సినీ జోష్ రివ్యూ: మేజర్
నిర్మాణ సంస్థలు: జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్
నటీనటులు: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ, తదితరులు
ఎడిటర్ : పవన్ కల్యాణ్
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాత: మహేశ్‌బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
దర్శకుడు: శశి కిరణ్ తిక్క
రిలీజ్ డేట్: 03-06-2022
క్షణం, ఎవరు, గూఢచారి వంటి సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. అడివి శేష్ హీరోగా చేసిన ప్రతీ సినిమా వైవిధ్యమే ఘన విజయమే. ఇప్పుడు కూడా విభిన్నమైన పంథాలో నటుడిగా తనకి తగ్గ ఒరిజినల్ కథ మేజర్ ని ఎన్నుకుని అందరిలో ఆసక్తిని కలిగించాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన మూవీ మేజర్. దేశంలోని ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన పాన్ ఇండియా మూవీ గా ట్రైలర్ తోనే అందరిలో క్యూరియాసిటీని కలిగించిన అడివి శేష్, తన టీం తో కలిసి చేసిన ప్రమోషన్స్ కానివ్వండి, మహేష్ బాబు వన్ అఫ్ ద నిర్మాతగా ఈ సినిమాకి భాగస్వామి కావడం ఇలాంటి విషయాలతో ఆడియన్స్ కి మేజర్ ని చూసెయ్యాలి అనే కోరిక కలిగించారు. మరి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
సందీప్ ఉన్ని కృష్ణన్(అడివి శేష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్పప్పటి నుంచి నేవీలో చేరాలనే కోరిక సందీప్‌లో బాగా ఉండేది. అటు తన కోరిక, తల్లితండ్రుల కోరికని నెరవేర్చకుండా ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆ సమయంలోనే ఇషా (సాయి మంజ్రేకర్)తో సందీప్‌కి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ అని భావించే సందీప్ అంచెలంచెలుగా ఎదిగి భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్‌ఎస్‌జీ (NSG) కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించుకునేందుకు పై అధికారి(మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని ఇంటికి వెళ్లే సమయంలో ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. అప్పుడు సందీప్ 51 ఎస్‌ఎస్ జీ బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్ తన టీం తో ఎలా మట్టుపెట్టాడు? బందీలుగా ఉన్న సామాన్య ప్రజలను సందీప్ ఎలా కాపాడాడు: ఎంతటి సాహసానికి సిద్ధపడ్డాడు అనేది వెండితెరపై చూడాల్సిందే.
నటీనటులు:
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అంటే ప్రజల్లో ఓ హీరోగా గుర్తుండిపోయిన వ్యక్తి. అలాంటి పాత్ర చెయ్యడం ఛాలెంజింగ్ అనే చెప్పాలి. కానీ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో జస్ట్ నటించాడు అని చెప్పడం కంటే అడివి శేష్ జీవించాడు అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది. ఆ పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేశాడు. ఎమోషన్స్ చూపిస్తూనే.. హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించాడు. ఒక పవర్ ఫుల్ సోల్జర్ అంటే అచ్చంగా అలానే ఉంది ఉంది శేష్ పెరఫార్మెన్స్. ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్ ఒదిగిపోయింది. హీరో - హీరోయిన్స్ రొమాన్స్ తెరపై వర్కౌట్ అయింది. ఇక్కడ ముఖ్యంగా ప్రశంసించాల్సిన విషయం అడివి శేష్ - సాయి మంజ్రేకర్ ఇద్దరూ కూడా తమ అప్పీరియన్స్ లో రెండు వేరియేషన్స్ చూపించడం విశేషం. నిజంగా అభినందనీయం. సందీప్ తండ్రిగా ప్రకాశ్ రాజ్, తల్లిగా రేవతి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. క్లైమాక్స్ సీన్ లో ప్రకాష్ రాజ్ - రేవతిల రైన్ సీన్ మన కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. హోటల్‌లో చిక్కుకున్న హైదరాబాద్ యువతి ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ మంచి నటనను కనబరిచింది. మురళీ శర్మతో మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
విశ్లేషణ:
అడివి శేష్ గూఢచారి సినిమా జస్ట్ ఫిక్షనల్ స్టోరీ. అందులో కేరెక్టర్ కి సరిపడా పెరఫార్మెన్స్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ బయోపిక్. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే అది ప్రేక్షకులకి ఎక్కదు, అందులో కమర్షియల్ హంగులు జోడిస్తే అయితే వర్కౌట్ అవుతుంది, లేదంటే మొదటికే మోసం వస్తుంది. కానీ దర్శకుడు శశి కిరణ్ తిక్క మాత్రం మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ విషయంలో 100 పెర్సెంట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి తెలియని విషయాలను తెరపై చూపించాడు. ముంబై దాడుల్లో మేజర్ సందీప్ సామాన్య ప్రజలను రక్షించి ఎలా వీరమరణం పొందారో అందరికి తెలుసు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియదు. అదే శశి కిరణ్ తిక్క తెరపై చూపించారు. ఫస్ట్ హాఫ్ మేజర్ సందీప్ కలలు, తల్లి తండ్రులు, సందీప్ ప్రేమించిన అమ్మయితో పెళ్లి, గొడవలు, విడాకుల వరకు మేటర్ రావడం, ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని చూపించారు. సెకండ్ హాఫ్ లో 2611 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్ హోటల్‌లో ఉగ్రవాదులు చేసిన అరాచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్ ఉన్నికృష్ణన్ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు.. ప్రతీదీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మీడియాకు తెలియకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తూ, ఉగ్రవాదులను మట్టుపెట్టిన తీరు కూడా అద్భుతంగా అనిపిస్తుంది. సినిమాలోని చివరి 20 నిమిషాలు మాత్రం ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుని కూర్చునే ఉత్కంఠను రేకెత్తించారు. మేజర్ అంటే ఇలానే ఉండాలి అనిపించిన సినిమా ఇది. అందుకే ప్రతి ఒక్కరు వీక్షించాల్సిన సినిమా గా మేజర్ నిలిచిపోతుంది.
సాంకేతికంగా:
మేజర్ కి మెయిన్ హైలెట్ రైటింగ్. అడివి శేష్ స్క్రీన్ రైటర్ గా తన సత్తాని మరోసారి చాటుకున్నాడు. శశి కిరణ్ టిక్కా అందుకు దోహదపడ్డాడు. మరో హైలెట్ శ్రీచరణ్ పాకాల సంగీతం. తనదైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మేజర్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్ సీన్స్‌కి నేపధ్య సంగీతంతో గూస్ బంప్స్ తెప్పించాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. తాజ్ హోటల్, యాక్షన్ సీన్స్ అన్నిటిని బాగా చూపించాడు. పవన్ కల్యాణ్ ఎడిటింగ్ లో అక్కడక్కడా కత్తెర వేయాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఆల్రెడీ అడివి శేష్ తో గూఢచారి వంటి మ్యాజికల్ ఫిలిం చేసిన శశి కిరణ్ టిక్కా ఈసారి మేజర్ వంటి బయోగ్రఫీని కూడా సమర్ధవంతంగా హ్యాండిల్ చేసాడు. అడివి శేష్ కాంబినేషన్ తో మరో సక్సెస్ కొట్టాడు.
చివరిగా ఈ సినిమాలో మేజర్ రోల్ మాత్రమే కాదు, ఈ సినిమా మేకింగ్ లోను మేజర్ రోల్ అడివి శేష్ దే. ఏరి కోరి సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని తెరపైకి తీసుకురావాలని సంకల్పించుకోవడం.. దాని కోసం సరైన రీతిలో సంసిద్ధం కావడం, ఆ పాత్రకి, ఆ నేపధ్యానికి న్యాయం చెయ్యడం కోసం పరితపించడం, నటుడిగా.. రచయితగానే కాకుండా వ్యక్తిగానూ అడివిశేష్ నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
పంచ్ లైన్: క్లైమాక్స్ తో కట్టిపడేస్తాడు మేజర్
రేటింగ్: 3/5