Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: రంగ్ దే


బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్ 

Advertisement
CJ Advs

నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్

ఎడిటర్: నవీన్ నూలీ

సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్

నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ 

కథ, దర్శకత్వం: వెంకీ అట్లూరీ

గత ఏడాది భీష్మ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్.. లాక్ డౌన్ లో భీష్మ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ పెళ్లి పీటలెక్కాడు. ఆగష్టు లో పెళ్లి చేసుకున్న నితిన్ భీష్మ తర్వాత మరో లవ్ స్టోరీ రంగ్ దే తోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మధ్యలో నితిన్, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో చెస్ నేపథ్యంలో కూడిన చెక్ మూవీ చేసేయడం, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఎంత ఫాస్ట్ గా సినిమా తెరకెక్కి రిలీజ్ అయ్యిందో.. అంతే ఫాస్ట్ రిజల్ట్ నితిన్ చెక్ సినిమాకి వచ్చింది. చెక్ సినిమా నిరాశ పరిచినా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా రంగ్ దే అంటూ కలర్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. రంగ్ దే ట్రైలర్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండడం, సినిమా పోస్టర్స్ అండ్ ప్రమోషన్స్ అన్ని అద్భుతంగా ఉండడంతో రంగ్ దే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ లా హిట్స్ కొడుతున్న నితిన్ రంగ్ దే తో హిట్ కొట్టాడా? లేదా? అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

రంగ్ దే కథ ఎలా ఉండబోతుందో.. దర్శకుడు రంగ్ దే ట్రైలర్ లోనే రివీల్ చేసేసాడు..

అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్) చిన్నప్పటి పక్క పక్క ఇళ్లలోనే ఉంటూ.. కలిసి పెరుగుతారు. అనుకు అర్జున్ అంటే ప్రాణం. కానీ అర్జున్ కు అను అంటే ద్వేషం. అన్నిటిలో తనకన్నా గొప్పగా కనిపించే అను ఆంటే అర్జున్ పగతో రగిలిపోతుంటాడు. ఉప్పు - నిప్పులా ఉండే అను - అర్జున్ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారు. తర్వాత చదువు కోసం దుబాయ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి కానీ తగ్గవు. అసలు అను ని అంతగా ద్వేషించే అర్జున్ అనుకి ఎలా దగ్గరవుతాడు? అర్జున్ కి అను ఇచ్చే ట్విస్ట్ ఏమిటి?  చివరికి అను - అర్జున్ కలిసారా? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్:

రొమాంటిక్ గాను, కామెడీ గాను అర్జున్ పాత్రలో నితిన్‌ అదరగొట్టేసాడు. అర్జున్ పాత్ర‌లో అలవోకగా నటించి శెభాష్ అనిపించాడు నితిన్. త‌న‌కు కీర్తి సురేష్ మ‌రింత బలంగా నిలిచింది. నితిన్ - కీర్తి సురేష్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ముందు కీర్తి సురేష్ - నితిన్ మ‌రిన్ని సినిమాల్లో చూడాలి అనిపించేలా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సుహాస్, బ్రహ్మాజీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ చేస్తే.. వెన్నెల కిషోర్ కామెడీ సెకండ్ హాఫ్ లో ఆకట్టుకునేలా ఉంది. మిగిలిన న‌రేష్,  రోహిణి నితిన్ తల్లితండ్రులుగా మంచి పెరఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా వారు పరిధి బట్టి నటించి మెప్పించారు.

విశ్లేషణ:

రంగ్ దే స్టోరీ చూస్తే ఎక్కడో ఎప్పుడో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇలా పక్క పక్క ఇళ్లల్లో ఉండే హీరో - హీరోయిన్ పాత్రలు కొట్టుకోవడం అనేది రొటీన్ అయినా రంగ్ దే లో దర్శకుడు వెంకీ అట్లూరి కామెడీగా చూపించాడు. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాలో హీరో - హీరోయిన్ ఇలానే కొట్టుకుంటారు. హీరోయిన్, హీరో చేసే అల్లరి వేషాలను ఎప్పటికప్పుడు హీరో పేరెంట్స్ కి చెబుతూ తిట్టించడంతో హీరో గారికి హీరోయిన్ పై ద్వేషం, పగ ఏర్పడినట్లుగానే.. ఇక్కడ రంగ్ దే లో కూడా హీరోయిన్ అన్నిటిలో ఫస్ట్ రావడంతో హీరో గారి పేరెంట్స్ హీరోని ఎప్పుడూ తిడుతుండడంతో హీరోయిన్ మీద పగ పెంచేసుకుంటాడు మన హీరో గారు. కాకపోతే ఇందులో హీరో - హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా తగాదాలతో గడిపేస్తుంటారు. అదే ఇక్కడి రంగ్ దే లో ట్విస్ట్. స్టోరీ లైన్ సింపులే.. దానికి కామెడీ జోడించి కథని నడిపేసాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్క‌డా ఓవ‌ర్ డోస్ మెలోడ్రామాలు క‌నిపించ‌వు. అన‌వ‌స‌ర‌మైన హీరోయిజాల‌కూ చోటు ఇవ్వ‌లేదు. స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో… సినిమా న‌డిచిపోతుంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంది. సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం దుబాయ్ కి షిఫ్ట్ అవుతుంది.  హీరో - హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా గొడవలు కంటిన్యూ చేస్తూ.. విడిపోవాలనే నిశ్చయానికి వచ్చేసే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే ఉన్నాయి. అయితే ద‌ర్శ‌కుడు త‌న కోసం త‌న‌కు క‌న్వెనియ‌న్స్ గా ఉండేలా ఆయా స‌న్నివేశాల్ని అల్లుకున్నాడ‌నిపిస్తుంది. అప్పటివరకు అను పాత్రని ద్వేషించిన అర్జున్ క్లయిమాక్స్ సన్నివేశాల్లో మనసు మార్చుకోవడం.. తనకి దగ్గరవడానికి ప్రయత్నించడం అన్ని కాస్త రొటీన్ గానే అనిపించినా సెకండ్ హాఫ్ లో వెన్నెల కామెడీ టైమింగ్ తో నిలబెట్టేసాడు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా.. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రంగ్ దే కి రంగులద్దాడు వెంకీ అట్లూరి.

సాంకేతికంగా:

ఈ మధ్యన ఉప్పెన సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ రంగ్ దే కి అంత అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వకపోయినా.. పర్వాలేదనిపించే సంగీతాన్నిఇచ్చాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేంత మంచి పాట‌లైతే ఈ సినిమాలో లేవు. పిసీ శ్రీ‌రామ్ కెమెరా కొత్త పుంత‌ల్ని తొక్కింది. త‌న ఫ్రేములో ఈ రొటీన్ క‌థ అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. సాంగ్స్ లో ఆయన కెమెరా గొప్పదనం అడుగడుగునా కనిపిస్తుంది. ఇక సితార నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

పంచ్ లైన్: ఇంద్ర ధనుస్సు అంత గొప్పగా లేదు

రేటింగ్: 2.75/5

Rang De Movie Telugu review :

Nithin - Keerthy suresh Rang De Movie review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs