Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : గాడ్ ఫాదర్


సినీజోష్ రివ్యూ : గాడ్ ఫాదర్

Advertisement
CJ Advs

బేనర్ : సూపర్ గుడ్ ఫిలింస్ - కొణిదెల ప్రొడక్షన్స్

నటీనటులు : చిరంజీవి, సల్మాన్ ఖాన్ (ప్రత్యేక పాత్రలో), నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, మురళి శర్మ, సునీల్, బ్రహ్మాజీ,తదితరులు

మాటలు : లక్ష్మీ భూపాల 

ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్

ఎడిటింగ్ : మార్తాండ్ K వెంకటేష్  

సినిమాటోగ్రఫీ : నీరవ్ షా  

సంగీతం : S S థమన్

సమర్పణ : శ్రీమతి సురేఖ కొణిదెల

నిర్మాతలు : R.B.చౌదరి, N.V. ప్రసాద్ & రామ్ చరణ్  

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ రాజా

విడుదల తేదీ : 05-10-2022 

గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనేది KGF పాపులర్ డైలాగ్. అదే మాటను చిరంజీవి తనకు అన్వయించుకున్నారేమో అనిపించేలా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆయన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఇదే ఏడాది వేసవిలో ఆచార్యగా వచ్చిన చిరంజీవికి ఆ చిత్ర ఫలితం కలతని మిగిల్చింది. అయితే ఆ కలతనే కసిగా మలుచుకుని చిరు చాలా శ్రద్దగా, జాగ్రత్తగా చేసిన సినిమా గాడ్ ఫాదర్. ఇటు స్క్రిప్ట్ ని పకడ్బందీగా రాసుకుంటూ - అటు క్యాస్టింగ్ ని పర్ ఫెక్ట్ గా సెట్ చేసుకుంటూ కరెక్ట్ కేలిక్యులేషన్స్ తో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అందుకు తగ్గట్టుగానే ఆ అవుట్ ఫుట్ కి అంతటా అద్భుత స్పందన పొందుతోంది. మరి BOSS IS BACK అంటూ మెగా ఫ్యాన్స్ హంగామా చేసేలా చిరు ఇచ్చిన ఈ దసరా కానుక గాడ్ ఫాదర్ విశేషాలేమిటో సమీక్షలో చూద్దాం.

స్టోరీ : పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే జోనర్ లోనే గాడ్ ఫాదర్ తెరకెక్కినా ఇందులో పొలిటికల్ డ్రామాతో పాటు ఫామిలీ డ్రామా కూడా చక్కగా బ్లెండ్ అవడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి అకాల మరణంతో ఆరంభమయ్యే ఈ కథకు ముఖ్యమంత్రి కుమార్తె సత్యప్రియ (నయనతార), ఆమె భర్త జయదేవ్ (సత్యదేవ్) కీలక పాత్రధారులు. చీఫ్ మినిస్టర్ డెత్ వల్ల స్టేట్ లోని పొలిటికల్ సినారియో చేంజ్ అయిపోతున్న దశలో ఎంట్రీ ఇస్తాడు బ్రహ్మ (చిరంజీవి). CM సీట్ రాంగ్ హాండ్స్ లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అసలీ బ్రహ్మ ఎవరు, సత్యప్రియ బ్రహ్మను ఎందుకు దూరంగా ఉంచాలి అనుకుంటుంది, జయదేవ్ అసలు స్వరూపం ఏమిటి, కుట్రల వల్ల జైలు పాలయ్యే బ్రహ్మ ఎలా బయటికి వస్తాడు.. ఈ కథకి ఎటువంటి ముగింపుని ఇస్తాడు అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. మసూమ్ భాయ్ (సల్మాన్ ఖాన్) అనే మరో ఆసక్తికరమైన పాత్ర పతాక సన్నివేశాల్లో సందడి చేస్తుంది.

స్క్రీన్ ప్లే : అప్పటికే తెలుగులోకి అనువాదమై ఉన్న మోహన్ లాల్ మలయాళ హిట్ సినిమా లూసిఫెర్ రీమేక్ రైట్స్ తీసుకుని గాడ్ ఫాదర్ చిత్తానికి శ్రీకారం చుట్టిన చిరు & కో స్క్రీన్ ప్లే విషయంలో చాలానే కేర్ తీసుకున్నారు. నిదానంగా సాగే ఒరిజినల్ వెర్షన్ కి వేగాన్ని జోడిస్తూ.. ఆ సబ్జెక్టులోని సోల్ డిస్టర్బ్ అవకుండా స్క్రీన్ ప్లే లో కొన్ని బెటర్ మెంట్స్ చేసుకుంటూ గాడ్ ఫాదర్ ని రూపొందించారు దర్శకుడు మోహన్ రాజా. ముఖ్యంగా నయనతార పాత్రని మాతృక కంటే మరింత అర్ధవంతంగా మార్చడం, మోహన్ లాల్ పాత్రని మన మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు మలచడం, ఎలివేషన్ సీన్సుని ఎక్సట్రార్డినరీగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం మెచ్చుకోదగ్గ అంశాలు. నయనతార రోల్ ని జస్టిఫై చేసిన విధానంతో పాటు పతాక సన్నివేశాలకై సల్మాన్ ఖాన్ వంటి స్టార్ ని సరిగ్గా వాడుకోవడం కూడా గాడ్ ఫాదర్ కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఓవరాల్ గా గాడ్ ఫాదర్ ని వీలైనంత రేసీ స్క్రీన్ ప్లే తో తెరపైకి తేవడం వల్ల బోరింగ్ మూమెంట్స్ తగ్గి జోరుగా సాగిపోయింది సినిమా.

ఎఫర్ట్స్ : తన ఏజ్ కి - ఇమేజ్ కి తగ్గ పాత్రలో కనిపించి కనువిందు చేసారు చిరంజీవి. కొన్ని సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు, కళ్ళలోనే చూపించిన భావోద్వేగాలు, చేసిన ఫైట్స్, చెప్పిన డైలాగ్స్ మెగా ఫ్యాన్సుకే కాక నార్మల్ ఆడియన్సుకి కూడా నచ్చే విధంగా ఉన్నాయి. పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్సుకి బ్యాక్ గ్రౌండ్ లో  వచ్చిన నజభజ జజరా సాంగ్ ఆయన ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే రేంజ్ లో కుదిరింది. అలాగే మూవీ ఫినిషింగ్ లో సల్మాన్ తో కలిసి చిరు స్టెప్పులేసిన తార్ మార్ సాంగ్ రావడం పండగ రోజున ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టి తాంబూలం ఇచ్చి మరీ పంపినట్లు అయింది. సల్మాన్ ఖాన్ తన ప్రత్యేక పాత్రను సరదా సరదాగా చేసేస్తే.. గంభీరమైన పాత్రలో నయనతార హుందాగా నటించింది. చిరంజీవి ఎంతో నమ్మకంతో తనని ఎన్నుకున్నందుకు న్యాయం చేస్తూ సత్యదేవ్ శెభాష్ అనిపించుకునేలా యాక్ట్ చేసాడు. సముద్రఖని, మురళీశర్మ, సునీల్, బ్రహ్మాజీ తదితరులంతా ఆయా పాత్రలకు న్యాయం చేస్తే.. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆడియన్సుని సర్ ప్రైజ్ చేస్తూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు థమన్ తన నేపధ్య సంగీతంతో తాండవం ఆడేసాడు. ఎలివేషన్ సీన్సులో అయితే థమన్ దరువుకి థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్. నీరవ్ షా ఫోటోగ్రఫీ, సురేష్ ఆర్ట్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అన్నీ ప్రొఫెషనల్ గా ఉన్నాయి. లక్ష్మీ భూపాల పాత్రలతో  పదునైన సంభాషణలు పలికిస్తే.. రామ్-లక్ష్మణ్, అనల్ అరసు మాస్ ఫైట్స్ డిజైనింగ్ లో మరోసారి తమ ప్రత్యేకత చూపించారు. రామ్ చరణ్, ఆర్.బి.చౌదరి, ఎన్ వి ప్రసాద్ ల నిర్మాణం మెగాస్టార్ రేంజ్ లోనే జరిగింది. మేకర్స్ మెయిన్ గా ఈ కథకి కావాల్సిన, క్యాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ ని పర్ ఫెక్ట్ గా పట్టుకుని పెట్టుకోవడాన్ని ప్రశంసించాలి. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే దర్శకుడిగా తన తొలి చిత్రం హనుమాన్ జంక్షన్ తో సాలిడ్ హిట్టు కొట్టిన మోహన్ రాజా మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్ లో మెగాస్టార్ కోసం మెగా ఫోన్ అందుకున్నారు. అంతేకాదు చిరు-చరణ్ లు తనపై చూపిన కాన్ఫిడెన్స్ కరక్టే అని నిరూపిస్తూ గాడ్ ఫాదర్ ని చక్కగా తెరకెక్కించారు. విలక్షణమైన విజన్ తో ఆయన కథలో చేసిన మార్పులు ఈ మూవీకి బాగా ఎస్సెట్ అయ్యాయి. ప్రేక్షకాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

ఎనాలసిస్ : శానా కష్టం వచ్చిందే అంటూ హీరోయిన్స్ తో స్టెప్పులెయ్యడం కాకుండా చిరంజీవి తన స్థాయికి సరిగ్గా సెట్ అయ్యే పాత్ర చెయ్యడం గాడ్ ఫాదర్ చిత్రానికి నిండుదనం.. నిజమైన బలం. ఈమధ్య చిరంజీవి నటనలో కాస్త కృత్రిమత్వం  కనిపిస్తోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నటికీ, దశాబ్దాలుగా చిరు శైలికి అలవాటు పడిపోయి ఉన్న అభిమానులు అదేం పట్టించుకోవట్లేదు. అందులోను ఈ చిత్రంలో ఆయన సెటిల్డ్ గానే పర్ ఫార్మ్ చేసారు. బ్రహ్మగా ఆయన లుక్ కూడా పోస్టర్స్ లో కంటే విజువల్స్ లో ఇంకాస్త బెటర్ గా ఉంది. ఇక సినిమాగా చూస్తే.. మొదట్లో బేసిక్ కథకి సీన్స్ అన్నీ సిన్సియర్ గానే స్టిక్ ఆన్ అయి ఉన్నా క్లయిమాక్స్ వచ్చేసరికి మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. స్క్రీన్ పై ఇద్దరు పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు అది తప్పదులెండి. మొత్తానికైతే ఆచార్య ఫలితాన్ని ఇక మరిచిపోయేలా విజయదశమి రోజున చిరంజీవిని మళ్లీ విజయాల బాటలోకి తీసుకొచ్చి, ఆయన దశ తిరిగిందని చూపిస్తూ దసరా శుభాకాంక్షలు చెబుతోంది గాడ్ ఫాదర్.

పంచ్ లైన్ : గాడ్ ఫాదర్ - గ్రాండ్ సక్సెస్

సినీజోష్ రేటింగ్ : 3/5

Cinejosh Review: GodFather:

GodFather Telugu Teview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs