ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
సీత
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, మన్నారా చోప్రా, తనికెళ్ల భరణి, కె.భాగ్యరాజ్, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, మహేష్, పాయల్ రాజ్‌పుత్(స్పెషల్ సాంగ్)
సినిమాటోగ్రఫీ: శీర్షా రే
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: అనూప్ రూబెన్స్
మాటలు-పాటలు: లక్ష్మీభూపాల్
సమర్పణ: ఎటివి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన, దర్శకత్వం: తేజ
విడుదల తేదీ: 24.05.2019
పర స్త్రీని చెరపట్టిన వాడు అధోగతి పాలవ్వక తప్పదని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇదే అంశాన్ని తీసుకొని రకరకాల కథ, కథనాలతో సినిమా పుట్టినప్పటి నుంచి వివిధ పేర్లతో సినిమాలు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి కథతో తేజ రూపొందించిన చిత్రమే సీత. ఇప్పటివరకు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేస్తూ వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని ఈ సినిమాలో డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు తేజ. దర్శకుడుగా కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో చిత్రం, జయం, నువ్వు నేను వంటి లవ్ స్టోరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలే తీసి పరాజయాలు చవి చూశాడు. ఆ మూస సినిమాల నుంచి బయటికి వచ్చి ఆమధ్య రానాతో నేనే రాజు నేనే మంత్రి వంటి విభిన్నమైన పొలిటికల్ మూవీ తీసి తను కూడా డిఫరెంట్ సినిమాలు చేసి మెప్పించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తేజ చేసిన సినిమా ఇదే. పైన చెప్పుకున్నట్టు పాత కథనే తీసుకున్న తేజ దాన్ని కొత్తగా ఎలా చూపించాడు? బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని, కాజల్‌ని ఎలా ప్రజెంట్ చేశాడు? సీతకు ఈ సినిమాలో వచ్చిన కష్టాలు ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
ఆమె పేరు సీత(కాజల్ అగర్వాల్). సీత కన్‌స్ట్రక్షన్స్ ఓనర్. ఆమెకు డబ్బే ప్రధానం. డబ్బు కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాడదు. ఆమె తండ్రి వేల కోట్లకు అధిపతి. కొన్ని కారణాల వల్ల తండ్రి నుంచి దూరంగా వచ్చేసి సొంతంగా కన్‌స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగానే ఒక స్లమ్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటుంది. ఆ స్లమ్‌లో ఎంతోమంది పేదవారు కొన్ని సంవత్సరాలుగా నివాసముంటూ ఉంటారు. వారిని ఖాళీ చేయించే పనిని ఆ ఏరియా ఎమ్మెల్యే అయిన బసవరాజు(సోనూ సూద్)కి అప్పగిస్తుంది. ఆ పని చేసి పెట్టినందుకు బసవరాజు డబ్బు వద్దంటాడు. సీతనే ఆశిస్తాడు. తనతో నెలరోజులు సహజీవనం చెయ్యమంటాడు. దానికి ఓకే చెప్పి అగ్రిమెంట్‌పై సంతకం పెడుతుంది సీత. స్లమ్ ఏరియాను ఖాళీ చేయించిన బసవరాజు అగ్రిమెంట్ సీత ముందు పెడతాడు. తన పని అయిపోవడంతో ఆమె రివర్స్ అవుతుంది. బసవరాజు కోరికను కాదంటుంది, ఏం చేసుకుంటావో చేసుకొమ్మంటుంది. దాంతో బసవరాజు ఆమెను ఫైనాన్షియల్‌గా దెబ్బ తియ్యాలని ప్లాన్ చేస్తాడు. సీతకు 5 కోట్లు అప్పు ఇచ్చిన ఓ సేఠ్‌ని ఆమెపై ఉసిగొల్పుతాడు. తన డబ్బు అర్జెంట్‌గా కావాలని చెప్తాడు సేఠ్. సీత ఆ టెన్షన్‌లో ఉండగానే ఆమె తండ్రి చనిపోయాడనే వార్త తెలుస్తుంది. తండ్రి చనిపోయాడని బాధపడకపోగా అతని ఆస్తిని, డబ్బుని తన పేరున ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని కలగంటుంది. కానీ, అది కలగానే మిగిలిపోతుంది. ఆమె తండ్రి ఆస్తి మొత్తాన్ని భూటాన్‌లో ఉన్న రఘురామ్(బెల్లంకొండ సాయిశ్రీనివాస్) పేరు మీద రాసేస్తాడు. ఆస్తిని తన పేరుకి మార్చుకోవడానికి భూటాన్ బయల్దేరుతుంది సీత. ఈలోగా సీత ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ కేసు పెడతాడు సేఠ్. సీతకి అన్నీ కష్టాలే కాబట్టి... ఈ సీత కష్టాల్ని ఎలా ఎదుర్కొంది? భూటాన్ వెళ్లి ఏం చేసింది? సీత తండ్రి.. ఆస్తిని రఘురామ్ పేరు మీద ఎందుకు