Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : PS-1 (పొన్నియన్ సెల్వన్ 1)


సినీజోష్ రివ్యూ : PS-1 (పొన్నియన్ సెల్వన్ 1)

Advertisement
CJ Advs

బేనర్ : లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్

రిలీజ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నటీనటులు : విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి, శరత్ కుమార్, ప్రభు, పార్తీబన్, జయరాం, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా లక్ష్మి, శోభిత ధూళిపాళ  తదితరులు

మాటలు : తనికెళ్ళ భరణి

ఛాయాగ్రహణం : రవి వర్మన్

ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మణిరత్నం

విడుదల తేదీ : 30-09-2022

బేసిక్ గా మణిరత్నం సినిమాల్లో తనదైన మార్క్ వుంటుంది. తెరపై తను చూపించే మ్యాజిక్ వుంటుంది. కథల్లో డెప్త్ వుంటుంది. పాత్రల్లో స్ట్రెంగ్త్ వుంటుంది. మ్యూజిక్ లో సోల్ వుంటుంది. విజువల్స్ లో పొయెట్రీ వుంటుంది. అందుకే ఆయనకి జయాపజయాలతో సంబంధం ఉండదు. ఆయన సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గదు. ఎప్పటికప్పుడు తన మనసుని తాకిన కథలను మాత్రమే ఎంచుకుంటూ.. ఆయన మనోఫలకంపై ముద్రించుకున్న ఆ కథనాన్ని మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేసే మణిరత్నం తన కలల చిత్రంగా అభివర్ణిస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్.

ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి ఐదు భాగాలుగా వెలువరించిన చోళుల కాలం నాటి చారిత్రక గాథ పొన్నియన్ సెల్వన్ ని రెండు భాగాలుగా చిత్ర రూపంలోకి తీసుకు రావాలనుకున్న మణిరత్నం అందులోని మొదటి భాగాన్ని PS-1 పేరుతో నేడు ప్రేక్షకుల ముందు వుంచారు. మరి ఎంతో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటూ భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో, భారీ సెట్స్ తో, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో మణిరత్నం మలిచిన ఈ  PS-1 తెరపై భలేగా కనిపించిందో.. భారంగా అనిపించిందో రివ్యూలో చూద్దాం. 

బేసిక్ పాయింట్ : 9వ శతాబ్దంలో జరిగిన (జరిగినట్టు భావించబడుతున్న) చోళుల కథాంశమిది. రాజ్య కాంక్ష, అధికార వాంఛ, అసూయా ద్వేషాలు, అంతర్గత కుట్రలు వంటి అంశాలే ఈ కథలోని కీలకాలు. ఇక ఇందులోని మలుపులు - గెలుపులు ఆయా పరిస్థితులకు, పాత్రలకు తగ్గట్టు ఆపాదించబడ్డాయి. అలాగని ఇదే చరిత్రని చెప్పలేం.. ఇప్పటికీ ఆ సంఘటనలు అనుమానపూరితమైనవే కనుక.! అందుకని ఇది కాల్పనిక కథ అనలేం.. చారిత్రాత్మక పాత్రలను ఆవిష్కరించారు కనుక.! కేవలం ఈ గాఢత కలిగిన గాధను సినిమాగానే ఆస్వాదిద్దాం.. ఈ కావేరి పుత్రుడు (పొన్నియన్ సెల్వన్)ని ఓ గొప్ప వ్యక్తిగా అంగీకరిద్దాం అనుకునేవారికి మాత్రమే సంతృప్తినిచ్చే చిత్రమిది. ఫిక్షన్ - నాన్ ఫిక్షన్ ఏదైనా సరే.. కొన్ని రచనలు అక్షర రూపంలో అద్భుతంగా తోస్తాయి. దృశ్య రూపం ఇస్తే అమోఘం కదా అనిపిస్తాయి. కానీ చదువుతున్నపుడు పొందే అనుభూతి మన ఊహలకు సంబంధించింది. అదే దాన్ని చిత్రీకరిస్తే అది చూసేవాళ్లల్లో ఒక్కొక్కరికీ ఒక్కోలా అనిపిస్తుంది. నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేసే హక్కునీ ఇస్తుంది. మణిరత్నం వంటి దార్శనికుడు ఈ ధిక్కారాన్ని కూడా హుందాగానే స్వీకరించేందుకు సిద్దమై చేసిన సినిమా ఈ పొన్నియన్ సెల్వన్. 

