకుడు - సంగీత దర్శకుడు. సెన్స్ లెస్ స్క్రిప్ట్ తో సురేందర్ సినిమా తీసి ఇచ్చేస్తే అందుకు తగ్గట్టే నాన్ సెన్సికల్ మ్యూజిక్ తో నస పెట్టేసాడు హిప్ హాప్ తమిళ. పాటల్లో ఒక్కటీ క్యాచీగా లేదే అనుకుంటే అంతకు మించిన వీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఏజెంట్ కి విలన్ గా మారిపోయాడు మ్యూజిక్ డైరెక్టర్. బట్ మెయిన్ విలన్ నేనే అంటూ, క్లయిమాక్స్ వరకూ సీట్స్ లో కూర్చోగలరా అంటూ ఆడియన్సుకి సవాల్ విసిరాడు డైరెక్టర్ సురేందర్. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ.. నవీన్ నూలి ఎడిటింగ్ బాగానే ఉన్నా వక్కంతం వంశి అందించిన కథ బాగుండి ఉంటే ఏజెంట్ రిజల్ట్ ఇంకోలా ఉండేది...  అఖిల్ కష్టానికి, అనిల్ ఖర్చుకి తగ్గ రిజల్ట్ వచ్చేది.! 

ఏజెంట్ ప్లస్ పాయింట్స్:

  • అఖిల్ అక్కినేని 
  • అఖిల్ అక్కినేని 
  • అఖిల్ అక్కినేని 

ఏజెంట్ మైనస్ పాయింట్స్:

  • వక్కంతం వంశీ కథ 
  • హిప్ హాప్ తమిళ సంగీతం 
  • సురేందర్ రెడ్డి దర్శకత్వం 

ఏజెంట్ ఎనాలసిస్: స్టైలిష్ మేకింగ్ తో, ఎలెక్ట్రిఫయింగ్ ఏక్షన్ ఎపిసోడ్స్ తో స్పై థ్రిల్లర్ తీసెయ్యాలనే ఆరాటమే తప్ప దానికి బడ్జెట్ పెంచేస్తే సరిపోదు.. సరైన సబ్జెక్ట్ సెట్ చేసుకోవాలనే సెన్స్ లేని ఎటెంప్ట్ ఏజెంట్. సమ్మర్ సీజన్ లో ఓ మోస్తరు సినిమాని కూడా ఏసీ థియేటర్స్ కోసం ఎంకరేజ్ చేసేసే ఆడియన్స్ ఉంటారు కానీ వాళ్ళని కూడా థియేటర్ దరిదాపుల్లోకి రానివ్వని దారుణమైన టాక్ తెచ్చేసుకున్న ఏజెంట్ ఏ రేంజ్ ఫెయిల్యూర్ అన్నది ఫస్ట్ వీకెండ్ లోనే తేలిపోవడం తథ్యం.!

పంచ్ లైన్: ఏజెంట్ - సెన్స్ లెస్ ఎటెంప్ట్ 

సినీజోష్ రేటింగ్: 2/5

Cinejosh Review: Agent:

Agent Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs