Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: అశ్వద్ధామ


సినీజోష్ రివ్యూ: అశ్వద్ధామ

Advertisement
CJ Advs

స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: రమణ తేజ

నిర్మాత: ఉషా మూల్పూరి

సమర్పణ: శంకర్ ప్రసాద్ మూల్పూరి

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

సినెమాట్రోగ్రఫీ: మనోజ్ రెడ్డి

ఎడిటింగ్: గ్యారీ బి ఎచ్

కథ: నాగశౌర్య  

నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, జిష్ణుసేన్ గుప్త, హరీష్ ఉత్తమన్, సత్య, తదితరులు ..

విడుదల: 31- 01-2020

సినీజోష్ రేటింగ్: >2.25/5 

మహాభారతంలో అశ్వద్ధామ అంటే మంచి ప్రాచుర్యం ఉంది. మరణమే లేని వ్యక్తి ద్రోణాచార్యుడి అత్యంత ప్రియమైన వాడు. మహిళలపై జరుగుతున్న దారుణం పై ప్రశ్నించిన వాడు అశ్వద్దామ. అదే తరహా పాయింట్‌ను తీసుకుని అశ్వద్ధామ టైటిల్‌తో యువ హీరో నాగ శౌర్య చేసిన ప్రయత్నం ఇది. ఛలో సినిమాతో సొంత బ్యానర్ మొదలెట్టిన శౌర్య భిన్నమైన సినిమాలు చేస్తూ, అటు ఇతర బ్యానర్స్‌లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా అటు రచయితగా కూడా అడుగులు వేస్తున్న శౌర్య రాసిన కథే అశ్వద్ధామ. రమణ తేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అశ్వద్ధామ ఎవరు? అతను ఈ భారతంలో ఏమి చేసాడు? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

హీరో(నాగశౌర్య)కు చిన్నప్పటి నుండి చెల్లెలంటే చాలా ప్రేమ, ఆమెకు ఎలాంటి ఆపద రాకూడదని చూసుకుంటాడు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక హీరో చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతుంది. అప్పుడే విదేశాల్లో చదువుకుంటున్న హీరో ఇంటికి వస్తాడు. అనుకున్న విధంగా నిశ్చితార్థం గ్రాండ్‌గా జరుగుతుంది. అయితే అదే రోజు రాత్రి .. తన చెల్లెలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. హీరో కాపాడతాడు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా చావు ఎందుకు? ఏం జరిగింది అని ప్రశ్నించిన హీరోకు షాకిచ్చేలా తాను గర్భవతిని అని చెల్లి చెప్పడం..  అసలు ఇది ఎలా జరిగిందో కూడా తనకు తెలియదని చెప్పడంతో హీరో షాక్ అవుతాడు. ఒక మహిళకు తెలియకుండా గర్భం రావడం ఏమిటి? అన్న దిశగా ఆరాలు తీయడం ప్రారంభిస్తాడు హీరో. వైజాగ్‌లో పలువురు అమ్మాయిలు మాయం అవ్వడం.. ఆ తరువాత హాస్పత్రిలో కనిపించడం, చాలా మంది ఇలాగే తెలియకుండా గర్భవతులు కావడం గురించి తెల్సుకున్న హీరో దాన్ని ఛేదించే పనిలో పడతాడు. ఈ కిడ్నాప్‌ల వెనకున్న వ్యక్తి ఎవరు? అసలు ఆ కిడ్నాప్‌లు చేసి అమ్మాయిల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అన్నది తెలుసుకోవడమే మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు నాగ శౌర్య. కథ దగ్గర నుంచి అన్ని దగ్గరుండి మరి చూసుకున్నాడని సినిమా చూస్తే తెలిసిపోతుంది. లవర్ బాయ్‌లా మంచి క్రేజ్ ఉన్న శౌర్య... ఎందుకీ భిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ.. తన క్రేజ్‌ని తగ్గించుకునేలా చేసుకుంటున్నాడు. ఛలో వంటి ఫన్ ఎంటర్‌టైన్మెంట్ సినిమాలయితే ఇతగాడికి మంచి ఊపును ఇస్తాయి తప్ప.. కణం, ఓ బేబీ లాంటి సినిమాలు మొహమాటానికి చేసి.. తన ఇమేజ్‌ని డామేజ్ చేసుకోవడం బాగాలేదు. ఈ సినిమాలో హీరో పాత్రలో ఆకట్టుకునేలా ఉన్నాడు. చెప్పిన పాయింట్ బాగుంది... కానీ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వ్యక్తి .. సైకో అని.. అతగాడు చేసే చేష్టలు అన్ని అప్పట్లో అంటే 90లోనే మనం చాలా సినిమాలు చూసేసాం. ఈ సైకో కహానీలు హాలీవుడ్‌లో అయితే కోకొల్లలు. ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్నా దారుణాలు గురించి చెప్పే ప్రయత్నం చేసారు, మంచిదే కానీ ఎక్కడ కొత్తదనం అన్నది కనిపించకపోవడం విచారకరం. శౌర్య మాస్ లుక్‌లో బాగానే ఉన్నాడు. నటుడిగా కొంతవరకు బాగా చేసాడు. అయితే ఇందులో అంత గొప్పగా నటించే అంశం లేదనుకోండి అది వేరే విషయం. ఇక హీరోయిన్ మెహరీన్ హీరోకి జోడి కావాలి కాబట్టి ఉంది .. ఆమెతో కేవలం ఒకే ఒక్క సాంగ్ ఉంది. అది కూడా వినిపించలేదనుకోండి. ఇక విలన్‌గా చేసిన జిష్ణు సేన్ గుప్తా.. ఏదో కొత్తగా చేసానని ట్రై చేసాడు, వైట్ కాలర్ క్రిమినల్‌గా బాగానే చేసాడు. కానీ ‘ధ్రువ’ సినిమాలో అరవింద్ స్వామిని గుర్తుకు తెచ్చాడు తప్ప ... ఎక్కడా కొత్తగా ట్రై చేయలేదు. ఇక మిగతా పాత్రల్లో ఎవరికీ వారు ఉన్నట్టుగా చేసారు. కమెడియన్ సత్యను సరిగ్గా ఉపయోగించుకోలేదు.  

టెక్నికల్ హైలెట్స్:

కథ విషయంలో పాయింట్ బాగున్నప్పటికీ దాని లింక్ అదే విలనిజం అన్నది ఎక్కడా కొత్తగా అనిపించలేదు. సరే కథ బాగున్నప్పటికీ టెక్నీకల్‌గా చూస్తే మ్యూజిక్ పెద్ద మైనస్ అని చెప్పాలి. సినిమాలో పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కథను రన్ చేస్తూ సాగే ఆర్ ఆర్ కూడా జస్ట్ ఓకే అని చెప్పాలి. ఇక అన్నింటిలో మెచ్చుకోదగ్గది అంటే ఒక్క ఫోటోగ్రఫి అదే బాగుంది. సీన్స్ పరంగా చూసుకుంటే మనోజ్ రెడ్డి మంచి ఎఫర్ట్ పెట్టాడు. ఇక దర్శకుడు రమణ తేజ స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ చాలాబోర్ సన్నివేశాలతో సాగుతుంది. కథలో ఉన్న ట్విస్ట్‌లను కొత్తగా చూపించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. హీరో నాగశౌర్య అందించిన కథలోని పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని గ్రిప్పింగ్‌గా కథను డ్రైవ్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇక సెకండాఫ్ కూడా అనవసర సన్నివేశాలతో బోర్ కొట్టించే ప్రయత్నం చేసాడు, పైగా ఎక్కడ ఇంత ఎంటర్‌టైన్మెంట్ అనేది లేకుండా కథ మొత్తం సీరియస్‌గా సాగడం కూడా కొంతవరకు మైనస్. ఈ సినిమా విషయంలో నాగశౌర్య ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తున్నప్పటికీ సినిమాలో విలన్ పాత్ర విషయంలో అప్ గ్రేడ్ అవ్వలేదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టుగా అనిపిస్తుంది తప్ప, ఎక్కడ కొత్తగా అనిపించదు.  

విశ్లేషణ:

హీరో నాగశౌర్య.. తనకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటికి రావాలన్న ప్రయత్నం కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యను ఇతివృత్తంగా చేసుకుని ఈ కథను రాసుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో కొత్తదనం చూపలేకపోయాడు శౌర్య. మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడడం బాగానే ఉంటుంది.. కానీ అది అందరికి వర్కవుట్ కాదన్న విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు బిన్నంగా కాస్త థ్రిల్లర్‌ని జోడించినా ఈ కథ పట్టు కోల్పోయింది. ఎక్కడా బిగువు లేకుండా కథ బోరింగ్‌గా సాగడం, ఎంటర్‌టైన్‌మెంట్ అసలే లేకపోవడం లాంటివి పెద్ద మైనస్. పైగా విలన్ పాత్రలో చేసిన నటుడు.. కొత్తగా ఏమి ప్రయత్నం చేయకపోగా.. తమిళ నటుడు అరవింద్ స్వామికి గుర్తుకు తెచ్చాడు. ఇక హీరోయిన్ పాత్ర అయితే అవసరమే లేదన్నట్టుగా సాగుతుంది. పోనీ హీరోయిన్ గ్లామర్‌ని ఏమైనా వాడుకున్నారా అంటే అదీ లేదు. ఓవరాల్‌గా ఫ్యామిలీ డ్రామా అంటూ కలరింగ్ ఇచ్చిన ఈ సినిమా అటు ఫ్యామిలీ డ్రామా కాకుండా ఇటు థ్రిల్లర్ కాకుండా మధ్యలో మిగిలిపోయింది. ఆకట్టుకోని కథనం, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే..లాంటి అంశాల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఇక దర్శకుడు కూడా కథను ప్రేక్షకుడికి ఆసక్తికలిగించేలా తెరకెక్కించడంలో తడబడ్డాడు.

Aswathama Movie review:

aswathama review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs