సినీజోష్ రివ్యూ: అఖండ
బ్యానర్: ద్వారక క్రియేషన్స్
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, సాయికుమార్, శ్రవణ్, ప్రభాకర్ తదితరులు
మ్యూజిక్ తమన్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
డైలాగ్స్: ఎమ్.రత్నం
యాక్షన్: స్టంట్ శివ, రామ్, లక్ష్మణ్
ప్రొడ్యూసర్: మిర్యాల రవీందర్‌రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
కరోనా సెకండ్ వేవ్ ముగిసింది.. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. వారం వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కానీ జులై నుండి ఇంతవరకు ఒక్క భారీ బడ్జెట్ చిత్రం కూడా రాలేదు.. పెద్ద సినిమా, స్టార్ హీరోల సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద సందడి చెయ్యలేదు.. ఇక డిసెంబర్ లో బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ వస్తుంది అనగానే అంచనాలు, హైప్, అందరిలో ఆసక్తి మొదలైపోయింది. బాలయ్య - బోయపాటి కాంబో లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ కావడం, బోయపాటి మేకింగ్ కి బాలకృష్ణ యాక్షన్, స్టయిల్, అలాగే చాలా రోజుల తర్వాత బిగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం, అఖండ మూవీ లో బాలకృష్ణ అఘోర గెటప్, అఖండ ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. అంతేకాకుండా బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రావడం.. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా చేసింది. భారీ ప్రమోషన్స్ తో భారీ అంచనాలు నడుమ ప్రేక్షకులముందుకు వచ్చిన అఖండ ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.
కథ:
మురళీకృష్ణ (బాలకృష్ణ)ఫ్యాక్షన్ ని అరికట్టి తన లాగే అందరి చేత వ్యవసాయం చేయిస్తుంటాడు, ఫ్యాక్షనిస్టులని మార్చి మార్పుకి శ్రీకారం చుడతాడు. ఆసుపత్రులు కట్టించి, పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో వైద్యం అందిస్తుంటాడు. పాఠశాలలు కట్టించి విద్య నేర్పిస్తాడు. అనంతపురం జిల్లాకి కొత్త కలెక్టర్ గా శరణ్య (ప్రగ్యా జైస్వాల్) దిగుతుంది. మురళి కృష్ణని ప్రేమించి పెళ్లాడింది. ఆ ప్రాంతంలో వరద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని నడుపుతుంటాడు. వరద రాజులు యురేనియం తవ్వకాలతో చిన్నారుల ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. పుట్టిన బిడ్డ.. పుట్టినట్టే కన్నుమూస్తుంటుంది. ఈ అరాచకాన్ని అడ్డుకోవడానికి, వరదరాజులు, మైనింగ్ మాఫియా భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన మురళీకృష్ణని వరదరాజులు ఓ కేసులో ఇరికించి జైలు కి పంపిస్తాడు. అసలు వరద రాజులు వెనక ఉన్న మాఫియా లీడర్ ఎవరు? చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన మురళీకృష్ణ తోడబుట్టిన శివుడు (బాలకృష్ణ) ఎక్కడ పెరిగాడు? ఊహ తెలియకముందే వారిద్దరూ విడిపోవడానికి కారణమేమిటి? మురళీకృష్ణకి, కుటుంబానికి శివుడు ఎలా సాయం చేశాడన్నదే అఖండ మిగతా కథ
పెరఫార్మెన్స్:
బోయపాటి బాలకృష్ణ ని ఎంతందంగా, ఎంత మాస్ గా చూపిస్తాడో.. లెజెండ్, సింహ మూవీస్ లో చూసాం. మరి అఖండ లో ఇంకెలా ఉంటాడో అనుకుంటే.. మురళీకృష్ణ పాత్రలో బాలయ్య ని చాలా అందంగా సూపర్ గా చూపించాడు. ఫైట్స్‌లో బాలయ్య ఎంత కోపంగా, ఆవేశంగా కనిపిస్తాడో.. అఖండ ఇంట్రడక్షన్ ఫైట్ లో బాలయ్య అందంగా కనిపించాడు. జై బాలయ్య పాటలో బాలకృష్ణ న్యూ స్టెప్స్ తో అదరగొట్టేసాడు. అఖండగా.. బాలయ్య గెటప్ సూటయ్యింది. ఇక డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు.. అదంతా.. సింహా, లెజెండ్ ల సినిమాల్లో చూసినట్టుగానే ఉంది. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడు. హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ గ్లామరెస్ గా కనిపించింది. కలెక్టర్‌గా రెండు మూడు సన్నివేశాల్లో మెరిసిన తరవాత.. కథ ప్రకారం తనని డీ గ్లామర్ గా చూపించాల్సివచ్చింది. జగపతిబాబు గెటప్, అయన వాయిస్ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ టైం క్రూరమైన విలన్ గా నటించిన శ్రీకాంత్ పట్టీపట్టీ నటించినట్టు అనిపిస్తుంది. బాలకృష్ణతో తొలిసారి ఎదురుపడే సన్నివేశం, అఘోరాతో తలపడే సన్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి.. పూర్ణ చక్కగా కనిపించింది. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
బాలకృష్ణ తో బోయపాటి అనగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. బోయపాటి దర్శకత్వానికి బాలకృష్ణ యాక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ.. అన్ని మాస్ ప్రేక్షకులని ఊపేస్తాయి. బాలకృష్ణ లోని పవర్ ఫుల్ నటుడిని బోయపాటి కన్నా ఎక్కువగా ఎవరూ చూపించలేరేమో అనేంతగా బాలయ్య లోని నటుడిని బోయపాటి బయటికి తీసాడు. లెజెండ్, సింహ చిత్రాలతో బాలయ్యని చూపించిన తీరుకి ఫాన్స్ ఇప్పటికీ ఫిదానే. మరి అదే కాంబోలో హ్యాట్రిక్ మూవీ అంటే.. లెజెండ్, సింహాలకి మించి ఊహించుకుంటారు ఫాన్స్. మరి ఆ కాంబో నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. బాలయ్య ని శివుడు అలియాస్ అఖండగా చూపించిన తీరుకు మాస్ ఫాన్స్ కి పూనకాలే.మురళి కృష్ణ కేరెక్టర్ లోను బాలకృష్ణ అదిరిపోయాడు.అఖండ లో ఓ పాత్ర ప్రళయాన్ని గుర్తు చేస్తే, మరో పాత్ర అందంగా తెరపై కనిపిస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాలు మొదలుకొని చివరి వరకు ప్రతీ సన్నివేశం కూడా బాలకృష్ణ మాస్ ఇమేజ్, బోయపాటి మార్క్ థీమ్ మేరకు సాగుతుంది. ఫాన్స్ విజిల్స్ కొట్టించే ఎలివేషన్ సీన్స్ అడుగడుగునా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో మురళీకృష్ణ - శరణ్యల మధ్య లవ్ స్టోరీ, పీఠాధీశుడిని చంపి శక్తి స్వరూపానంద స్వామిగా అవతరించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజల మేలుని కోరే వ్యక్తిగా మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ అదరగొట్టేసాడు. జై బాలయ్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాటలో బాలకృష్ణ - ప్రగ్యా జోడీ చూడముచ్చటగా కనిపిస్తుంది. ఒకే సాంగ్ లోనే బాలయ్య -ప్రగ్యాలకి పెళ్లి కావడం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండని పరిచయం చేసిన తీరు బాగుంది.సెకండ్ హాఫ్ కి ముందు అఖండ పాత్ర పరిచయం జరుగుతుంది. అఖండ పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా మరో ఎత్తు అనేలా ఉంది. బాలకృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించడం సినిమాకి ప్లస్సయ్యింది.బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ ఓ పోరాటంలా, ప్రతీ యాక్షన్ సీన్ ఓ క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించేలా ఉంటుంది. బాలకృష్ణని బోయపాటి లెజెండ్, సింహ కేరెక్టర్స్ కి మించి ఇందులో డోస్ మరింత పెంచారు. అఖండ లో కథ కంటే కూడా కేరెక్టర్స్ ని మలిచిన తీరే ఆకట్టుకుంటుంది. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని.. శివుడు మామూలు మనిషి కాదంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. మొత్తానికి మాస్ ప్రేక్షకులు బాలయ్య అఘోర కేరెక్టర్ బాగా కనెక్ట్ అవడమే కాదు.. సినిమా చూసి విజిల్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసే సినిమా అఖండ.
సాంకేతికవర్గం పనితీరు:
ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని ప్లస్ పాంట్స్. యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్లు ఎక్కువ కాబట్టి.. తమన్ కూడా కష్టపడ్డాడు. జై బాలయ్య, బంబం.. సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమాకి మరో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ, కెమెరా పనితీరు చాలా బాగుంది. టెక్నికల్ గా ఈ సినిమా హై స్టాండర్డ్ లో ఉంది. ఫైట్ మాస్టర్లకు ఎక్కువ పని పడింది. సగం సినిమా వాళ్లే తీసినట్టు లెక్క. ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ విలువలు మెయిన్ హైలైట్స్ లో ఒకటి అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
పంచ్ లైన్: అఖండ మాస్ జాతర
రేటింగ్: 2.5/5