Advertisement
Google Ads BL

సినీ జోష్ రివ్యూ : భీమ్లా నాయక్


సినీ జోష్ రేటింగ్ : 3/5

Advertisement
CJ Advs

రివ్యూ : భీమ్లా నాయక్ 

రిలీజ్ డేట్ : 25 - 02 - 2022 

బేనర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్ 

నటీనటులు : పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, మురళీశర్మ, రావు రమేష్త, సంజయ్ స్వరూప్, తనికెళ్ళ భరణి తదితరులు

ఎడిటింగ్ : నవీన్ నూలి 

సినిమాటోగ్రఫీ : రవి కె.చంద్రన్ 

సంగీతం : తమన్ 

డైలాగ్స్ & స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్

నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ 

దర్శకత్వం : సాగర్ కె.చంద్ర 

 

పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతూనే ఉంటాయి. భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరిగింది. అయితే భీమ్లాతో తలపడేది భల్లాల దేవుడైన దగ్గుబాటి రానా కావడంతో  అభిమానులే కాక ఆడియన్స్ అందరూ ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. పవన్ - రానాల పోటా పోటీ నటనే ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కు ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులే ప్రచార అస్త్రంగా పని చేసాయి. తమన్ సాంగ్స్ ఊపేసాయి. త్రివిక్రమ్ డైలాగ్స్ ఊరించాయి. మొత్తానికి భీభత్సమైన హైప్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ చిత్ర విశ్లేషణలోకి వెళితే....

కథ : ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపిక అయేంతటి సిన్సియర్ సబ్ ఇనస్పెక్టర్ భీమ్లా నాయక్. ఆర్మీలో పని చేసి వచ్చిన అనుభవంతో పాటు రాజకీయ పలుకుబడి కూడా కలిగిన అహంకారి డేనియల్ శేఖర్. ఈ రెండు పాత్రల మధ్య ఓ చిన్న సంఘటనతో మొదలైన జగడం ఎంతగా పెరిగిపోయింది.. ఏ స్థాయి పోరాటానికి దారి తీసిందన్నదే క్లుప్తంగా కథ. అయ్యప్పనుమ్ కోషియం పేరుతో మలయాళంలో విడుదలై విజయం సాధించిన చిత్రం ఆధారంగా భీమ్లా నాయక్ ను మలిచినప్పటికీ మన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణమైన మార్పులు చేసారు.. పవన్ ఇమేజ్ కి తగ్గ ఎలివేషన్స్ ని చేర్చారు.

కథనం : స్క్రిప్ట్ లోని సోల్ ని రాంగ్ రూట్ లోకి వెళ్లనివ్వని స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేనే భీమ్లా నాయక్ కి బిగ్ ఎస్సెట్. పవన్ లాంటి పెద్ద స్టార్ ఉన్నప్పటికీ ఎటువంటి ఎక్సట్రా బిల్డప్పులు లేకుండా నేరుగా కథ ప్రారంభించడాన్ని అభినందించాలి. పవర్ స్టార్ ప్రతి సినిమాలోనూ ఇంట్రో సాంగ్ ని ప్రత్యేక రీతిలో ఆస్వాదించే అభిమానుల్ని పవన్ పాట కోసం అరగంట పాటు వెయిట్ చేయించింది భీమ్లా కథనం. అంతేకాదు సినిమా మొత్తం అదే బాణీలో అసలు సంఘర్షణ పక్కదారి పట్టకుండా చూసుకున్నారు త్రివిక్రమ్. పవన్ కోసం యాడ్ చేసిన పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఫ్యాన్సుని శాటిస్ ఫై చేసిన గురూజీ అదే ఎపిసోడ్ లింకుతో క్లయిమాక్సుకి కొత్త ట్విస్టు కలిపి అయ్యప్పనుమ్ చూసేసిన ఆడియన్సుని కూడా ఇంప్రెస్ చేసారు. ముఖ్యంగా అహానికీ - ఆత్మ గౌరవానికీ మధ్య జరిగే యుద్ధంలో అడవి తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రశంసనీయం.!

