Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: బ్లఫ్ మాస్టర్


అభిషేక్ ఫిలింస్, శ్రీదేవి మూవీస్

Advertisement
CJ Advs

బ్లఫ్ మాస్టర్

తారాగణం: సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, సిజ్జు, పృథ్వీ, చైతన్యకృష్ణ తదితరులు

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిటింగ్: నవీన్ నూలి

కథ: హెచ్.డి.వినోద్

సంగీతం: సునీల్ కశ్యప్

అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ

సమర్పణ: శివలెంక కృష్ణప్రసాద్

నిర్మాత: రమేష్ పి. పిళ్లై

మాటలు, దర్శకత్వం: గోపీగణేష్ పట్టాభి

విడుదల తేదీ: 28.12.2018

మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్.. ఇది మనిషి జీవితానికే కాదు, సినిమా కథలకూ వర్తిస్తుంది. ఎందుకంటే డబ్బు ప్రధానంగా తయారు చేసిన సబ్జెక్ట్స్‌కి సక్సెస్ రేటు ఎక్కువే. అలాంటి సినిమాల్లో కావాల్సినంత థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ శుక్రవారం విడుదలైన బ్లఫ్ మాస్టర్ కూడా ఆ తరహా సినిమాయే. తమిళ్‌లో హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన చతురంగ వేట్టై చిత్రానికి రీమేక్ ఇది. అక్కడ ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సత్యదేవ్ హీరోగా, నందితా శ్వేత హీరోయిన్‌గా గోపీగణేష్ పట్టాభి రూపొందించిన తెలుగు రీమేక్ ఎంతవరకు ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది? ప్రేక్షకులను ఏమేర థ్రిల్ చేసింది? బ్లఫ్ మాస్టర్‌గా హీరో ఎవర్ని ఎలా బురిడీ కొట్టించాడు? అనేది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

అతని పేరు ఉత్తమ్‌కుమార్(సత్యదేవ్) అలియాస్ సాగర్ అలియాస్... ఇలా ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అవుతూ తన స్నేహితులతో కలిసి జనాన్ని తన మాయ మాటలతో మోసగిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. తన పని అయిపోగానే ఆ ఊరి నుంచి డబ్బుతో ఉడాయిస్తాడు. ఎల్లకాలం మోసగాడి ఆటలు సాగవు కాబట్టి పోలీసులకు పట్టుబడతాడు. అతన్ని కోర్టులో హాజరు పరుస్తారు. తన డబ్బు బలంతో నిర్దోషిగా బయటికి వస్తాడు. కానీ, ఒక గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. అప్పటివరకు సంపాదించిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. తన స్నేహితులతో చెప్పి ఎక్కడెక్కడ డబ్బు ఉందో అంతా తీసుకొని ఆ గ్యాంగ్ ఉన్నచోటుకి రమ్మంటాడు ఉత్తమ్.  కానీ, అతని స్నేహితులు మోసం చేసి డబ్బుతో పారిపోతారు. అయితే 100 కోట్ల డీల్ ఉందని, అది చెయ్యాలంటే కొంత డబ్బు కావాలని ఆ గ్యాంగ్‌కి చెప్తాడు ఉత్తమ్. ఆ డబ్బు సంపాదించడానికి ఒక ప్లాన్ ఉందని చెప్పి ఆ గ్యాంగ్‌ని పోలీసులకు పట్టిస్తాడు. డబ్బు మొత్తం పోగొట్టుకున్న ఉత్తమ్ రోడ్డున పడతాడు. ఆ టైమ్‌లో అతని దగ్గర గతంలో పనిచేసిన అవని(నందితా శ్వేత) ఆసరా ఇస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకొని కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో సెటిల్ అవుతారు. మోసాలు మానేసి కష్టపడి పనిచేసుకుంటూ ఉంటాడు ఉత్తమ్. కొన్నాళ్ళకు అవని తల్లి కాబోతోందని తెలుస్తుంది. ఆ టైమ్‌లో జైలు నుంచి విడుదలైన గ్యాంగ్ ఉత్తమ్‌ని ఎటాక్ చేస్తారు. 100 కోట్ల డీల్ పూర్తి చేసి డబ్బులివ్వాలని, లేకపోతే అతని భార్యను చంపేస్తామని బెదిరిస్తారు. తన భార్యను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకునేందుకు 100 కోట్లను కొల్లగొట్టేందుకు బయల్దేరతాడు ఉత్తమ్. ఆ డీల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడా? తన భార్యను రక్షించుకోగలిగాడా? అనేది మిగతా కథ. 