రాశాడు? అసలు రఘురామ్ భూటాన్‌లో ఎందుకున్నాడు? బసవరాజుతో చేసిన అగ్రిమెంట్ నుంచి సీత తప్పించుకోగలిగిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లలో సీత ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనే చెప్పాలి. కథ, కథనాలు ఎలా ఉన్నా సీత క్యారెక్టర్‌ని కాజల్ బాగా చేసింది. పవర్‌ఫుల్ లేడీగా తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. నెగెటివ్ క్యారెక్టర్స్ చెయ్యడం సోనూ సూద్‌కి కొత్త కాదు కాబట్టి బసవరాజు క్యారెక్టర్‌ని తనదైన స్టైల్‌లో చేసి మెప్పించాడు. అతను చెప్పిన డైలాగ్స్, తనికెళ్ళ భరణి కాంబినేషన్‌లో వచ్చే డైలాగ్స్ బాగున్నాయి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు చేసిన సినిమాలను బట్టి ఒకవిధంగా అతను చెయ్యకూడని క్యారెక్టర్ ఇది. స్వాతిముత్యం చిత్రంలో కమల్‌హాసన్‌లాంటి అమాయకుడి క్యారెక్టర్. అతనితో రకరకాల విన్యాసాలు చేయించాడు తేజ. అయితే పెర్‌ఫార్మెన్స్ పరంగా శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన ఆర్టిస్టులు కూడా ఓకే అనిపించారు. స్పెషల్ సాంగ్‌లో కనిపించిన పాయల్ రాజ్‌పుత్ వీలైనంత అందాల్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది.
సాంకేతికంగా చూస్తే శీర్షా రే ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించడంలో శీర్షా సక్సెస్ అయ్యారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగానే ఉన్నప్పటికీ సినిమాలో కొన్ని రిపీటెడ్‌గా అనిపించే సీన్స్‌ని తగ్గించి ఉంటే బాగుండేది. వాటి వల్ల సినిమా లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. అనూప్ రూబెన్స్ చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా చేశాడు. లక్ష్మీ భూపాల్ రాసిన మాటలు కొన్నిచోట్ల బాగున్నాయి. ముఖ్యంగా సోనూసూద్, తనికెళ్ళ భరణి మధ్య వచ్చే మాటలు మంచి కామెడీని పుట్టిస్తాయి. ఈ సినిమాలోని పాటలు కూడా లక్ష్మీభూపాలే రాయడం విశేషం. ఎ కె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్టర్ తేజ గురించి చెప్పాలంటే చాలా కాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి మంచి చిత్రాన్ని అందించిన తేజ మరోసారి ఆ తరహా సినిమా చేస్తాడని అందరూ ఆశించారు. అయితే దానికి భిన్నంగా ఈ సినిమాని తన పాత పద్ధతుల్లోనే చూపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్‌హాఫ్‌లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం, కథను నడిపించిన తీరు చూస్తే ఇది కూడా ఒక మంచి సినిమాలా నిలబడుతుందన్న అభిప్రాయానికి వస్తాం. సెకండాఫ్ సినిమా గ్రాఫ్‌ని బాగా పెంచుతుందనుకుంటాం. కానీ, అలా జరగలేదు. కథను ఒక దశకు తీసుకు వచ్చిన తర్వాత ఎటు తీసుకెళ్లాలో అర్థం కానట్టుగా అగమ్యగోచరంగా తయారు చేశాడు. హీరో క్యారెక్టర్‌ని ఇన్నోసెంట్‌గా డిజైన్ చెయ్యడంతో కొన్ని సీన్స్‌లో కిక్ మిస్ అయ్యింది. సీత క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్‌గానే ఉన్నప్పటికీ ఏదో ఒక దశలో ఆమె రియలైజ్ అయితే ఆడియన్స్‌కి కొంత రిలీఫ్ వచ్చేది. కానీ, చివరి ఐదు నిమిషాల వరకు ఆమె ధోరణిలో మార్పులేనట్టు చూపించడం ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. అలాగే విలన్ బసవరాజు సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సీతను బెడ్ మీదకు రమ్మనడం, ఎంతమందినైనా విసిరి అవతల పారేసే హీరో అప్పుడప్పుడు చిన్న పిల్లాడిలా మారాం చేయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. తేజ చేసిన పాత సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ ఆర్టిస్టుల అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అది ఈ సినిమాలో కూడా మరోసారి తొంగి చూసింది. ఫైనల్‌గా చెప్పాలంటే చాలా సాదా సీదా కథ, కథనాలతో తేజ రూపొందించిన సీత ఒక మామూలు సినిమాగా మిగిలిపోతుంది తప్ప ఈ సినిమా ద్వారా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదనేది వాస్తవం.
ఫినిషింగ్ టచ్: సీతను భరించడం అంత వీజీ కాదు