నటీ నటులు : మరింత పదునెక్కిన పవన్ అభినయాన్ని భీమ్లా నాయక్ పాత్రలో మనం చూడొచ్చు. వకీల్ సాబ్ సినిమా చేసినపుడు కూడా తనదైన సెటైరికల్ పంచెస్ వదలని పవన్ భీమ్లాలో మాత్రం ఆ పాత్రకి తగ్గ రీతిలో నటించారు. చేసిన ప్రతి సినిమాలోనూ తన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ని చాటుకునే పవన్ కి  ఇంకా ఎగ్రెసివ్ గా చెలరేగే ఛాన్స్ ఇచ్చింది భీమ్లా క్యారెక్టర్. దాంతో తనదైన యాటిట్యూడ్ చూపిస్తూ ఎమోషనల్ సీన్స్ లోని ఇంటెన్సిటీని ఇంకా ఇంక్రీజ్ చేసేసారు పవన్. ఇక అయన డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పేదేముంది. థియేటర్సులో వినిపించే విజిల్స్ సౌండ్ ఎలా ఉంటుందో, ఎంతుంటుందో తెలిసిందేగా. ఇక దగ్గుబాటి రానా విషయానికి వస్తే బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి ఛాలెంజింగ్ రోల్ భీమ్లాలో పడింది రానాకి. అంతే... సినిమా మొత్తం రొమ్ము విరుచుకుని నడుస్తూ కుమ్మి కుమ్మి వదిలాడు రానా. ఆరడుగుల అహంకారాన్ని తెరపై పరిచి పోటెత్తే పొగరుని తన ప్రతి కదలికలోను చూపించాడు. సినిమా ఓపెనింగ్ సీన్ నుంచీ ఎండ్ షాట్ వరకు కూడా ఈగోకి లోగోలా అనిపించే బాడీ లాంగ్వేజ్ తో పవర్ హౌస్ వంటి పవన్ ని ఢీ కొడుతూ శెభాష్ అనిపించుకున్నాడు. అలాగే స్పేస్ తక్కువే అయినా కాస్త స్ట్రెంగ్త్ ఉన్న భీమ్లా భార్య రోల్ నిత్యా మీనన్ కి దక్కితే... సాఫ్ట్ క్యారెక్టర్ లో డానీ వైఫ్ గా సంయుక్త మీనన్ ఆకట్టుకుంది. మురళి శర్మ సెటిల్డ్ గా పెర్ ఫార్మ్ చేస్తే రావు రమేష్ సెటైర్స్ తో ఎంటర్ టైన్ చేసారు. సముద్రఖని, సంజయ్, తనికెళ్ళ భరణి తదితరులు పాత్రోచితంగా నటించారు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో సునీల్, సప్తగిరి, జబర్దస్త్ ఆది వంటి వాళ్ళు తళుక్కున మెరవడంతో పాటు పవన్ తో కలిసి స్టెప్పేసే అవకాశం పొందారు. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సినిమా చివరిలో జడ్జిగా గెస్ట్ రోల్ చేసి ప్రేక్షకుల పెదవులపైకి చిరునవ్వులు తేవడం విశేషం.

సాంకేతిక నిపుణులు : పవన్ - రానాల కాంబో ఎంత కరెక్టుగా కుదిరిందో.. స్క్రిప్ట్, మ్యూజిక్, విజువల్స్ అంతే అద్భుతంగా అమరాయి భీమ్లాకి. సీనియర్ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ అడవి తల్లి వడిలోకి తీసుకెళ్లారు ఆడియన్సుని. లా లా భీమ్లా అంటూ అభిమానులు ఊగిపోయే పాటలు ఇచ్చిన తమన్ నేపథ్య సంగీతంలో మరోమారు తన అఖండ ప్రతిభను ప్రదర్శించాడు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ భీమ్లాకి ఇంకో బిగ్ ప్లస్ పాయింట్. కొన్ని కొత్త సన్నివేశాలు చేర్చి మరీ మూడు గంటల మాతృక నిడివిని రెండున్నర గంటలకే కుదించినా కథలోని కాన్ ఫ్లిక్ట్ కరెక్టుగా కన్వే అయ్యేలా చేసింది నవీన్ నైపుణ్యం. సరే మరి.. భీమ్లాలో తప్పనిసరిగా చెప్పుకుతీరాల్సిన అసలు నాయక్ విషయానికి వస్తే.. ఆయనలో అజ్ఞాతంగా దాగి ఉన్న కసిని తీర్చుకుంటున్నట్టు తన కలం బలంతో బాక్సాఫీస్ కి తిరుగులేని పంచ్ ఇచ్చారు త్రివిక్రమ్. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ రైట్స్ తీసుకోవడం నుంచీ ఆ ప్రాజెక్టులోకి ఏకంగా పవర్ స్టారునే తీసుకురావడం వరకు కీ రోల్ ప్లే చేసిన త్రివిక్రమ్ రైటింగ్ బాధ్యతను కూడా భుజాన వేసుకుని మోశారు. అదరగొట్టు.. దంచికొట్టు అంటూ ప్రియ మితుడు పవన్ కోసం పాటనీ రాసేసిన త్రివిక్రమ్ తాను కూడా స్క్రీన్ ప్లే విషయంలో అదరగొట్టారు. డైలాగ్సుతో దంచికొట్టారు. దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి  దారేది వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ 2018 సంక్రాంతి పండగపుడు మాత్రం పవన్ ఫ్యాన్సుని నిరాశపరిచారు. కనుకనే ఆ బాకీ చెల్లించేందుకు ఈ భీమ్లాని పండగలాంటి సినిమాలా మార్చారనీ, మలిచారనీ అనుకోవచ్చు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిన్న సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సాగర్ చంద్రకి డబుల్ ధమాకాలా దొరికింది భీమ్లా నాయక్. స్క్రీన్ వైజ్ పవన్ లాంటి మాస్ హీరో... స్క్రిప్ట్ వైజ్ త్రివిక్రమ్ వంటి మాటల మాంత్రికుడు తోడుంటే మనల్నెవడ్రా ఆపేది అని దూసుకుపోవచ్చుగా.  అదే చేసాడు సాగర్. త్రివిక్రమ్ అందించిన స్క్రీన్ ప్లే ని, సినిమాటోగ్రాఫర్ రవి చంద్రన్ విజన్ నీ, ఆయా సీన్స్ కి తమన్ ఇచ్చే థండరింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నీ మిక్స్ చేసి, మ్యాచ్ చేసి మార్వలెస్ అవుట్ ఫుట్ పట్టుకొచ్చి జనం ముందు పెట్టాడు. ఆ ఎఫర్ట్ కి తగ్గ రిజల్టునీ పట్టాడు. నిర్మాత నాగ వంశీ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కానీ చెప్పడానికి ఇంకా టైమ్ ఉంది. సినిమా వరకు అయితే ప్రొడక్షన్ వాల్యూస్ లో వంక పెట్టడానికి ఏమీ లేదు. బికాజ్.. అది పవన్ సినిమా. అక్కడ ఉన్నది త్రివిక్రమ్.!

విశ్లేషణ : ఓ సినిమాకి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుండే ఉంటుంది. కానీ అస్సలు బాలేని సిట్యుయేషన్ కూడా అడ్వాంటేజ్ గా మారి అహంకారానికి సమాధానం చెప్పే ఆత్మ గౌరవం అవుతుంది అనడానికి నిదర్సనం భీమ్లా సినిమాకి వస్తోన్న రెస్పాన్స్. ఒక్కసారి జనం రివోల్ట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో భీమ్లా చూపించబోతున్నాడు. హిట్ అనిపించుకోగలిగే కంటెంట్ తోనే హీట్ పుట్టించేసి ఇంక్రీడబుల్ రికార్డ్స్ ని ఇన్ వైట్ చేస్తున్నాడు. కళని అణచాలని చూడకండి... కారు మబ్బులా కమ్మేసి తుఫాన్ లా మారిపోతుందని  ఇతర ప్రాంతాల గణాంకాల సాక్షిగా గర్జిస్తున్నాడు.!

ఫినిషింగ్ టచ్ : ఇటున్నాడు కనుకే చట్టం.. అటు వస్తే కష్టం.!

Bheemla Nayak Review:

Bheemla nayak Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs