సినీ జోష్ రివ్యూ : అంటే సుందరానికీ
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: నాని, నజ్రియా నజీమ్, నరేష్, రోహిణి, నదియా, అరుణ బిక్షు, హర్ష వర్ధన్, అనుపమ పరమేశ్వరన్, పృథ్వీరాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఎడిటింగ్: రవితేజ గిరజాల
ప్రొడ్యూసర్స్: నవీన్ యెర్నేని, Y. రవి శంకర్
దర్శకుడు: వివేక్ ఆత్రేయ
గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న నానికి ఆ మధ్య వచ్చిన శ్యామ్ సింగ రాయ్ కాస్త ఊపిరి పీల్చుకొనిచ్చింది. కాగా వెంటనే నాని తన స్ట్రాంగ్ జోన్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లోకి దిగిపోయి అంటే సుందరానికీ అనే ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి ఆహ్లాదకర చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయకి దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు. ఏరికోరి మరీ కేరళ నుండి నజ్రియని తెచ్చుకున్నారు. మొదటినుండి పబ్లిసిటీ పరంగా మంచి సందడి చేసిన సుందరం మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ వంటి బిగ్ బ్యానర్ లో నాని - నజ్రియాల కాంబినేషన్ తో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అంటే సుందరానికి చిత్రం ఎలా ఉందో? ఎంతగా నవ్వించిందో? ఏ మేరకు మెప్పించిందో? సమీక్షలో చూద్దాం.
కథ: అంటే సుందరానికి కథ ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే రివీల్ చేసేసారు.
బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) కి మూఢ విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు నమ్మే నాన్న, నాన్నమ్మతో చిన్నప్పటినుండి కష్టాలే. బ్రాహ్మణుడైన నాని, క్రిస్టియన్ మతానికి చెందిన లీలా (నజ్రియా నజీం) బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుంచే ఒకరంటే మరొకరికి ఇష్టం. అయితే పరమతం అంటే ద్వేషం పెంచుకొన్న తల్లిదండ్రుల కారణంగా లీలా చాలా రెస్టక్షన్స్ ఫేస్ చేస్తుంది. వేరు వేరు కట్టుబాట్లు ఉన్న సుందర్, లీలా ప్రేమలో పడుతారు. మరి భిన్న ధ్రువాలైన సుందర్ ఫ్యామిలీ, లీల ఫ్యామిలీ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటుందా? లీలా - సుందర్ పెళ్లి చేసుకోవడం కోసం ఏం చేసారు? అనేది మిగతా కథ
నటీనటులు:
నేచురల్ పెరఫార్మెర్ అనిపించుకున్న నాని తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కేరెక్టర్ దొరికితే ఎలా చెలరేగిపోతాడో చెప్పడానికి ఈ సుందరం పాత్ర మరో నిదర్శనం. బ్రాహ్మణ యువకుడిగా, సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా, వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిగా నాని నవ్వులు పూయించారు. ముఖ్యంగా సుందరం పాత్రలో నాని ఒదిగిపోయిన తీరు సూపర్బ్ అనిపిస్తుంది. ఇక మలయాళ బ్యూటీ నజ్రియా ని లీలా కేరెక్టర్ కి ఎందుకు ఎంపిక చేసుకున్నారో సినిమా చూస్తే తెలుస్తుంది. అంత బ్యూటిఫుల్ నటనతో ఆమె ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్స్ తర్వాత చెప్పుకోదగిన పాత్ర సీనియర్ నటుడు నరేష్ ది. తల్లి మాట విని కొడుకుని గండాల పేరుతొ ఇబ్బంది పెట్టే తండ్రిగా నరేష్ నటన ఆకట్టుకునేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్ రోల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. నజ్రియా తల్లిగా నదియా ఆకట్టుకుంది. బామ్మగా నటించిన అరుణ బిక్షు పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలతో మెప్పించారు.
విశ్లేషణ:
భిన్న సంప్రదాయాలు, భిన్న మతాలకు సంబంధించి ఇద్దరు ప్రేమించుకోవడం, ఆ ప్రేమ కోసం పోరాటాలు, మధ్యలో కులాల అడ్డుగోడలు, అలాగే పెద్దల వ్యతిరేఖత అనేది చాలా సినిమాల్లో చాలాసార్లు చూసినవే. అదే రెండు మతాలకు చెందిన కుటుంబాలు, ఇద్దరు వేర్వేరు కులాల ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణే అంటే సుందరానికి సినిమా. వివేక్ ఆత్రేయ కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్, కొంచెం సంప్రదాయం, ఇంకొంచెం మోడ్రన్ థాట్.. ఇవన్నీ కలగలిపి కథని రాసుకోగలిగాడు. కాకపోతే సినిమాలో ప్రతీతి డీటెయిల్ గా చెప్పాలనుకోవడం మైనస్ గా మారింది. చిన్నప్పటి ఎపిసోడ్లు, లీలా ప్రేమకథ.. ఇవన్నీ లెంగ్తీగా అనిపించాయి. సీన్స్ అన్నీ కాస్త క్రిస్పీగా రాసుకొని ఉంటే.. అంటే సుందరానికీ అందరికి నచ్చే అవకాశం ఉండేది. సాగదీసిన కథనం కథని పూర్తిగా చతికిల పడేలా చేసింది. మతం ముఖ్యం కాదు.. మనసులు కలవడం ప్రధానం అనే పాయింట్ ఇప్పటికే చాలాసార్లు చాలామంది చెప్పిందే. ఆ ఓల్డ్ పాయింట్ నే ఫన్ టచ్ తో ట్రెండీ గా ప్రెజెంట్ చెయ్యాలని ట్రై చేసాడు డైరెక్టర్ వివేక్. అయితే ఫస్ట్ హాఫ్ లో కాస్త ఫన్ వర్కౌట్ అయినా క్లైమాక్స్ లో ఎమోషన్స్ కి కొంతమంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా ఓవరాల్ గా మాత్రం జస్ట్ ఓకె అని మాత్రమే అనిపించుకోగలిగాడు అంటే సుందరం.
సాంకేతికంగా..
వివేక్ సాగర్ మ్యూజిక్ తో మంచి మార్కులు వేయించుకున్నాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్ గా ఉంది. నికేత్ బొమ్మి కెమెరా పనితనాన్ని కూడా ప్రశంసించవచ్చు. ఇతర సాంకేతిక నిపుణులు కూడా తమ వంతు సహకారం అందించారు.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలతో ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్న వివేక్ ఆత్రేయ అంటే సుందరం విషయంలోనూ రైటింగ్ పరంగా తన స్కిల్ చూపించగలిగాడు కానీ.. డైరెక్టర్ గా మాత్రం సినిమాలో ఉన్న బామ్మ కేరెక్టర్ చాదస్తాన్ని తను ప్రదర్శించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో నాని చెప్పినట్టు కాస్త లెంత్ తగ్గించమని తన మాట వింటే అంటే సుందరానికీ మరోలా ఉండేదేమో..
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కి వంక పెట్టలేం. ఖర్చు విషయంలోనూ, క్వాలిటీ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు అని స్క్రీన్ పై క్లియర్ గా తెలుస్తుంది.
పంచ్ లైన్: నవ్వులు తక్కువ.. నస ఎక్కువ.!
రేటింగ్: 2.5/5