సినీజోష్ రివ్యూ: అనుభవించు రాజా
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళి, నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియానా, తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్
ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
యాక్టీవ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరున్న రాజ్ తరుణ్ కి.. కెరీర్ లో రెండు మూడు హిట్స్ తప్ప.. గత కొన్నాళ్లుగా విజయం అనేదే లేకుండా పోయింది. కథలు ఎంచుకోవడంలో లోపమో.. మరేదో కానీ రాజ్ తరుణ్ కి సక్సెస్ దూరమై కొన్నేళ్లు గడిచిపోయాయి. వరస సినిమాల ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న రాజ్ తరుణ్ కి ఉయ్యాలా జంపాలతో హీరోని చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు మరోసారి రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా అంటూ కామెడీ ఎంటర్టైనర్ చేసారు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో నాగ్ మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా తెరకెక్కింది. అనుభవించు రాజా సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరిలో అంచనాలు పెరిగేలా చేసారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్ని సినిమాపై ఇంట్రెస్ట్ ని కలిగించడం, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుండి రావడం, ప్రమోషన్స్ పరంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవడంతో.. అనుభవించు రాజా పై అంచనాలు పెరిగాయి. మరి వరస ప్లాప్స్ లో ఉన్న రాజ్ తరుణ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మరోసారి ఆదుకుందా.. లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్ గా బంగారం అలియాస్ రాజు(రాజ్ తరుణ్)ఉద్యోగం చేస్తూ బ్రతుకుతాడు. సెక్యూరిటీ గార్డ్ గా అదే ఆఫీస్ లో పనిచేసే శ్రుతి (కశిష్‌ఖాన్)తో ప్రేమలో పడతాడు. శృతి రాజు నువ్వు సెక్యూరిటీ అవ్వకముందు ఏం చేసేవాడివి అని అడుగుతుంది. దానితో రాజు ఫ్లాష్ బ్యాగ్ చెబుతాడు. రాజు ఫ్లాష్ బ్యాగ్ లో అనుభవించడానికే పుట్టానన్నట్టుగా కోడిపందేలు, సరదాలతో తాతలు సంపాదించిన ఆస్తులని కరిగించేస్తాడు. ఆ ఊరికి ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలవాలన్న రాజు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ హడావిడిలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అసలు రాజు ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది ఎవరు? తనపై పడిన హత్య కేసు నుండి రాజు బయటికి ఎలా వచ్చాడు? ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? శ్రుతితో రాజు ప్రేమ ఏమైంది? అనేది అనుభవించు రాజా మిగతా కథ.
పెరఫార్మెన్స్:
రాజ్‌తరుణ్ బంగారంగా రాజు పాత్రలో జల్సారాయుడిలా అదరగొట్టేసాడు. ఓ సెక్యూరిటీ గార్డుగా పల్లెటూరులో సరదా యువకుడిగా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. లుక్స్ పరంగాను రాజ్ తరుణ్ బావున్నాడు. హీరోయిన్ కశిష్‌ఖాన్ అందంగా కనిపించింది. లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ, నడవడిక అంతా నీట్ గా కనిపించాయి అజయ్ పాత్ర,నటన ఆకట్టుకుంటుంది. సుదర్శన్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు అనుభవించు రాజా కథ ఏమిటి అన్నది.. అనుభవించు రాజా ట్రైలర్ లోనే రివీల్ చేసేసాడు. బాగా బతికి జల్సాలు చేసి.. ఉన్నదంతా పోగొట్టుకుని చివరికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కథలు బోలెడన్ని వచ్చాయి. నేచురల్ స్టార్ నాని పిల్లజమీందార్ కథ ఇంచుమించు రాజ్ తరుణ్ అనుభవించు రాజా కథ లానే ఉంటుంది. ఇక అనుభవించు రాజా దర్శకుడు ట్విస్టులు, టర్న్‌లూ అనుకుని కొన్ని రాసుకున్నాడు గానీ, అవి కూడా.. ముందే తెలిసిపోతాయి. రాజ్ తరుణ్ చిన్నప్పటి నుంచి కథ మొదలవుతుంది. తాతలు, తండ్రులు బాగా సంపాదించి.. వాళ్లు అనుభవించుకుండానే పోయారు కాబట్టి, రాజ భోగాలు అనుభవించడానికి రాజా పుట్టాడంటూ దర్శకుడు ఫ్లాష్ బ్యాగ్ స్టోరీ అల్లాడు. ఫస్ట్ హాఫ్ హైదరాబాద్, సెకండ్ విలేజ్ బ్యాగ్డ్రాప్ ఇది అనుభవించురాజా కథ. సెక్యూరిటీ గార్డ్‌గా రాజు ఉద్యోగంలో చేరడం, అక్కడ హీరోయిన్ పరిచయం కావడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం వంటి రొటీన్ స్టోరీ తో కామెడీ జెనరేట్ చేద్దామనుకున్నాడు దర్శకుడు. కానీ ఆ సన్నివేశాల్లో అంత బలం లేకపోవడంతో పెద్దగా ఫన్ జనరేట్ అవ్వలేదు. ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశాలు కథలో కీలక మలుపుకి కారణమవుతాయి. సెకండ్ హాఫ్ ఫ్లాష్‌బ్యాక్ ఏదో ట్విస్ట్ ఉంది అనేలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ పల్లెటూరికి వెళ్లాకైనా కామెడీ డోస్ పెరుగుతుందేమో అని ఆశిస్తే అక్కడ కూడా నిరాశే. బోలెడన్ని సినిమాల్లో చూసేసిన కోడి పందేలు, ఒకే రకమైన సందడి కనిపిస్తుంది తప్ప కొత్తదనం ఏం కనిపించదు. కాస్త ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది.. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నా.. అనుభవించురాజా మొత్తం రొటీన్ ఫార్ములాతోనే కనిపిస్తుంది ప్రేక్షకుడికి.
సాంకేతికంగా..
మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ ఇచ్చిన బ్యాగ్ రౌండ్ స్కోర్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమాకి హైలెట్ అనేలా సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ గా ఉంది. ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ కి వెళ్ళినప్పుడు ఆయన కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అంత లేవు.
రేటింగ్: 2.0/5