సినీ జోష్ రివ్యూ: చోర్ బజార్
నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: వీఎస్ రాజు
దర్శకుడు: జీవన్ రెడ్డి
విడదల తేది: 24-06-2022
పాన్ ఇండియా డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి సినిమా వస్తుంది అంటే థియేటర్స్ దగ్గర ఎంత హడావిడి ఉండాలి. కానీ ఆకాష్ పూరి సినిమాకి అవేం కనిపించడం లేదు. ఆకాష్ పూరి హీరో గా పేరు తెచ్చుకోవడానికి వరస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. మెహబూబా, రొమాంటిక్ చిత్రాలు చేసినా హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి తో జత కట్టి చోర్ బజార్ మూవీ చేసాడు. మంచి కటౌట్, పవర్ ఫుల్ వాయిస్ ఉన్న ఆకాష్ పూరికి అనువైన కథ తగిలితే హీరో గా సక్సెస్ అవ్వడానికి ఎంతోసేపు పట్టదు. ఇక తండ్రి పూరి జగన్నాధ్ అండ లేకుండానే హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న ఆకాష్ పూరి కి చోర్ బజార్ ఎలాంటి ఫలితాన్ని అందించిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
హైదరాబాద్‌లోని మ్యూజియంలో నిజాం నవాబులకు చెందిన 200 కోట్ల విలువైన డిమాండ్ దొంగతనం జరుగుతుంది. ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్‌లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? ఆ డైమండ్ చోర్ బజార్ కు వచ్చాక అక్కడ బచ్చన్ సాబ్ జీవితంలో ఎలాంటి విషయాలు చోటు చేసుకున్నాయి.? స్వతహాగా దొంగ అయిన బచ్చన్ సాబ్ ప్రేమ కథ ఏంటి? అనేది తెలియాలంటే చోర్ బజార్ చూడాల్సిందే.
నటీనటులు:
ఆకాష్ పూరి నటన బచ్చన్ సాబ్ పాత్రలో ఇంతకుముందు చిత్రాల్లానే రొటీన్ గా అనిపిస్తుంది కానీ కొత్తదనం కనిపించలేదు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలో కాస్త మెరుగపడ్డాడని అనిపిస్తుంది. మూగమ్మాయి పాత్రలో గెహెన్నా సిప్పీ తన పరిధి మేర నటించింది. హోమ్ మంత్రిగా సునీల్, మాంజా అనే దొంగగా సంపూర్ణేష్‌బాబు, బచ్చన్ తల్లి బేబి పాత్రలో అర్చన, లాయర్లుగా డబుల్ రోల్ చేసిన లక్ష్మణ్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ:
జార్జ్ రెడ్డి తో జీవన్ రెడ్డి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి తో జీవన్ రెడ్డి చోర్ బజార్ మూవీ తెరకెక్కిస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి కలిగింది. పూరి హ్యాండ్ కూడా ఎంతోకొంత ఇందులో ఉంటుంది అని. కానీ చోర్ బజార్ సినిమా విషయంలో పూరి ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. చోర్ బజార్ కథలోకి వెళితే వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. వజ్రం దొంగతనం తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. దొంగతనం అనే పాయింట్ చుట్టూనే కధ తిరుగుతుంది అనే హింట్ ఇచ్చేసారు. చోర్ బజార్ ప్రాంతంలో ఉన్న డైమండ్ కోసం పోలీసులు ఎందుకు గట్టిగా ప్రయత్నించలేదు అనే లాజిక్ ఎవరికీ అర్ధం కాదు. అలా డైమండ్ విషయం మీద క్లారిటీ రాకుండానే ఫస్ట్ హాఫ్ ముగించారు. సెకండ్ హాఫ్ కొచ్చేసరికి ఆకాష్ పూరి పాత్ర ఫ్లాష్ బ్యాక్ చూపించేందుకు ప్రయత్నించారు. దొంగతనాల టాలెంట్ తోనే ఉద్యోగం దక్కించుకోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ సినిమాలోని కథ ముందే తెలిసిపోయినట్టుగా వచ్చే సీన్స్ తో ప్రేక్షకుడికి అడుగడుగునా బోర్. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు.
సాంకేతికంగా..
జార్జ్ రెడ్డి లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాని తెరకెక్కించిన జీవన్ రెడ్డి నుంచి వచ్చిన మొదటి కమర్షియల్ సినిమా చోర్ బజార్. ఈ సినిమాని మాస్ ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దెందుకు చాలా ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కథ - కథనం అంతా కూడా రొటీన్ గా ఉండడమే కాక కథ కూడా కొత్తదనం లేకుండా ఉండడంతో ప్రేక్షకులు అంత త్వరగా కనెక్ట్ కాలేరు.
ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. జగదీశ్ చీకటి కెమెరా పనితనం కొన్ని సీన్స్ లో కనిపించింది. కానీ గజిబిజి సీన్స్ తో ఎడిటింగ్ గందరగోళంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
Punch line : బోర్ బజార్
రేటింగ్: 1.75/5