Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: లైగర్


సినీజోష్ రివ్యూ: లైగర్ 

Advertisement
CJ Advs

బ్యానర్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ తదితరులు

బ్యాగ్రౌండ్ మ్యూజిక్: సునీల్ కశ్యప్

మ్యూజిక్: విక్రమ్ మంత్రోస్, సునీల్ కశ్యప్, జానీ, తనిష్క్ బాఘ్చి

ఎడిటింగ్: జునైద్ సిద్దిక్వి

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ 

నిర్మాతలు: కరణ్ జోహార్, పూరి, ఛార్మి, అపూర్వ మెహతా 

కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: పూరి జగన్నాధ్ 

రిలీజ్ డేట్: 25-08-2022 

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే తేదీ విజయ్ దేవరకొండ అనే వ్యక్తిని సూపర్ స్టార్ ని చేసేసింది. అప్పటికే పెళ్లి చూపులు లాంటి సూపర్ హిట్ వచ్చినప్పటికీ..  2017 ఆగష్టు 25 న విడుదలైన అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోయింది. అతను కూడా ఊహించనంతగా స్టార్ డమ్ వచ్చేసింది. కట్ చేస్తే మళ్ళీ అదే తేదీ, అదే రోజు లైగర్ తో వచ్చాడు. ఈసారి పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ కలిసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన అర్జున్ రెడ్డి తో కంపేర్ చేస్తే హై ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చింది లైగర్. 

ఈ సినిమా రివ్యూలోకి వెళ్లేముందు కాస్త రియాలిటీ కూడా మనం ప్రస్తావించుకుందాం. లైగర్ అనే కొత్త పదాన్ని మనకి పరిచయం చేస్తూ టైటిల్ పెట్టిన పూరి, అలాగే ఓ కొత్త తరహా కథని, కొత్త తరహా సినిమాని అందిస్తారని విపరీతమైన ఆసక్తి క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా పూరి జగన్నాధ్ తన కెరీర్ లోనే ఎక్కువ కాలం వర్క్ చేసిన సినిమాగా లైగర్ నే చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ మేకోవర్, తన ఫిజిక్, మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి తనని తాను మలుచుకున్న విధానం ఇవన్నీ ఎప్పటికప్పుడు సినిమా మీద అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఈ సినిమా ప్రచారం కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలన్నీ పర్యటించిన టీం కి ప్రతి చోట విశేష స్పందన లభించింది. ఇదంతా పక్కనబెడితే.. రిలీజ్ టైమ్ కి మాత్రం సీన్ రివర్స్ అయిపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నెపోటిజం టాపిక్ కి సంబంధించి రియాక్ట్ అయిన నెటిజెన్లు, కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని, బాయ్ కాట్ లైగర్ అనే పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. అలాగే విజయ్ దేవరకొండ బిహేవియర్ మీద కాస్త విమర్శలు వెల్లువెత్తాయి. అతని యారగెన్సీని చాలామంది వేలెత్తి చూపించారు. ఇలాంటి వివిధ కారణాల వల్ల వివాదాల నేపథ్యంలో విడుదలకు సిద్దపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది లైగర్. ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూద్దాం.. నెక్స్ట్ సినిమాకి సంబందించిన ఇతర అంశాల గురించి మాట్లాడుకుందాం..

కథ:

బాలామణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ)ని మార్షల్ ఆర్ట్స్ లో ఛాంపియన్ చెయ్యాలని కలలు కంటుంది. కొడుకుతో కలిసి తన కల నెరవేర్చుకోవడానికి ముంబై వెళ్లిన బాలామణి.. అక్కడ ఓ టీ స్టాల్ పెడుతుంది. లైఫ్ లో కల నెరవేర్చుకోవాలంటే అమ్మాయిలకి, ప్రేమకి దూరంగా ఉండాలని బాలామణి కొడుక్కి ఎంతగా చెప్పినా.. లైగర్ మాత్రం తానియా(అనన్య పాండే) ప్రేమలో పడతాడు. కానీ తానియా లైగర్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రేమలో ఓడిపోయినా.. తన కల, తల్లి కల నిజం చెయ్యాలనే కసి లైగర్ లో పెరుగుతుంది. లైగర్ తన కలని నెరవేర్చుకునే క్రమంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు? అసలు లైగర్ అమెరికా ఎందుకు వెళ్ళాడు? తానియా మళ్ళీ లైగర్ జీవితంలోకి వస్తుందా? అనేది తెలియాలంటే లైగర్ ని బిగ్ స్క్రీన్ పై చూసెయ్యాల్సిందే.

తెరపై..

విజయ్ దేవరకొండ లైగర్ పాత్రలో చాలా బాగా చేసాడు. కష్టపడి లైగర్ పాత్ర కోసం తనని తాను మలుచుకున్న విధానం, ఆ ట్రాన్సఫర్మేషన్ అందరిని మెప్పిస్తుంది. అలాగే నత్తి నత్తిగా మాట్లాడే కేరెక్టర్ లో.. తనకేదైతే ప్లస్ అనుకుని మనందరం భావిస్తామో.. ఆ వాయిస్ ని పక్కనబెట్టి, నత్తి నత్తిగా మాట్లాడం విజయ్ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసి ఉండొచ్చు, కానీ అతను మాత్రం అది ఛాలెంజింగ్ గా తీసుకుని చేసాడు. యాక్షన్ సీన్స్ లోను విజయ్ దేవరకొండ చెలరేగిపోయాడు. ఇక ఈ సినిమాకి మెయిన్ మైనస్ అని అందరితోనూ అనిపించుకుంటుంది అనన్య పాండే. స్క్రీన్ పై ఎంత గ్లామరస్ గా కనిపించినప్పటికీ అనన్య కేరెక్టర్ అసహనానికి గురి చేసింది. అనన్య అసలు హీరోయిన్ మెటీరియల్ కాదు అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ కి తల్లిగా కనిపించిన రమ్యకృష్ణ ఫస్ట్ హాఫ్ లో బాగా పెరఫామ్ చేసినా.. సెకండ్ హాఫ్ లో అరుపులు కేకలకే పరిమితమయిన పాత్ర ఆమెది. మైక్ టైసన్ పేరు కేవలం సినిమాకి క్రేజ్ తీసుకురావడనికే తప్ప కథలో ఆయన చెయ్యడానికి ఏమి లేదు. కథ కూడా ఆయనేం చేసే అవకాశం ఇవ్వలేదు. రోనిత్ రాయ్ కోచ్ గా ఆకట్టుకున్నాడు. అలీ, విషు రెడ్డి, గెటప్ శీను.. ఇలా మిగతావారు తమ పాత్రల పరిధిమేర మెప్పించారు.

తెరవెనుక..

లైగర్ సినిమాకి సంబంధించి ఫస్ట్ అప్రిషియెట్ చెయ్యాల్సింది, అప్లాజ్ ఇవ్వాల్సింది యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కి. బేసిక్ గా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో ముస్తాబైన లైగర్ ని బాక్సింగ్ రింగ్ లో స్ట్రాంగ్ గా నిలబెట్టింది వాళ్ళే. అలాగే ఆ విజువల్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసి తెరపైకి తీసుకువచ్చిన సినిమాటోగ్రాఫర్ ని కూడా అభినందించాలి. ఎడిటర్ కట్ చేసే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి సన్నివేశాలని కలుపుకుంటూపోయాడంతే. సాంగ్స్ అన్నీ కంప్లీట్ గా నార్త్ టోన్ లో బాలీవుడ్ కి మ్యాచ్ అయ్యే విధంగానే డిజైన్ చేసారు. అందుకే అవి మన ఆడియన్స్ కి డబ్బింగ్ సాంగ్స్ లా అనిపించడంతో ఆశ్చర్యం లేదు. ఇక డైలాగ్స్ రాసింది మనకి తెలిసిన పూరి జగన్నాథేనా అనిపించేలా ఉన్నాయి. ఎవడు రాస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యిపోద్దో ఆ పూరి పెన్ నుంచి ఇటువంటి సాదాసీదా సంభాషణలు మనం ఆశించలేం. మెచ్చుకునే కలమే నొచ్చుకునేలా చేసింది అంటూ బాధపడకుండా ఉండలేం. సంభాషణల పరంగానే కాదు కథకుడిగా కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయిన పూరి మనముందుకో బోరింగ్ లైగర్ ని తీసుకొచ్చాడు.

విశ్లేషణ:

లైగర్ సినిమాకి 200 కోట్ల రూపాయల మేరకు ఓటిటి ఆఫర్ వచ్చిందట. అదే అంశాన్ని కోట్ చేస్తూ నేను దీనికంటే ఎక్కువ థియేట్రికల్ రెవిన్యూ తీసుకురాగలను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూస్ లో కూడా లైగర్ లెక్క 200 కోట్ల నుంచి మొదలవ్వుద్ది.. అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అలాగే ఆ 200 కోట్ల మేటర్ పక్కనబెడితే.. ఈ సినిమాకి రిలీజ్ కి ముందే రెండో సినిమానే విజయ్ దేవరకొండ తో చేసేస్తూ జనగణమన స్టార్ట్ చేసిన పూరి ఇంకాస్త ఆసక్తిని, అంచనాల్ని పెంచేసాడు. వారిద్దరూ అంత కాన్ఫిడెంట్ గా ఉండడం చూస్తే లైగర్ నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ కన్ ఫర్మ్ అనిపించింది. మరోపక్క బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద చతికిల పడుతుంటే.. సౌత్ సినిమాలే గర్వంగా కాలర్ ఎగరేస్తుంటే.. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ తో సహా.. ఈదశలో లైగర్ సెన్సేషన్ ఖాయమని అందరూ భావించారు. కానీ మార్నింగ్ షో పడ్డాక మతి పోగొట్టేసాడు లైగర్. పూరి చాలా కాన్సంట్రేట్ చేసి తీసిన సినిమా, విజయ్ దేవరకొండ ఎన్నో కసరత్తులు చేసి తెరపైకి వచ్చిన సినిమా, ఛార్మి చాలా కాన్ఫిడెంట్ గా ఎన్నెన్నో గొప్పగా చెప్పుకున్న సినిమా, ఎంతో విషయముంటుందని ఆశిస్తే.. అసలే అంశంలోనూ ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టలేకబోతున్న సినిమా. ఇది ఫైనల్ గా లైగర్. ఇంతే ఫైనల్ గా లైగర్. విజయ్ దేవరకొండ కష్టం వేస్ట్ అయ్యింది. పూరి నమ్మిన స్టోరీ బోరింగ్ గా మారింది. మైక్ టైసన్ పేరు ప్రచారానికే పనికొచ్చింది. రమ్యకృష్ణ పాత్ర అరుపులకే పరిమితమైంది. టోటల్ గా చూస్తే దేశమంతా మంటలు రేపుతామని ప్రకటించిన లైగర్ టీం కి ఫైనల్ గా మంటే మిగిలింది. మండే అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Punch line : Liger.. మ్యాటర్ లేని ఫైటర్

రేటింగ్: 2/5

Cinejosh Review: Liger :

Liger Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs