సినీ జోష్ రివ్యూ: స్టాండ్ అప్ రాహుల్
రేటింగ్: 1.25/5
బ్యానర్: డ్రీం టౌన్ ప్రొడక్షన్స్, హై ఫైవ్ పిక్చర్స్
నటి నటులు: రాజ్ తరుణ్, వర్ష బాలమ్మ, ఇంద్రజ, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రావేంద్రన్
మ్యూజిక్: స్వీకర్ అగస్తి
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
ప్రొడ్యూసర్స్ :నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
డైరెక్టర్: సంతో మోహన్ వీరేంకి
రిలీజ్ డేట్: 18-03-2022
రాజ్ తరుణ్ అనగానే ఓ ఉయ్యాలా జంపాల, ఓ సినిమా చూపిస్తా మావ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కామెడీ టైమింగ్ తో, బాడీ లాంగ్వేజ్ తో ఒకప్పుడు హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ కి కొన్నాళ్లుగా కాదు కొన్నేళ్లుగా సక్సెస్ అనే పదమే వినిపించడం లేదు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు, వెళుతున్నాడు.. కానీ వాటి ఫలితాలు రాజ్ తరుణ్ కి ఎలాంటి హ్యాపీ నెస్ ఇవ్వడం లేదు. రీసెంట్ గా రాజ్ తరుణ్ - వర్ష బొల్లమ్మ కాంబినేషన్ లో సంతో మోహన్ వీరేంకి దర్శకత్వంలో స్టాండ్ అప్ రాహుల్ తెరకెక్కింది. ఆసక్తికర ప్రమోషన్స్ తో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి రాజ్ తరుణ్ కి స్టాండ్ అప్ రాహుల్ తో అయినా సక్సెస్ దక్కిందా.. లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
రాహుల్ (రాజ్ తరుణ్) కి స్టాండప్ కమెడియన్ కావాలనేది కల. ఎన్ని ఉద్యోగాలు చేసినా మధ్యలో వదిలేసే రకం రాహుల్. కానీ తల్లి మాట ప్రకారం ఉద్యోగం చేస్తూనే తనకిష్టమైన స్టాండ్ అప్ కామెడీని కొనసాగిస్తుంటారు. తన చిన్నప్పటి స్కూల్ మేట్, అలాగే తన ఆఫీస్ లోనే పని చేసే శ్రేయ రావు (వర్ష బొల్లమ్మ) తో ప్రేమలో పడతాడు. ఇద్దరు ప్రేమలో పడ్డా రాహుల్ కి పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో సహ జీవనం చేస్తారు. అసలు రాహుల్ కి పెళ్లిపై ఎందుకు నమ్మకం ఉండదు? రాహుల్ తల్లి తండ్రుల మధ్యలో ఏం జరిగింది? రాహుల్ తనకిష్టమైన స్టాండ్ అప్ కామెడీ కొనసాగించాడా? అసలు రాహుల్ కి శ్రేయ రావు కి పెళ్లవుతుందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు:
రాజ్ తరుణ్ తనకి సూట్ అయ్యే పాత్రలో రాహుల్ గా ఆకట్టుకున్నా కొన్ని సీన్స్ లో తేలిపోయాడు. కానీ లుక్స్ పరంగా కొత్తగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ నేచురల్ పెరఫార్మెన్స్ లో బెస్ట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ తల్లిగా ఇంద్రజ ఎప్పటిలానే తనదైన శైలిలో నటించి మెప్పించింది. కానీ మురళీశర్మ పాత్ర అంతగా అనిపించలేదు, వెన్నెల కిశోర్ కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
స్టాండ్ అప్ కామెడీ అంటే మైక్ ముందు నించుని కామెడీ చెయ్యడం. అది ఈ మధ్యనే వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బాచులర్ లో పూజ హెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించింది. ఇప్పుడు అదే కేరెక్టర్ లో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామెడీ చేసాడు. రాజ్ తరుణ్ కి ఇలాంటి కేరెక్టర్స్ కొత్తేమి కాదు. కానీ రాజ్ తరుణ్ లాంటి హీరోకి సరిపోయే కథలను సృష్టించడంలో దర్శకులు వరసగా విఫలమవుతూనే ఉన్నారు. రొటీన్ కథలతో రాజ్ తరుణ్ కూడా కథల ఎంపికలో తడబడుతున్నాడు. ఇప్పుడు కూడా స్టాండ్ అప్ రాహుల్ అంటూ దర్శకుడు సంతో రాజ్ తరుణ్ తో కామెడీ చేపిద్దామని చూసాడు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. స్టాండ్ అప్ రాహుల్ లో ఆ కామెడీనే మిస్ అయ్యింది. రాజ్ తరుణ్ ఈజ్ తో బాగానే పెరఫార్మెన్స్ ఇచ్చినా.. దర్శకుడు చేసిన తప్పిదాల వలన తేలిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా రాహుల్ లైఫ్ లో జరిగిన చిన్న చిన్న సంఘటనలు, తల్లికి మాటిచ్చినా తండ్రి నచ్చింది చెయ్యమనడం.. స్టాండ్ అప్ కామెడీ చెయ్యడం ఇలా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. పెళ్లి మీద నమ్మకం లేని రాహుల్ ను శ్రియ ప్రేమించడం, అతనినే పెళ్లి చేసుకోవాలనుకోవడం అతని కోసం లివింగ్ రిలేషన్ లో ఉండడానికి ఒప్పేసుకోవడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ కాస్త సంఘర్షణ రేకెత్తించినా సెకండ్ హాఫ్ లో రాహుల్, శ్రియ ఒకరికొకరు అలవాటు పడిపోయి చాలా హ్యాపీగా ఉన్నట్టు చూపించడం, స్టోరీ అంత ముందే తెలుసు అన్నట్టుగా ఆడియన్స్ ఊహకు తగినట్టుగా సాగడం, ఉన్నట్టుండి ప్రేమ ఎక్కువైపోతుందని భయమేసి హీరోయిన్ నుంచి హీరో దూరంగా వెళ్లిపోవడం, ఆ తర్వాత ఆమెకు పెళ్లి జరుగుతున్న సమయంలో వెళ్లి సినిమాటిక్ డైలాగులు కొట్టి పెళ్లి ఆపి తాను చేసుకోవడం.. వంటి సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు బోలెడన్ని సినిమాల్లో చూశామనిపించేలా ఉన్నాయి. హీరో పేరెంట్స్ మధ్యన ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకోలేదు, తెలిసిన కథే కావడం, ఆఖరికి క్లైమాక్స్ లో కూడా కొత్తదనమ్ లేదు. దర్శకుడు తీసుకున్న కథా నేపథ్యం బాగుంది కానీ దాన్ని తెరమీదకు ఎక్కించే ప్రయత్నం బెడిసికొట్టింది.
సాంకేతికంగా..
మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి మ్యూజిక్ అంతగా ఎక్కలేదు కానీ నేపథ్య సంగీతం చక్కగా ఉంది. శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రాంతాలను చాలా అందంగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.