Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : RRR


రివ్యూ : R R R 

Advertisement
CJ Advs

రిలీజ్ డేట్ : 25 - 03 - 2022 

బేనర్ : డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ 

నటీ నటులు : జూ.ఎన్ఠీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒవీలియా మోరిస్, శ్రియా శరన్,  రే స్టీవెన్సన్ , అలిసన్ డూడి, సముద్రఖని, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు

కథ : వి.విజయేంద్ర ప్రసాద్ 

కాస్ట్యూమ్స్ : రమా రాజమౌళి 

ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్ 

విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ : శ్రీనివాస మోహన్ 

సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్ 

సంగీతం : ఎం.ఎం.కీరవాణి 

నిర్మాత : డి.వి.వి.దానయ్య 

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి 

కొన్ని సినిమాలకి రివ్యూలు చదవకూడదు. రేటింగులు చూడకూడదు. 

RRR అలాంటి సినిమానే.

మీ టికెట్ ప్రైస్ కి సరిపడా సరంజామా సినిమాలో పుష్కలంగా ఉంది.

మీరు సినిమా చూసి వచ్చాక ఇది చదివితే సబబుగా ఉంటుంది. 

ఇక సరైన నిర్ణయం మీది. సమీక్ష మాది.!

తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోలు తారక్ - చరణ్. 

దేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ - అలియా భట్ వచ్చారు.

హాలీవుడ్ నుంచి ఒవీలియాతో సహా ఇంకొందరు చేరారు.

వంక పెట్టలేని సబ్జెక్టు - వందల కోట్ల బడ్జెట్టు 

తట్టుకోలేని కారణాలు - తప్పని వాయిదాలు 

అన్నిటినీ అధిగమించి నేటికి వెండి తెరపై వెలసింది RRR 

ఇప్పుడిక ఈ సినిమా గురించి చెప్పుకునేముందు విజ్ఞులైన వీక్షకులకు ఒక విజ్ఞప్తి.

ఇది ఎనాలసిస్ కాదు. ఎక్స్ పీరియన్స్.

ఇక్కడ చేసేవి కామెంట్స్ కాదు... కొన్ని కాంప్లిమెంట్సూ - మరికొన్ని కంప్లైంట్సు.

ఇతర చిత్రాల రివ్యూల్లా ఉండదిది... ఇంపార్టెన్స్ ఇస్తున్నాము కనుక.

కాకి లెక్కలేమీ ఉండవు... అంతటి కష్టాన్ని తక్కువ చేయలేము కనుక.

కానీ మ్యాటర్ నాటు నాటు గా అనిపిస్తది.. జెండా పట్టుకున్నంత జెన్యూన్ గా కనిపిస్తది.

మన భాషలో మాంచి RRR ట్రీట్ మీకోసం.!!

R... The oxygen

ఈ సినిమాకి టైటిల్స్ కొంచెం కొత్తగా వేశారు జక్కన్న. మనం కూడా అదే థియరీ ఫాలో అవుదాం.

ఆయన R ఫైర్ నీ - R వాటర్ నీ ఇంట్రడ్యూస్ చేసారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కి ఆక్సిజన్ అయిన అసలు R రాజమౌళి కనుక అక్కడినుంచే మొదలుపెడదాం. గత కొన్నేళ్లుగా కొందరు హీరో కాంబినేషన్స్ తో సినిమాలు వస్తున్నాయి. చూస్తున్నాం.

కానీ మనం ఆశ్చర్యపోయేంతటి నిఖార్సైన మల్టీ స్టారర్ ఏదంటే RRR తప్ప వేరేది చెప్పగలమా.? R R R కాకుండా ఇంకో సినిమాని కన్సిడర్ చేయగలమా.? వ్యక్తిగతంగా తాను తెచ్చుకున్న క్రేజ్ ని, ఇమేజ్ ని పణంగా పెట్టి దర్శక బాహుబలి రాజమౌళి మాత్రమే తారక్ - చరణ్ ల అనూహ్యమైన కలయికని అమలుపరిచారు. అందరూ జస్ట్ ఆలోచించడానికి కూడా అసాధ్యం అనుకునే అద్భుతాన్ని ఆవిష్కరించే పని చేపట్టారు. ఆ విషయంలో మాత్రం జక్కన్నకు మిక్కిలి రుణపడి ఉంటారు ఇద్దరు హీరోల అభిమానులూ.! 

మొత్తానికి సెట్ చేసినా - అప్ సెట్ చేసినా ఆ క్రెడిట్ రాజమౌళిదే. తన సినిమాలోని ప్రతి ఫ్రేమ్ నీ ఎంతో శ్రద్దగా చెక్కే జక్కన్నని తక్కువ చేయలేము. తప్పు పట్టలేము. తన కష్టానికి తగ్గ ఫలితం రాబట్టుకోవాలని మాత్రమే కోరుకుంటాం. ఇప్పుడు కూడా అది వస్తుందనే అనుకుందాం. దక్కాలనే ఆశిద్దాం. 

R ... The  water 

కాగడా పెట్టి వెతికినా కల్మషం కనిపించని స్వచ్ఛమైన నీటిలాంటి వ్యక్తిగా.. అవసరమైన సందర్భంలో మాత్రమే గాండ్రించే గొండ్రు బెబ్బులిగా తారక్ నటన అతని అభినయ సామర్ధ్యాన్ని మరోమారు ధృడంగా చూపించింది. నిజానికి తారక్ తనని తాను తగ్గించుకుని మరీ జక్కన్నపై మొక్కవోని నమ్మకంతో చేసిన ఈ క్యారెక్టర్ తనకి ఖచ్చితంగా కొత్త అభిమానుల్ని కూడా సంపాదించిపెట్టే స్థాయిలోనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా కొమరం భీముడొ సాంగ్ ఎపిసోడ్ లో తారక్ అభినయం అతనెంతటి బెస్ట్ పర్ ఫార్మర్ అనేదానికి చిరకాలం చెప్పుకునే ఉదాహరణగా మిగిలిపోతుంది.

ఇక యాక్షన్ సీన్స్ విషయంలో ఈ నందమూరి నాయకుడు ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో అందరికీ తెలిసిందే. ఎన్ఠీఆర్ చేసే ఎనర్జిటిక్ డాన్స్ కూడా ప్రేక్షకులకు పరిచయం ఉన్నదే. వాటన్నిటినీ కథలో అందంగా పొందు పరిచిన రాజమౌళి తారక మంత్రంలా మార్చుకున్నారు ఎన్ఠీఆర్ ఎబిలిటీస్ ని. ఎక్కడో కొంతమందికి కాస్త అసంతృప్తిగా అనిపించొచ్చు గాక...  ఫైనల్ గా మాత్రం చిన్న రాముడిని తనివితీరా తెరపై చూసుకోవాలనే అభిమానుల ఆకాంక్షను నెరవేర్చేలా  అద్భుతమైన కొమరం భీమ్ పాత్రను పట్టుకొచ్చి ప్రతిష్టించారు రాజమౌళి. ఇక రాజీ పడనక్కర్లేని రోల్ - రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉంటే సింహాద్రి శివాలెత్తకుండా ఉంటాడా..!

R... The  Fire  

హీరోగా తారక్ సీనియర్ కనుక.. అభినయంలోనూ అనుభవజ్ఞుడు కనుక అతని నటనా పటిమ గురించి ముందు ప్రస్తావించాం కానీ RRR లో భిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో దున్నేసాడు చరణ్. తారక్ తో ఉన్న భాందవ్యం - రాజమౌళి చూపే వాత్సల్యం రామ్ చరణ్ కి అదనపు ఆయుధాలుగా మారిపోయి తనలోని నటుడిని నిర్భయంగా నడిపించాయి తెరపైకి.

RRR కథకుడు విజయేంద్రప్రసాద్ చెప్పినట్లు వేరియస్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్ లో వెర్శటైల్ పర్ ఫార్మెన్స్ చూపించిన చరణ్ కి తారక్ - రాజమౌళిల రూపం లో మంచి అండ దండ దొరికింది. ఎస్పెషల్లీ ఇంట్రో సీన్ లో చెర్రీ చూపించిన ఇంటెన్సిటీ.. భీమ్ ని బాధించే సీన్స్ లో కళ్ళతోనే పలికించిన ఎమోషన్స్ చరణ్ లోని సిన్సియర్ యాక్టర్ ని మనకు చూపిస్తాయి. ఇక క్లైమాక్స్ పార్ట్ లో అల్లూరి సీతారామరాజుగా తన ట్రాన్స్ ఫార్మేషన్ 150 పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడికే కాదు.. 150 కి పైగా సినిమాలు చేసిన చరణ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవికి కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

సరైన క్యారెక్టర్ పడితే... సమర్ధుడైన దర్శకుడు ఉంటే రంగస్థలం ఏదైనా వీరంగం ఆడేస్తానని ప్రూవ్ చేసుకున్న చరణ్ బహుశా నెక్సెట్ జెనరేషన్ ఆడియన్స్ కి అతడే అల్లూరి సీతారామరాజుగా గుర్తుండిపోతాడేమో. ఎందుకంటే RRR చూసిన ఏ వ్యక్తీ ఈ మాటను కాదనలేడు. చెర్రీ స్క్రీన్ ప్రెజెన్స్ ని వేలెత్తి వంక పెట్టలేడు.

