సినీ జోష్ రివ్యూ: అశోకవనంలో అర్జున కళ్యాణం
నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సంగీతం: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలనీ
నిర్మాత: బాపీనీడు. బి
దర్శకత్వం: విద్యా సాగర్ చింతా
విడుదల తేది: 06-05 -2022
ఎదగడం కోసం ఎలాంటి కాంట్రవర్సీకైనా వెనుకాడని హీరో విశ్వక్ సేన్. ఫలక్ నుమాదాస్ నుండే కాంట్రవర్సీలతో ఫ్రెండ్ షిప్ చేస్తూ ఈ రోజు విడుదలైన అశోక వనంలో అర్జున కళ్యాణం వరకు వచ్చిన విశ్వక్ సేన్.. అప్పట్లో విజయ్ దేవరకొండ ఫాన్స్ తో పెట్టుకున్న గొడవతో ఫెమస్ అయ్యాడు. ఇక ఇప్పుడు అశోక వనంలో అర్జున కళ్యాణ్ సినిమా విషయంలో ఏకంగా టివి 9 యాంకర్ తో గొడవ పెట్టుకుని సినిమాకి మంచి పబ్లిసిటీ చేసుకున్న విశ్వక్ సేన్ తన సినిమాని బ్రతికించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తనంటూ శపధం చేసాడు కూడా. అంతేకాకుండా విశ్వక్ అశోక వనంలో అర్జున కళ్యాణం కి చేసిన డిఫ్రెంట్ ప్రమోషన్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక తన సినిమాపై ఎంతో నమ్మకంతో విశ్వక్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి విశ్వక్ సేన్ నమ్మకాన్ని ప్రేక్షకులు ఎంతవరకు నిలబెట్టారో.. సమీక్షలో చూసేద్దాం.
కథ:
అల్లం అర్జున్ (విశ్వక్ సేన్) సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. వారి వర్గంలో అమ్మాయిలు తక్కువగా ఉండడం, ఇంకొన్ని కారణాల వలన 33 ఏళ్ల వయసు వచ్చినా అల్లం అర్జున్ కి పెళ్లి అవ్వదు. సూటి పోటీ మాటలను భరించలేక బాధపడే అర్జున్ కుటుంబం చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సార్ దిల్లాన్)తో నిశ్చితార్థం చేసుకుకోవడానికి బంధువులని వేసుకుని బస్సులో బయలుదేరుతుంది అర్జున్ ఫ్యామిలీ. నిశ్చితార్ధం పూర్తయ్యి వెనుదిరిగే సమయంలో అర్జున్ వాళ్ళు వచ్చిన బస్సు పాడవడం, అదే టైం లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. పెళ్లి కూతురు ఇంట్లో అర్జున్ ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) చేసిన పని ఎక్కడికి దారి తీసింది? అసలు అర్జున్‌కి మాధవితోపెళ్లి అయిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు:
అల్లం అర్జున్ లా సరికొత్త గెటప్‌లో కనిపించాడు విశ్వక్ సేన్. విశ్వక్‌సేన్ పెరఫార్మెన్స్ చాలా డీసెంట్ గా ఉంది. వయసుకు మించిన పాత్రను పోషించిన విశ్వక్ ఆ కేరెక్టర్ లో జీవించేసాడు. అమాయకుడిగా ఉంటూనే.. తనదైన కామెడీతో నవ్వించాడు. మందు తాగిన సీన్‌లో పూర్తి విశ్వక్ సేన్ ని చూసే అవకాశం దక్కింది. ఇద్దరు హీరోయిన్లూ నీట్ గా చూడ్డానికి అందంగా కనిపించారు. రుక్సార్ చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. హీరోయిన్ చెల్లెలు వసుధ పాత్రలో రితికా నాయక్ అదరగొట్టేసింది. ఆమె చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
విశ్లేషణ:
ఈమధ్యన అబ్బాయిలు ముప్పయ్యేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి కాకపోవడం అనేది రొటీన్ గా తయారైన వ్యవహారం. దర్శకుడు ఇక్కడ అదే పాయింట్ తో కథ అల్లుకున్నాడు. దానికి రెండేళ్లుగా ఇబ్బంది పడిన కరోనా, లాక్ డౌన్ ని వాడేసాడు విద్యా సాగర్ చింతా. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఫీలింగ్ తో బాధపడేవారందరికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది మనకు, మన మనసుకి నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలని కానీ, పేరెంట్స్ కోసమో, సమాజం కోసమే, లేదంటే ఫ్యామిలీ గౌరవం కోసమో చేసుకోవద్దనే విషయాన్ని అశోక వనంలో అర్జున కళ్యాణం లో కామెడీగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్ చెల్లెలు చేసే అల్లరి ఆకట్టుకుంది. పెళ్లి ఇంట్లో కనిపించే పాత్రలు, గోదావరి ప్రాంత నేపథ్యం.. ఇవన్నీ ఆకర్షణలుగా మారి అశోకవనంలో అర్జున కళ్యాణంను సందడిగా మార్చాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండాఫ్‌లో సీరియస్ అంశాలను కూడా సున్నితంగా చూపించాడు దర్శకుడు. కథకి ప్లస్సూ, మైనస్సూ లాక్ డౌనే. అయితే కథలో కావాల్సినంత కామెడీ ఉన్నా.. నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో అమ్మాయితో అబ్బాయి చిన్ని చిన్ని సరసాలు.. ఈ నేపథ్యంలో సరదాగా సాగిపోతాయి సన్నివేశాలు. కాకపోతే సాగదీత సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుడి కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో కూడా స్లో నరేషన్ సమస్యగా మారింది. కాస్త వేగం పెంచి చకచకా సినిమాను ముగించేసి ఉంటే అశోకవనంలో అర్జున కళ్యాణం రేంజ్ వేరుగా ఉండేది. ఎంగేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా రోటీన్ ఉంటుంది. అయినా ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేదిలా ఉంటుంది.
సాంకేతికంగా
ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ లో జై క్రిష్ సంగీతం ఒకటి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై అందంగా చూపించాడు. ఎటిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో చాలా సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువసు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5