తన తెలివి తేటలతో అత్యాశపరులను మోసం చేస్తూ డబ్బు సంపాదించే బ్లఫ్‌మాస్టర్ పాత్రకు సత్యదేవ్ పూర్తి న్యాయం చేశాడు. లవ్ సీన్స్‌లో, సెంటిమెంట్ సీన్స్‌లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. మంచితనానికి మారు పేరుగా ఉండే అవని పాత్రలో నందితా శ్వేత బాగా రాణించింది. ధనశెట్టిగా కనిపించిన ప్రతిసారీ నవ్వించే ప్రయత్నం చేశాడు పృథ్వీ. హీరో స్నేహితుడిగా చైతన్యకృష్ణ ఫర్వాలేదనిపించాడు. విలన్‌గా ఆదిత్య మీనన్ కొత్త గెటప్‌తో ఆకట్టుకున్నాడు. పోలీసాఫీసర్‌గా సిజ్జు, హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టర్ బ్రహ్మాజీ తదితరులు తమ తమ పాత్రలను న్యాయం చేశారు. 

సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాలో హైలైట్స్‌గా చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. టెక్నికల్‌గా ప్రతి అంశం సాదాసీదాగానే అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు ఉన్న దాశరథి శివేంద్ర అతి మామూలు ఫోటోగ్రఫీని అందించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ దశలోనూ సినిమాటోగ్రఫీలోని రిచ్‌నెస్ కనిపించదు. దానికి తగ్గట్టుగానే ఎడిటింగ్ కూడా ఉంది. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ గురించి చెప్పాలంటే ఇందులో పాటలకు ఎక్కువగా ఆస్కారం లేకపోయినా రెండు పాటలు ఫర్వాలేదు అనిపించాడు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా రావడం కోసం అక్కడక్కడా కష్టపడినట్టు తెలుస్తుంది. పులగం చిన్నారాయణ, గోపిగణేశ్ రాసిన మాటలు కొన్ని చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ఏమాత్రం బాగాలేదు. ఇక కథ, కథనాల విషయానికి వస్తే తమిళ్‌లో ప్రూవ్ అయిన ఈ సినిమా కథను రాసుకున్న హెచ్.డి.వినోద్ అంతే అందంగా తెరకెక్కించాడు. కథనం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమిళ్‌లో సంచలన విజయం సాధించింది. కథ అదే అయినా కథనంలో నాణ్యత లోపించడం వల్ల ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ అవ్వదు. హీరో చెప్పిన ఫ్లాష్‌బ్యాక్‌గానీ, లవ్ సీన్స్‌గానీ, సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌గానీ ప్రేక్షకులకు రుచించవు. మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ  సినిమాలో ఎలాంటి ట్విస్టులు, సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్, థ్రిల్ చేసే సన్నివేశాలు లేవు. దీంతో ఒక సాదా సీదా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ఇంటరెస్టింగ్ గా  అనిపించినా సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉండడం వల్ల బోరింగ్ అనిపిస్తుంది.  ఫైనల్‌గా చెప్పాలంటే తమిళ్‌లో ప్రూవ్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమేర ఆదరిస్తారనేది సందేహమే.

ఫినిషింగ్ టచ్: ఆడియన్స్‌ని బ్లఫ్ చేసిన మాస్టర్

telugu movie bluff master review :

telugu movie bluff master
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs