రేటింగ్: 2.25/5
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, రాధికా, ఖుష్బూ, రవి శంకర్, సత్య, ఊర్వశి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
రిలీజ్ డేట్: 04-03-2022
శర్వానంద్ హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరస సినిమాలతో బిజీగా ఉన్న హీరో. డీసెంట్ టాక్ తో వచ్చిన శ్రీకారం, జాను సినిమాలు శర్వా కి హిట్ ని అందించలేకపోయాయి. మహా సముద్రం తర్వాత శర్వానంద్, లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కిషోర్ తిరుమలతో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని ఎంచుకున్నాడు. ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కూడా తోడవడంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి. శర్వానంద్ గత చిత్రాల విషయం పక్కనబెట్టి మరీ సినిమాపై మేకర్స్ అంచనాలు పెంచారు. లేడీ కేరెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన రాధికా, ఖుష్బూ, ఊర్వశి లాంటి వారితో ప్రమోషన్స్ చేస్తూ.. అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి గ్లామర్ భామలని తీసుకురావడం కూడా సినిమాపై అంచనాలు పెరిగేందుకు ప్లస్ అయ్యింది. మరి శర్వానంద్ - రష్మిక తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు తో ఎంతవరకు మెప్పించాడో సమీక్షలో చూసేద్దాం.
కథ:
చిరు(శర్వానంద్) ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ఒకే ఒక అబ్బాయి. చిరు అంటే ఆ ఫ్యామిలోని ప్రతి ఒక్కరికి ప్రాణం. చిరు కి పెళ్లి చెయ్యాలని ఫ్యామిలీ మెంబెర్స్ అంతా డిసైడ్ అయ్యి అతనికి సంబంధాలు చూస్తుంటారు. కొన్ని సంబందాలు చిరుకి నచ్చినా.. అతని ఫ్యామిలిలో లేడీస్ కి నచ్చవు. దానితో చిరుకి ఎన్ని సంబంధాలు వచ్చినా అవి సెట్ కావు. అలా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న చిరు కి ఆద్య(రష్మిక) పరిచయమవుతుంది. వారిద్దరూ చాలా తొందరగానే ప్రేమలో పడతారు. కానీ ఆద్య తల్లి(ఖుష్బూ) మాత్రం తన కూతురు ఆద్యకి పెళ్లి చెయ్యాలని అనుకోదు. దానితో ఆద్య కూడా చిరు తో పెళ్లికి అంగీకరించదు. అసలు ఆద్య తల్లి ఆద్యకి ఎందుకు పెళ్లి చెయ్యాలనుకోదు? ఆమెకున్న ప్రోబ్లెంస్ ఏమిటి? చిరు ఆద్య తల్లిని ఒప్పించి ఆద్యని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే ఆడవాళ్లు మీకు జోహార్లు బిగ్ స్క్రీన్ మీద వీక్షించాల్సిందే.
కథనం:
కిషోర్ తిరుమల చిత్రాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, లేదంటే కుటుంబానికి మెచ్చే చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్. ఇక శర్వానంద్ పక్కింటి కుర్రాడిగానే తెలుగు ప్రేక్షకుల్లో మదిలో నిలిచిన హీరో. మరి కిషోర్ - శర్వా కలయికలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే.. ఆ సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. వీరి కలయికలో ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అంతే ఆసక్తిని క్రియేట్ చేసింది. హీరో ఉమ్మడి కుటుంబానికి గారాల కొడుకుగా ప్రేమని పొందడం, కానీ పెళ్లి విషయంలోపు ఇంట్లో ఆడవాళ్లు పెత్తనంతో.. పెళ్లి కూతుళ్ళని తిరస్కరించడం, ఆ తర్వాత అమ్మాయిలే హీరోని రిజెక్ట్ చెయ్యడం వంటి సన్నివేశాలు కామెడీ తో ఫన్ జెనెరేట్ చేసాయి. ఆ తర్వాత హీరో చిరు - హీరోయిన్ ఆద్యతో ప్రేమ మొదలయ్యాకే.. అదో లవ్ స్టోరీలా టర్న్ తీసుకుంది. ఆ తర్వాత ఆద్య తల్లి వలన వారి పెళ్ళికి ఆటంకం ఎదురవ్వడం, ఉమ్మడికుటుంబంలో పెరిగిన హీరో సడన్ గా హీరోయిన్ తల్లి వైపు తిరగడం లాంటి సీన్స్ ని దర్శకుడు ఆసక్తిగా మలచలేకపోయారనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కామెడీని, ఆ ఎమోషనల్ ని క్యారీ చేయలేకపోయారు. రొటీన్ స్టోరీ కావడం, హీరోయిన్ తల్లి ప్రాబ్లమ్ ని ఎమోషనల్ కనెక్ట్ లేకుండా చెప్పించడం, క్లైమాక్స్ కూడా అంత బలంగా లేకపోవడం తో ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడియన్స్ ని అంతగా అట్రాక్ట్ చెయ్యలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం అంతో ఇంతో మెప్పించే సత్తా ఉన్న చిత్రం.
నటీనటులు:
శర్వానంద్ చిరు ఏరెక్టర్ లో చాలా స్టైలిష్ గా, సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. ఇలాంటి కథలని పర్ఫెక్ట్ గా శర్వా ఓన్ చేసుకుంటాడు. ఫ్యామిలీ హీరోగా శర్వాకున్న పేరు.. ఈ చిత్రంతో మరింత బలపడుతుంది అనడంలో సందేహం లేదు. రష్మిక తో శర్వానంద్ రొమాన్స్ క్యూట్ గా అనిపిస్తుంది. హీరోయిన్ రష్మిక ఫ్యామిలీ సీన్స్ లో సారీస్, చుడి దార్స్ లో ట్రెడిషనల్ గా అద్భుతమైన లుక్స్ తో ఆకట్టుకోగా.. సాంగ్స్ లో గ్లామర్ ని చూపించింది. రాధికా, ఖుష్బూ, ఊర్వశి బలమైన కెరేకర్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇంటర్వెల్ టైం లో శర్వానంద్ - ఊర్వశి మధ్యన కామెడీ ట్రాక్ అదిరిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ లీడ్ తీసుకోగా.. సెకండ్ హాఫ్ లో సత్య, ప్రదీప్ రావత్ కామెడీ లీడ్ తీసుకున్నారు. మిగతా పాత్రలు పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు:
దేవిశ్రీ సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో హైలైట్ అయ్యింది. అలాగే పాటల విషయానికి వస్తే ఆ పాటలు ఇది వరకే విన్న ఫీలింగ్ కలిగిస్తాయి. కానీ తెరపై ఆ పాటలు వచ్చే మూడ్, సిట్యువేషన్లకు సరిపోయాయి. ఇక ఎడిటర్ శ్రీకర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సుజిత్ సారంగ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా కల ఫుల్ గా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
దర్శకుడు కిషోర్ తిరుమల ఈసారి ఎమోషన్‌ని మిస్సయ్యాడు అనిపిస్తుంది. ఫన్ పండించే విషయంలో అక్కడక్కడ వర్కవుట్ అయినట్టే, ఎమోషన్ కూడా మిక్స్ చేయగలిగితే బాగుండేది. శర్వానంద్ పెరఫార్మెన్స్, రష్మిక నటన, ఫ్యామిలీ స్టోరీ, డైలాగ్స్ బావున్నా, కథనం, కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ముందే ఊహకి అందడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు బలమైన సంఘర్షణ లేని కీలక సీన్స్ వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోయినా.. ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకుంటుంది.