బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నటీనటులు: గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్
మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
ఏప్రిల్ 2 నే థియేటర్స్ లోకి రావాల్సిన గోపీచంద్ - సంపత్ నందిల సీటిమార్ సెకండ్ వెవ్ వలన వాయిదా పడకపోయినా.. టెక్నీకల్ ఇష్యుస్ వలన వాయిదా పడింది. మధ్యలో సెకండ్ వెవ్ కూడా రావడంతో.. ఎట్టకేలకు నేడు వినాయక చవితి రోజున థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గోపీచంద్ - సంపత్ నంది కాంబోలో గౌతంనంద సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ లో సీటిమార్ తెరకెక్కింది. మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కింది స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ డ్రామాలు బాగా క్లిక్ అవుతున్న టైం లో సంపత్ నంది - గోపీచంద్ లు సీటిమార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి సీటిమార్ సీటీ కొట్టించిందో లేదో.. సమీక్షలో చూసేద్దాం.
కథ:
కార్తీక్ (గోపీచంద్) ఓ కబడ్డీ కోచ్. ఊరిలో టాలెంట్ ఉన్న అమ్మాయిలకి కబడ్డీ కోచింగ్ ఇస్తూ వాళ్ళని నేషనల్ లెవల్ లో ఆడించాలనేది కార్తీక్ కోరిక. స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. కడియంలో తన తండ్రి స్థాపించిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్ మూతపడే పరిస్థితి తలెత్తుతుంది. తాను తయారు చేసే కబడ్డీ జట్టు ద్వారా ఊళ్లోని స్కూల్ సమస్య వెలుగులోకి తీసుకురావాలని కార్తీక్ ప్లాన్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో కార్తీక్‌కి ఆ ఊరి నుండే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొంటూనే మేనేజ్‌మెంట్ ని మెప్పించి, తన టీమ్ ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. ఫైనల్స్‌కి రెండు రోజుల ముందు.. కార్తీక్ టీమ్ మొత్తాన్ని కిడ్నాప్ చేస్తాడు ఓ లోకల్ దాదా. అసలు కార్తీక్ కి ఊరిలో ఎదురైనా సమస్యలు ఏమిటి? కిడ్నప్ కి గురైన తన జట్టుని కార్తీక్ ఎలా కాపాడుకున్నాడు. అసలు తన జట్టుతో కార్తీక్ ఫైనల్ లో గెలిచాడా? లేదా? అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
పెరఫార్మెన్స్:
గోపీచంద్ కోచ్‌గా కార్తీక్ పాత్రలో చాలా యాక్టీవ్ గా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో గోపీచంద్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా చేసిన తమన్నా జ్వాలారెడ్డిగా తెలంగాణ యాస మాట్లాడుతూ నవ్వించింది. తమన్నా గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. జ్వాలారెడ్డి పాట సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. రావు రమేష్ ఊరి ప్రెసిడెంట్‌గా కనిపిస్తాడు. తరుణ్ అరోరా విలన్‌గా భయపెట్టేట్టుగా కనిపించినా ఆ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపించదు. దిగంగన సూర్యవంశీ, భూమిక మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు. .
విశ్లేషణ:
స్పోర్ట్స్ నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో కథలు రాజకీయాలు, గేమ్ లో ఉండే స్వార్ధం ఇవన్నీ కలగలిసినివిగా ఉంటాయి. నిన్నగాక మొన్నొచ్చిన విజయ్ బిగిల్, దంగల్ అన్ని ఆ కోవకి చెందినవే. అయితే సంపత్ నంది కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ హీరోగా సీటిమార్ అంటూ సినిమాని తెరకెక్కించాడు. అన్ని స్పోర్ట్స్ డ్రామాలలో ఉండే పాలిటిక్స్ ఇక్కడ సీటిమార్ లోనూ కనిపిస్తాయి. కానీ సంపత్ నంది స్పోర్ట్స్ డ్రామాకి కమర్షియల్ హంగులు జోడించడంతో.. ఈ సినిమా ని ప్రేక్షకుడు ఆద్యంతం ఎంజాయ్ చేసాడు. మధ్య మధ్యలో కొన్ని నాటకీయతలు తప్ప సినిమా ఓవరాల్ గా మాస్ ప్రేక్షకులకు బాగా ఎక్కేస్తుంది. ఇక సీటిమార్ కథలోకి వెళితే.. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా.. గోదావరి, విలేజ్ బ్యాగ్డ్రాప్ లో సాగుతుంది. ఊళ్లో అమ్మాయిల్ని ఆటలవైపు పంపించే విషయంలో తల్లిదండ్రుల్లో ఉండే అపోహలు, విలేజ్ పాలిటిక్స్ అన్ని ఫస్ట్ హాఫ్ కి కీలకం. అంతేకాదు.. అక్కడక్కడా కడుపుబ్బా నవ్వించే కామెడీ ప్లస్ అయ్యింది. కడియం బ్రదర్‌పాత్రలో రావు రమేష్ చేసే రాజకీయం ఆకట్టుకుంటుంది. రావు రమేష్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఢిల్లీ, కబడ్డీ, విలన్, మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ఇంటర్నేషనల్ పోటీలకి వెళ్లిన ఓ రాష్ట్ర జట్టు కిడ్నాప్‌కి గురయితే.. అది ఎవరికీ తెలియకుండా దాచేసి.. కోచ్ రంగంలోకి దిగి సాల్వ్ చెయ్యడం చూస్తే ఎక్కడో లాజిక్ మిస్ అయిన ఫీలింగ్. అలాగే విలన్ కి హీరో కి మధ్యన సాగే ఎపిసోడ్ కి కూడా ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవరు. ప్రీ క్లైమాక్స్ లో గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు, మరోపక్క ఫైనల్ కబడ్డీ ఆటతోనూ సాగడం మాస్ ప్రేక్షకులతో విజిల్స్ ఎపించేలా సీటిమార్ ఉంది. చాలా రోజులకి మాస్ ప్రేక్షకులు నచ్చే, మెచ్చే చిత్రం సీటిమార్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
సాంకేతికంగా..
మణిశర్మ పాటల్లో సీటీమార్, జ్వాలారెడ్డి సాంగ్స్ అదరగొట్టేశాయి. బాలా రెడ్డి పాట థియేటర్లో ఊపు తీసుకొస్తుంది మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంది. సౌందర్ రాజన్ కెమెరా పనితనం సినిమాకే హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
సీటిమార్ రేటింగ్: 2.75/5