నటీనటులు: నాగశౌర్య, రీతూ వర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, తదితరులు
డైలాగ్స్: గణేష్ కుమార్ రావూరి
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ చంద్రశేఖర్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
వరస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాగ శౌర్య కి ఛలో లాంటి పెద్ద హిట్ మాత్రం తగలడం లేదు. అయినా కసిగా సినిమాలు చేస్తున్న నాగ శౌర్య కి లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య వరుడు కావలెను లాంటి ఫామిలీ కథ చెప్పడం అది నచ్చిన శౌర్య కి సితార ఎంటెర్టైనెంట్ లాంటి మంచి బ్యానర్ తోడవడంతో.. సినిమా పట్టాలెక్కింది. ఇక వరుడు కావలెను సినిమా రిలీజ్ ప్రమోషన్స్ తోనే సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు. వరుడు కావలెను ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచేసాయి. పూజ హెగ్డే లాంటి టాప్ హీరోయిన్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో వరుడు కావలెను సినిమాని ప్రమోట్ చెయ్యడం ప్లస్ అయ్యింది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వరుడు కావలెను ఎలా ఉందో.. సమీక్షలో చూసేద్దాం.
కథ:
హైదరాబాద్‌లో స్టార్టప్ కంపెనీ బాస్ గా ఉన్న భూమి (రీతూ వర్మ) చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే.. ఆమె ముందు నవ్వినా ఊరుకోదు, ఎవరి పనీ ఒక పట్టాన ఆమెకు నచ్చదు. భూమికి రాక్షసి అని హాష్ టాగ్ తగిలించి ఆమెను ఆఫీస్ లో అందరూ తిట్టుకుంటారు. భూమికి మంచి వరుడిని వెతికి పెళ్లి చేయాలని తల్లి (నదియా) సంబంధాలు చూస్తుంటుంది. భూమి మాత్రం పెళ్లి, ప్రేమలపై పెద్దగా నమ్మకం ఉండదు. అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ అవుతాయి కానీ ఒక్కటి కుదరదు. ఓ ప్రాజెక్ట్ పని మీద ఆకాష్ (నాగశౌర్య) హైదరాబాద్ వస్తాడు. ఆర్కిటెక్ట్ అయిన ఆకాష్, భూమి పనిచేస్తున్న కంపెనీ బిల్డింగ్ కోసం ప్లాన్ ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ పుడుతుంది. ఇక వాళ్ల ప్రేమకథ కంచికి చేరుతుందనగానే భూమి తల్లి చేసిన ఓ తింగరి ప్లాన్ వలన కథ మళ్లీ మొదటికి వస్తుంది.. భూమి మళ్లీ పెళ్లి పై విరక్తి పెంచుకుంటుంది. ఇంతకీ ఆకాష్ - భూమి మధ్యన ఎం జరిగింది? అసలు ఆకాష్ - భూమికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? చివరికి ఆకాష్ - భూమి ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే వరుడు కావలెను సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
పెరఫార్మెన్స్:
నాగశౌర్య ఆకాష్ కేరెక్టర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. అందంగానూ కనిపించాడు. రీతూ వర్మ ట్రెడిషనల్ గా భూమి పాత్రలో సైకో గా అందంగా కనిపించింది.అందంగా కనిపించింది. పెరఫార్మెన్స్ పరంగాను నాగ శౌర్య, రీతూ వర్మ పోటీపడి నటించారు. ఎమోషనల్ సీన్స్ లోను, రొమాంటిక్ సీన్స్ లోను, క్లైమాక్స్‌కి ముందు సన్నివేశాల్లో ఆ ఇద్దరి నటన అద్భుతంగా అనిపించింది. నాగ శౌర్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అదరగొట్టేసాడు. అలాగే సాంగ్స్ లోను రీతూ వర్మ - నాగ శౌర్య మధ్య కెమిస్ట్రీ అదిరింది. సప్తగిరి, వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ కామెడీగా ఆకట్టుకున్నారు. మురళీశర్మ, నదియా పేరెంట్స్ కేరెక్టర్స్ లో అలరించారు.
విశ్లేషణ:
ప్రస్తుత సమాజానికి దగ్గరగా ఉండే కథ వరుడు కావలెను. పెళ్లి వయసు దాటిపోతున్నా.. పెళ్లి పేరెత్తని పిల్లల పెళ్లి కోసం తల్లితండ్రులు ఎంతెలా నలిగిపోతున్నారో.. వాళ్లకి పెళ్లి చేసి భారం దించుకోవాలనే తపనతో ఉంటున్నారో అనేది ఈ సినిమా కథ. వరుడు కావలెను కొత్త కథ కాకపోయినా.. దర్శకురాలు లక్ష్మి సౌజన్య ఆ కథ కి రిచ్ సెటప్ ఇవ్వడం, పాత్రల ఎంపిక అన్ని బాగా కలిసొచ్చాయి. రొటీన్ కథనే కలర్ ఫుల్ ఫ్యామిలీ డ్రామాగా చూపించిండానికి ట్రై చేసింది. సినిమా స్టార్టింగ్ అంతా భూమి పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె ఆఫీస్ వాతావరణం, ఆమె స్ట్రిట్ గా ఉండడం.. అన్నీ నాగార్జున మన్మధుడు, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాలను గుర్తు చేస్తాయి. హీరో పాత్ర పరిచయం తర్వాత కూడా కథ అలా సాగుతుంది తప్ప స్పీడు గా అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ లోని ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని కలగజేస్తుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో నాగ శౌర్య లుక్స్, రీతూ వర్మ కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే ఫ్లాష్‌బ్యాక్ మైనస్ అనేలా ఉంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత సప్తగిరి చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మురళీశర్మ, నదియ మధ్య కూతురి పెళ్లి గురించి జరిగే చర్చ ఆకట్టుకునేలా ఉంది. భూమికి పెళ్లి చేద్దామని తల్లి పడే తాపత్రయం కొన్ని చోట్ల కామెడీ గాను ఇంకొన్ని చోట్ల అతి అనిపిస్తుంది. ఉన్న రెండు యాక్షన్ సీన్స్ కథలో ఇమడకపోయినా.. చూడ్డానికి స్టైలీష్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ముందు సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగినా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉండటం సినిమాకి కలిసొచ్చే విషయం. ఏదైనా వరుడు కావలెను సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే చిత్రం అనడంలో సందేహమే లేదు.
సాంకేతికంగా:
తమన్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలని హైలెట్ చేసేలా ఉంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్. ఎడిటింగ్ విషయంలో మరింత షార్ప్ గా ఉండాల్సింది. గణేశ్ రావూరి డైలాగ్స్ వింటుంటే.. త్రివిక్రమ్ డైలాగ్స్ గుర్తు చేసేలా అద్భుతంగా ఉన్నాయి. సితార ఎంటెర్టైన్మెంట్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5