అది రాజమౌళి రేపిన ఫైర్. ఇంక ఆ టాపిక్ క్లియర్.!

ఇక అసలు విషయంలోకి పోదాం.

R రాత 

R రాకడ 

R రాబడి

ఇప్పటివరకు తన తనయుడికి పెన్నుతో వెన్నుదన్నుగా నిలుచున్న విజయేంద్రప్రసాద్ ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గారు. అలాగే తన తమ్ముడి అమ్ములపొదిలోకి సుస్వరాల అస్త్రాలను చేర్చే కీరవాణి కూడా ఈసారి గత ప్రతాపాన్ని చూపలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు క్రీమ్ స్టోర్మ్ బాగానే పని చేసింది కానీ దోస్తీ - నాటు నాటు పాటలు బాహుబలి నాటి హై తేలేకపోయాయి. సాయి మాధవ్ మాటలు వినడానికే తప్ప గుర్తుండేవి.. గుర్తుంచుకునేవి కావు. శ్రీకర్ ప్రసాద్ ఖర్చుని - కష్టాన్ని చూసి ఆగారేమో. కరెక్ట్ గా కాలిక్యులేట్ చేసుంటే 20 మినిట్స్ అవలీలగా.. అలవోకగా పక్కకు పోయేది. కెమెరామెన్ సెంథిల్ పనితనానికి మాత్రం పేరు పెట్టలేం. వంక వెతకలేం. రాతలోనే సరిగా కుదరని ఈ కథకి రాకడలో మాత్రం అంతా మంచే జరిగింది. హీరోలిద్దరూ పంచ ప్రాణాలూ పెట్టేసారు సినిమాకి. ఎంతోమంది ఆర్టిస్టులు దాసోహం దొరా అన్నారు రాజమౌళికి. మరి ఎక్కడ ఏం మార్పు వచ్చిందో - రాబడి లో అదెంత తేడా తెచ్చిందో కూడా చర్చించేద్దాం.

చరిత్రకారుల పాత్రలను ఎంచుకున్నారు. చరిత్రను వక్రీకరించారనే విమర్శలకు సిద్ధపడ్డారు. అలాగని అద్భుతాలేం చేయలేదు. కథకుడిగా విజయేంద్రప్రసాద్ నిబద్దత పాడైందో.. దర్శకుడిగా రాజమౌళి నిర్లక్ష్యం తోడైందో జరగాల్సిన తేడా అయితే జరిగింది. నాలుగేళ్ల విలువైన సమయం - నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ కి తగ్గ మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫుట్ ఇవ్వడంలో మాస్టర్ మైండ్ రాజమౌళి తడబడిపోయారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీ పీపుల్ జయహో రాజమౌళి అనొచ్చు. పెయిడ్ రివ్యూయర్స్ జేజేలు పలకొచ్చు. కానీ వాస్తవాన్ని అర్ధం చేసుకునే జక్కన్నకు అవేమీ కిక్కివ్వవు. బహుశా మొదట్లో ఆవేశం.. ఆపై అయోమయం.. ఆ తర్వాత ఆలోచన ఆయన్ని కరెక్ట్ చేసేస్తాయి. ఇక ఈ సినిమాపై స్పాయిలర్స్ ఏమి ఇవ్వొద్దని మనం కథని, కథనాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినా చెప్పి తీరాల్సిన తప్పులు కొన్ని ఉండొచ్చు. రాజమౌళి లాంటి దర్శకుడి గురించి వ్యతిరేఖ వ్యాఖ్యానానికి కచ్చితమైన కారణాలూ చెప్పాల్సి రావొచ్చు. ఆ పని కూడా చేసేద్దాం.. వీలైనంత పద్దతిగా..!

మొదటి త్రీ డేస్ ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ కి తిరుగుండదు. జక్కన్న లెక్కల మేరకు జరిపిన ప్రమోషన్ స్కీమ్ వృధా అవ్వదు. అలాగని ఆపై లాంగ్ రన్ ఆశించే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. అదృష్టం కలిసొస్తే తప్ప.! 

ఇలాంటి కారణాలే  సింపుల్ గా చెప్పేసుకుందాం. 

సినిమా కథలో ఇద్దరు వ్యక్తులు ఒక పిల్లాణ్ణి కాపాడే ప్రాసెస్ లో కలవాలి అనేది కాన్సెప్ట్ అయితే దానికోసం ఏకంగా ట్రైన్ బ్లాస్టింగ్ అక్కర్లేదు. 

బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం ఇవ్వాలనే తపనని కాదనలేం కానీ ఎవరు పేల్చుతున్నారో ఎందుకు పేలిపోతున్నాయో కూడా తెలియని క్లైమాక్స్ సీన్ పెట్టక్కర్లేదు. 

సరే... మీకు బడ్జెట్ సపోర్ట్ చేస్తోంది - బిజినెస్ జరుగుతోంది అనుకుని చేసి ఉండొచ్చు. ఫైనల్ గా ఆ భారాన్ని ప్రేక్షకులపై రుద్దకూడదు.

ఈ మూవీని వేరే వాటితో కంపేర్ చేయడం ఎందుకు కానీ ఈ దర్శకుడి పద్ధతిపై మాత్రం కాస్త కంప్లైంట్ చెయ్యాలి.

టైటానిక్ లు, అవతార్ లు, ఇన్సెప్షన్ లు, గ్రావిటీలు, స్పైడర్ మ్యాన్ లు, అవెంజర్స్ అన్నీ మేము నార్మల్ రేట్స్ తోనే చూస్తున్నాం. నేను ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాను. నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా చూడాలి అనే దర్శకుడికి ఆల్రెడీ అది తప్పు అనే కనువిప్పు కలిగివుండాలి. 

తెలుగు సినిమాని ప్రపంచ భాషలకు పరిచయం చేసిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి తెలుగు వాళ్ళకే సరిగా అర్ధం కాని విధంగా సినిమా చేస్తే ఎలా..?

ఇద్దరు స్టార్ హీరోస్ బ్లైండ్ గా నమ్మేసి.. స్ట్రాంగ్ గా ఫిక్సయి మూడేళ్లపాటు ముప్పుతిప్పలు పడి పని చేసినా సమ న్యాయం చేయకుంటే శెభాష్ అనేదెలా.?

దర్శకుడిగా రాజమౌళి తపనని.. తపస్సుని అర్ధం చేసుకోగల క్రిటిక్స్ ఎవరూ ఆయన్ని నిందించలేరు. నిలదీయలేరు. అసలు తన ముందు నిలబడలేరు.

కానీ లోపాన్ని చెప్పకపోవడం కూడా పాపమే.

ఫ్యాన్స్ కోరుకునేలా హీరోస్ కి కావాల్సిన ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ఇది రాజమౌళి స్థాయి అవుట్ ఫుట్ కాదు.

గ్రాఫిక్స్ సాయంతో ఎన్ని మ్యాజిక్స్-  జిమ్మిక్స్ చేసినా ఇది రాజమౌళి ఎస్టాబ్లిష్ చేసే ఎమోషన్ కాదు. 

ఇక్కడ చెప్పుకు తీరాల్సిన మరో అంశం.. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి మామ్మూలుగా చేయలేదు సినిమాని. చరణ్ ఇంట్రో... తారక్ ఇంట్రో... ఇంటర్వెల్ బ్లాక్.. ఇలాంటివన్నీ  తాను మాత్రమే తీయగలను - చేయగలను అనే రేంజ్ లో స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు. అలాగే కొమరం భీముడో సాంగ్ ఎపిసోడ్ తారక్ ని తారాస్థాయికి తీసుకువెళితే అల్లూరి లుక్ లో రామ్ చరణ్ షాట్స్ అద్దిరిపోయాయి.

ఇంత తీసి అంతా చేసి టోటాలిటీ విషయంలో మాత్రం ఎంత ఎక్కువ టైమ్ దొరికినా తక్కువే కాన్ సంట్రేట్ చేసారు రాజమౌళి. ఎనీ హౌ సినిమా విషయంలో జరిగిన మిగిలిన మిస్టేక్స్ అన్నీ వేరే ఆర్టికల్స్ రూపం లో వెల్లడించుకుందాం. ఇది ఇక్కడితో ఆపేద్దాం.!

సినీజోష్ రేటింగ్ : 2.75 / 5

పంచ్ లైన్ : 

R రాంగ్ 

R రూట్ లో  

R రాజమౌళి 

 

Cinejosh Review : RRR :

Cinejosh Telugu Review RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs