ఎన్.బి.కె. ఫిలింస్ ఎల్‌ఎల్‌పి, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
యన్.టి.ఆర్ కథానాయకుడు
తారాగణం: నందమూరి బాలకృష్ణ, సుమంత్, విద్యాబాలన్, రానా, ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, నరేశ్, క్రిష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి రాజా, భరత్‌రెడ్డి, రవిప్రకాశ్, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, షాలిని పాండే, నిత్యా మీనన్, శ్రీయా శరణ్, పూనమ్ బజ్వా, మంజిమ మోహన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్.
ఎడిటింగ్: అర్రం రామకృష్ణ
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
కథా సహకారం: డా. ఎల్.శ్రీధర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సమర్పణ: సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాతలు: నందమూరి వసుంధరాదేవి, నందమూరి బాలకృష్ణ
రచన, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల తేదీ: 09.01.2018
నందమూరి తారక రామారావు ఓ మహానటుడు, ఓ మహానాయకుడు. తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవం. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనుడు. అలాంటి మహానుభావుడి జీవిత కథతో సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూడని వారుండరు. యన్.టి.ఆర్ బయోపిక్‌కి శ్రీకారం చుట్టిన రోజునుంచే ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్ళతో సినిమా కోసం ఎదురుచూశారు. ఎన్.టి.రామారావులాంటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం అనేది సాహసంతో కూడుకున్న పని. దాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకెళ్ళాడు దర్శకుడు క్రిష్. తండ్రి జీవితంలోని వెలుగునీడల్ని ప్రేక్షకులకు, అభిమానులకు తెలియజెప్పేందుకు తనే నిర్మాతగా ఈ బయోపిక్‌ని నిర్మించేందుకు నడుం బిగించారు నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావుగా వెండితెరపై కనిపించిన బాలకృష్ణ ఈ సినిమాతో తండ్రికి నిజమైన నివాళిని అర్పించారు. సినిమాపరంగా, రాజకీయంగా ఎన్నో విశేషాలు ఉన్న యన్.టి.ఆర్ జీవితాన్ని రెండున్నర గంటల సినిమాలో చూపించడం సాధ్యమేనా? అందుకే సినిమా జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని కథానాయకుడుగా, మహానాయకుడుగా రెండు వేర్వేరు భాగాలుగా చిత్రీకరించారు దర్శకుడు క్రిష్. మొదటి భాగం కథానాయకుడు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యన్.టి.ఆర్ జీవితం గురించి మనకు తెలిసిన విషయాలను తెరపై ఎంత అందంగా ఆవిష్కరించారు? తెలియని విషయాలను ఎంత బాగా తెలియజెప్పారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
యన్.టి.రామారావు సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం వరకు ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు క్రిష్. నిజాయితీకి కట్టుబడి ఉండే రామారావు రిజిస్ట్రార్ ఆఫీస్‌లోని అవినీతిని చూసి తాను అక్కడ ఇమడలేనని గ్రహించి ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. అప్పటికే నాటకాల్లో ప్రవేశం ఉన్న రామారావును మద్రాస్ వచెయ్యమని నిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఇచ్చిన సలహాతో సినిమాల్లో హీరోగా పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో బయల్దేరతాడు. మొదటి అవకాశం ఎలా వచ్చింది, హీరోగా ఎలా మారాడు, స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనే విషయాల్ని చాలా క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేశాడు క్రిష్. మొదటి నుంచీ సామాజిక స్పృహ ఎక్కువ ఉన్న రామారావు పేదవారి కష్టాలను చూసి ఎలా చలించిపోయాడు, ప్రజల కోసం సినిమాలు వదిలి రాజకీయాల వైపు ఎందుకు అడుగులు వేశాడు అనేది ఎంతో సహజంగా తెరకెక్కించారు. యన్.టి.ఆర్ చేసిన సినిమాల గురించి, ఆయన చేసిన క్యారెక్టర్ల గురించి తెలియని తెలుగు వారుండరు. కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
నటీనటుల గురించి చెప్పుకోవాల్సి వస్తే యన్.టి.రామరావుగా నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. సినిమా ప్రారంభంలో యన్.టి.ఆర్‌గా బాలకృష్ణని ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించినా కాసేపటికి బాలకృష్ణలోనే యన్.టి.ఆర్.ని చూసే ప్రయత్నం చేస్తాం. బాధ్యత కలిగిన పౌరుడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా యన్.టి.ఆర్ పాత్రలోని వేరియేషన్స్‌ని పండించడంలో బాలకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. యన్.టి.ఆర్ చేసిన వివిధ పాత్రల్లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఎంతో సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె కనిపించిన ప్రతి సీన్‌లోనూ తనదైన అభినయాన్ని ప్రదర్శించింది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ ఆద్యంతం మెప్పించాడు. ఇంకా సినిమాలో చెప్పుకోవడానికి చాలా పాత్రలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ ప్రముఖ నటీనటులు కనిపిస్తారు. వారంతా కనిపించింది కాసేపే అయినా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాల్సి వస్తే... జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ సినిమాకి పెద్ద హైలైట్. ప్రతి సీన్‌ని ఎంతో అందంగా చూపించాడు. సీన్ మూడ్‌కి తగ్గట్టుగా పర్‌ఫెక్ట్ లైటింగ్‌తో ప్రతి సీన్‌ని ఎలివేట్ చేశాడు. కీరవాణి చేసిన టైటిల్ సాంగ్ బాగుంది. ప్రారంభం నుంచి చివరి వరకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకి ఒక గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు కీరవాణి. అర్రం రామకృష్ణ చేసిన ఎడిటింగ్ వల్ల కొన్ని సీన్స్ ఇబ్బంది కరంగా మారాయి. అర్థాంతరంగా ముగిసే కొన్ని సీన్స్ ఎడిటింగ్‌లోని లోపాని ఎత్తి చూపాయి. సాయిమాధవ్ బుర్రా రాసిన మాటలు సినిమాకి బలాన్ని చేకూర్చాయి. సినిమాల్లో నిలబడడం ఏమిటయ్యా.. సినిమా రంగాన్నే నిలబెడతాడు, బాధకు పుట్టిన మనుషులం. బాధ లేకుండా బతకలేం. మీవి సినిమా తుపాకులు కాకపోవొచ్చు. కానీ ఇది సినిమా గుండె. మీ షూటింగ్‌కి భయపడదు, మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారే ఇవ్వాలి.. మనం పోయాక తాను గెలిచానని చెప్పుకోవాలి, మన గుండెలు ఆగిపోయినా.. మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి. ఆయన ఏనైనా చెప్పే చేస్తారు. కానీ.. ఏ పనీ అడిగి చేయరు వంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. తండ్రి బయోపిక్ కోసం సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి మొదటిసారి నిర్మాతగా మారారు బాలకృష్ణ. వీరి ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకుడు క్రిష్ గురించి చెప్పాలంటే.. ఒక అనితర సాధ్యమైన బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యన్.టి.ఆర్ జీవితంలోని ఆసక్తికర విషయాలను, సగటు ప్రేక్షకుడికి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెరపై ఆవిష్కరించడంలో ఆయన కృతకృత్యులయ్యారు. కొన్ని సీన్స్‌ను ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తీశారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సన్నివేశం, మొదటిసారి కృష్ణుడిగా కనిపించే సీన్, రావణాసురుడి క్యారెక్టర్ కోసం 20 గంటలు కదలకుండా నిలబడే సన్నివేశం, పెద్ద కొడుకు చనిపోయినపుడు చేసిన సీన్, రాజకీయాల్లో రావడానికి కారణమైన ఓ వృద్ధురాలి సీన్.. ఇలా సినిమాలో చాలా సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా చేయడంలో క్రిష్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో కూడా తన ప్రతిభను చూపించాడు. ప్రతి నందమూరి అభిమాని గర్వించేలా యన్.టి.ఆర్ బయోపిక్‌ని తెరకెక్కించి దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు క్రిష్. ఫైనల్‌గా చెప్పాలంటే.. నందమూరి తారక రామారావు గురించి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారికి, సినిమాల ద్వారా తెలిసిన వారికి అందరికీ ఓ కొత్త సినిమా చూస్తున్న అనుభూతిని కలిస్తాడు ఈ కథానాయకుడు.
ఫినిషింగ్ టచ్: యన్.టి.ఆర్‌కి నిజమైన నివాళి