ప్లస్ పాయింట్ : మణిరత్నం స్టైల్ అఫ్ మేకింగ్ అనేదే ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఎంతోమంది స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పటికీ ఆ ఆర్టిస్టుల పర్సనల్ ఇమేజ్ ని పక్కకి తోసేసి, పాతిపెట్టేసి తన పాత్రల రూపంలో మాత్రమే వారిని తెరపై చూపించారు మణిరత్నం. ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, అరుణ్ మొళి వర్మన్ గా జయం రవి, వల్లవరాయన్ వాందివదేవన్ గా కార్తీ, నందినిగా ఐశ్వర్యారాయ్, కుందవై పాత్రలో త్రిష... ఇలా అందరూ ఆయా పాత్రల్లోనే ఒదిగిపోయారు తప్ప ఎవ్వరూ హద్దులు దాటలేదు. ఏ ఒక్కరూ తమ పరిధిని మీరలేదు. 9వ శతాబ్దాన్ని ఆవిష్కరించే క్రమంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషిని అభినందించాలి. అంతటి చారిత్రక నేపథ్యాన్ని, అంతమంది నటీనటులని, జోరైన పోరాటాలని, లోతైన భావోద్వేగాలని.. అన్నిటినీ అద్భుతంగా తెరపై పరిచిన రవి వర్మన్ కి థాంక్స్ చెప్పాలి. రహమాన్ కి మాత్రమే సాధ్యమని చెప్పగల కంపొజిషన్, ఆర్కెస్ట్రైజెషన్, ఇనుస్ట్రుమెంటైజేషన్ ని ఈ చిత్ర నేపథ్య సంగీతం మరోమారు మన వీనులకు వినిపిస్తుంది. కాస్ట్యూమ్స్, మేకప్ డిపార్టుమెంట్స్ కి కూడా సెంట్ పర్శంట్ మార్కులు వేసి తీరాల్సిందే.!

మైనస్ పాయింట్ : చరిత్రలో జరిగిన సంఘటనలు సంవత్సరాల కొద్దీ సాగి ఉండొచ్చు. పుస్తకాల్లో వాటిని పేజీల కొద్దీ పొడిగించుకోవచ్చు. సినిమాకు మాత్రం అవి వర్తించవు. ప్రేక్షకులకు కథలోని ఉద్వేగం తెలియాలి. కథనంలో వేగం తగ్గకూడదు. ఎన్ని పాత్రలనైనా అర్ధం చేసుకోగలగాలి. అయోమయం కలక్కూడదు. అదే జరిగితే మొదటికే మోసం రావడం ఖాయం. అందుకు పొన్నియన్ సెల్వనే  సాక్ష్యం. లెక్కకు మిక్కిలి పాత్రలు... ప్రతి పాత్రకు ఏవేవో చిక్కులు... ఎక్కడెక్కడికో సాగే లెక్కలు సామాన్య ప్రేక్షకుడిని తికమక పెట్టేస్తూ ఉంటే ఏ చరిత్ర చూసినా ఏమున్నది ఆసక్తికారకం, ఆహ్లాదదాయకం అనుకుంటూ విడిచే నిట్టూర్పులు, నీరసంగా బయటికి వేసే అడుగులే చెప్పేస్తాయి సినిమా ఫలితాన్ని.!

ఫైనల్ పాయింట్ : ఓ సినిమా బావుందా - బాలేదా అనేది వేరు. నచ్చిందా - నచ్చలేదా అనేది చెప్పడమే సరైన తీరు. ఆ కోణంలో చూస్తే మన ప్రేక్షకుల చేత బాగానే ఉంది కానీ నచ్చలేదు అనిపించుకునే సినిమా పొన్నియన్ సెల్వన్. ఎందుకంటే ఇది మన ఆడియన్సుకి కనెక్ట్ అయ్యే కథ కాదు. కనీసం ఆ దిశగా ప్రయత్నమూ జరగలేదు. పూర్తిగా తమిళుల కోసం.... వారికి తెలిసిన పాత్రలతో, వాళ్ళు నమ్మే చరిత్రతో, వాళ్లకి నచ్చే అంశాలతో మణిరత్నం మలుచుకున్న చిత్రమిది. గత కొన్ని రోజులుగా తమిళ తంబిలందరూ ఈ పొన్నియన్ సెల్వన్ ని ఏ సినిమాతో పోల్చుకున్నారో, పోటీ పెట్టుకున్నారో ఆ పేరు కూడా ప్రస్తావించే అర్హత, అవసరం ఇక్కడ కాన రావడం లేదు కనుక రాస్తున్న వాక్యమిది... ఫోన్స్ లో ఫ్రీగా ఎవైలబుల్ ఉన్న డేటాని వేరే అవసరాలకి వాడుకోండి. యూనివర్సల్ అప్పీల్ తో సాహోరే అనిపించుకునే సినిమా చేయడం ఆషామాషీ కాదని తెలుసుకోండి.!

Punch line : పొన్నియన్ సెల్వన్ - ఓపిగ్గా చూడొచ్చులే..  ఓటీటీలో వచ్చెన్.!

Rating: 2.5/5

Cinejosh Review: PS-1(Ponniyin Selvan I ):

PS-1 (Ponniyin Selvan I) Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs