Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : సర్దార్


సినీజోష్ రివ్యూ : సర్దార్ 

Advertisement
CJ Advs

బేనర్ : ప్రిన్స్ పిక్చర్స్

తెలుగు రిలీజ్ : అన్నపూర్ణ స్టూడియోస్ 

నటీనటులు : కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజీషా విజయన్, లైలా, నిమ్మి, మునీశ్కాంత్ అశ్విన్, బాలాజీ శక్తివేల్ తదితరులు

సినిమాటోగ్రఫీ : జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్ : రూబెన్

ఫైట్స్ : దిలీప్ సుబ్బరామన్

సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్ 

నిర్మాత : ఎస్. లక్ష్మణ్ కుమార్ 

దర్శకత్వం : పి.ఎస్.మిత్రన్

విడుదల తేదీ :  21-10-2022

యుగానికి ఒక్కడు చిత్రం నుంచే తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన వెర్సటైల్ హీరో కార్తీ ఆపై ఊపిరి, ఖైదీ వంటి చిత్రాలతో మన ఆడియన్సుకి మరింత దగ్గరయ్యాడు. రీసెంట్ గా మల్టీస్టారర్ పొన్నియిన్ సెల్వన్ తో మరో భారీ బ్లాక్ బస్టర్ చవి చూసిన కార్తీకి దీపావళి సీజన్ లో మాత్రం తన వన్ మ్యాన్ షో అనదగ్గ సర్దార్ చిత్రంతో బరిలోకి దిగే అవకాశం దక్కింది. గతంలో విశాల్ హీరోగా అభిమన్యుడు వంటి యాక్షన్ థ్రిల్లర్ చేసి మంచి హిట్టు కొట్టిన పి.ఎస్.మిత్రన్ దర్శకుడు కావడంతో అటు తమిళ్ లోనే కాకుండా ఇటు తెలుగులోనూ సర్దార్ పై సముచిత అంచనాలు కనిపించాయి. దానికి తోడు కింగ్ నాగార్జున తమ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సర్దార్ రిలీజ్ చేసేందుకు రెడీ అవడంతో ఖచ్చితంగా మ్యాటర్ ఉన్న మూవీనే అయి ఉంటుందనే అభిప్రాయం ఏర్పడింది ప్రేక్షకులకి. అయితే హీరో కార్తీ, హీరోయిన్ రాశి ఖన్నా తప్ప ఇతర నటీనటులెవరూ తెలుగు వారికి తెలిసిన మొహాలు కాకపోవడంతో నేడు విడుదలైన ఈ చిత్రానికి రావాల్సినంత హైప్ రాలేదు కానీ కార్తీ గుడ్ విల్ తో రీజనబుల్ ఓపెనింగ్సే తెచ్చుకున్న సర్దార్ సంతృప్తి పరిచిందో.. సహనాన్ని పరీక్షించిందో సమీక్షలో చూద్దాం.

స్టోరీ : విజయ్ ప్రకాష్ (కార్తీ) అనే పోలీస్ ఇనస్పెక్టర్ కి పబ్లిసిటీ యావ ఎక్కువ. తాను చేసే ప్రతి పనిని మీడియా కవర్ చెయ్యాలని, జనాల్లో తనపై అటెన్షన్ ఉండాలని కోరుకుంటాడు. ఆఫ్ కోర్స్.. దానికీ ఓ ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అది తెరపై చూస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. అంత హైప్ కోరుకునే విజయ్ కి అనుకోకుండా ఓ అవకాశం దక్కడంతో కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సైనిక రహస్యాలు ఉన్న ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అవ్వడం పట్ల సిబిఐ, రా వంటి విభాగాలన్నీ పరిశోధిస్తుండగా  అది తాను సాధిస్తే సమున్నత గుర్తింపు లభిస్తుందని భావించిన విజయ్ ఇన్వెస్టిగేషన్ కి దిగుతాడు. ఆ విచారణలో అతనికి సర్దార్ అనే వ్యక్తి గురించి విస్మయం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఇక సర్దార్ తెర పైకి రాగానే కథ పూర్తి వేగం పుంజుకుంటుంది. అసలీ సర్దార్ ఎవరు, విజయ్ - సర్దార్ ల మధ్య సంబంధం ఏమిటి, పలు మలుపులతో సాగే ఈ కథనం చివరికి ఏ తీరం చేరుతుంది అనేదే బ్యాలన్స్ పార్ట్.!

స్క్రీన్ ప్లే : కాసేపు వినోదాన్నీ - కాసేపు విసుగునీ చవి చూపిస్తూ.. కాసేపు ఆసక్తినీ - కాసేపు అయోమయాన్ని కలిగించే ఈ కథలో అసలు అంశం సమాజహితమే అయినప్పటికీ సాగతీత ధోరణి సర్దార్ ని సవ్యమైన బాటలో సాగనివ్వలేదు. పొన్నియిన్ సెల్వన్ తరహాలోనే ఇందులోనూ మొదట్లో కాస్త ఆహ్లాదాన్ని అందించిన కార్తీ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాక సీరియస్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోయాడు. దేశద్రోహిగా ముద్ర పడ్డ సర్దార్ పాత్ర కథలోకి ప్రవేశించాక మరింత భావోద్వేగాన్ని సంతరించుకున్న కథనం ఆపై ఆద్యంతం అదే ఇంటెన్సిటీని కంటిన్యూ చేయడంతో పూర్తి యాక్షన్ డ్రామాగా మారిపోయింది సర్దార్. బట్ క్యారెక్టరైజేషన్స్ అన్నిటినీ బ్యాలన్స్ తప్పకుండా చూసుకోవడంలో సక్సీడ్ అయిన మిత్రన్ స్పై థ్రిల్లర్ అనే టాగ్ కి మాత్రం సర్దార్ తో న్యాయం చేసారు.

ఎఫర్ట్స్ : కార్తీ స్క్రీన్ ప్రెజెన్స్ సర్దార్ ఆయుధం. కార్తీ విభిన్న గెటప్పులే వీక్షకులకు వినోదం. టోటల్ గా కార్తీ పర్ ఫార్మెన్స్ అనేదే ఈ సినిమాకు ప్రధాన బలం.. ప్రాణం.! విభిన్న కోణాలున్న రెండు పాత్రల్లోనూ చెలరేగిపోయిన కార్తీ తనలోని పెక్యులియర్ పెర్ ఫార్మర్ ని సర్దార్ లో మరోసారి మనకు చూపిస్తాడు. ప్రథమార్ధం వరకు ఆడియన్సుని కాస్త ఎంటరటైన్ చేయాలని చూసిన కార్తీ సెకండ్ హాఫ్ లో మాత్రం నటుడిగా తనకు తనే సవాల్ విసురుకుంటూ సాగిపోయాడు. సర్దార్ గా కార్తీ అభినయాన్ని ఖచ్చితంగా అభినందించాలి. పక్కా కమర్షియల్ టైపులో కాకుండా ఈసారి పక్కా ప్రొఫెషనల్ అనిపించే లాయర్ గా చేసింది కానీ పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర కనుక రాశి ఖన్నాకి ఇక్కడా చుక్కెదురైందనే చెప్పాలి. మిగిలిన వాళ్లలో రజీషా విజయన్, చుంకీ పాండే, బాలాజీ శక్తివేల్ వంటి కొందరివి మాత్రమే చెప్పుకోదగిన పాత్రలు. మన ఎగిరే పావురం లైలా చాన్నాళ్ల తర్వాత సోషల్ యాక్టివిస్ట్ సమీరగా సర్దార్ లో కనిపించింది.

టెక్నిషియన్స్ లో యునానిమస్ గా అందరూ ముందు అప్రిషియేట్ చేసేది సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ ని. అతను ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అలాగే జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ, దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కంపోజింగ్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఎఫర్ట్ కి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఎడిటింగ్ వర్క్ పై కంప్లయింట్స్ వినిపిస్తాయి. ఈ రోజుల్లో చాలా ఎక్కువ అనిపించేలా 2 గంటల 46 నిముషాల నిడివితో సర్దార్ ఫైనల్ కట్ ఇచ్చిన డైరెక్టర్ మిత్రన్ సాగతీత సన్నివేశాలను కాస్త కుదించి ఉంటే సర్దార్ ఇంపాక్ట్ ఇంకో విధంగా ఉండేది. అలాగే నేల విడిచి సాము చేయకుండా అభిమన్యుడు తరహాలో వాస్తవికతను చూపగలిగి ఉంటే సర్దార్ రిజల్ట్ మరో స్థాయిలో వచ్చేది.

ఎనాలసిస్ : డిజిటల్ కరెప్షన్ అంశాన్ని ఎంతో ఆసక్తికర కథనంగా అభిమన్యుడు చిత్రంలో ఆవిష్కరించిన దర్శకుడు మిత్రన్ ఈ సర్దార్ కథలో జల వనరుల ప్రైవేటీకరణపై చర్చించారు. అయితే అటువంటి సామాజిక సమస్యని స్పై థ్రిల్లర్ గా మలచడం, హీరోయిజం ఎక్కువ ఎలివేట్ అయ్యేలా యాక్షన్ బ్లాక్స్ తో నింపడం కార్తీ ఫ్యాన్సుకి ఓకే కానీ సగటు ప్రేక్షకుడికి రుచించదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని తమిళ ఘాటు వాసన తెలుగువారికి నచ్చకపోవచ్చు. హీరోయిన్ ట్రాక్ కూడా అసలు కథలో ఇమడలేక ఇబ్బంది పెడుతుంది. కార్తీ నటన ఎంతగా కట్టిపడేస్తున్నా, అక్కడక్కడా ఆకట్టుకునే దృశ్యాలు తెరపైకి వస్తూనే వున్నా ఓవరాల్ గా మాత్రం ఓ మోస్తరు సినిమాగానే మిగిలింది సర్దార్. ఎందుకంటే ఇటువంటి యాక్షన్ డ్రామాలో ఎమోషనల్ కంటెంట్  కళ్ళకి మాత్రమే కనిపిస్తే సరిపోదు. హృదయాన్ని స్పృశించాలి. లేకుంటే ఏ సర్దార్ అయినా అర్ధ ఫలితంతో సరిపెట్టుకోవాల్సిందే.!

పంచ్ లైన్ : సర్దార్.. కార్తీ విభిన్న గెటప్పుల దర్బార్

సినీజోష్ రేటింగ్ : 2.75/5

Cinejosh Review : Sardar:

Sardar Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs