మైత్రి మూవీ మేకర్స్
అమర్ అక్బర్ ఆంటోని
తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, షాయాజీ షిండే, రఘుబాబు,
జె.పి., శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్, సత్య, ఆదిత్య మీనన్, విక్రమ్‌జిత్ విర్క్,
తరుణ్ అరోరా, రాజ్‌వీర్‌సింగ్, అభిమన్యు సింగ్, లయ, అభిరామి, గిరిధర్,
రవిప్రకాశ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి. దిలీప్
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
సంగీతం: థమన్ ఎస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్
రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: 16.11.2018
యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు, ఆడియన్స్‌ని నవ్వించడం కోసం సెపరేట్ ట్రాక్... ఇలా నడిచిపోతున్న తెలుగు సినిమాని యాక్షన్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన ఘనత ఖచ్ఛితంగా శ్రీను వైట్లకు చెందుతుంది. అంతకుముందు కూడా ఇలాంటి సినిమాలు వచ్చినా శ్రీను వైట్ల తీసిన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఎలివేట్ అయ్యేది. ఢీ చిత్రంతో ఈ ఒరవడి మొదలైంది. ఆ తర్వాత ఇతర దర్శకులు కూడా ఇలాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ తరహా సినిమాలను కూడా తిప్పి కొట్టడం మొదలెట్టారు. కానీ, కొంతమంది దర్శకులు అదే ట్రెండ్‌ని ఫాలో అవుతూ సినిమాలు చేయడం, అపజయాల పాలవడం మనం చూస్తున్నాం. ఇలాంటి సినిమాలకు ఆద్యుడైన శ్రీను వైట్ల కూడా అదే పంథాలో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. అలా చాలా గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల తాజాగా రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రవితేజతో వెంకీ, దుబాయ్ శీను వంటి యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను తీసిన శ్రీను ఈ కాంబినేషన్‌లో మరో హిట్ కొట్టబోతున్నానన్న కాన్ఫిడెన్స్‌తో వచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో శ్రీను వైట్ల తన పంథా మార్చుకున్నాడా? రవితేజతో మరో సూపర్‌హిట్ సాధించగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో పెరిగి పెద్దయిన తర్వాత పగ తీర్చుకోవడం అనేది మన తాతల కాలం నుంచి చూస్తున్నాం. అదే కథని ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా ప్రజెంట్ చేసేవారు. ఎంత కొత్తగా ప్రజెంట్ చేసినా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విషయానికి ఇద్దరు స్నేహితులు అమెరికాలో వ్యాపారపరంగా స్థిరపడతారు. ఒకరి కొడుకు అమర్, ఒకరి కూతురు ఐశ్వర్య. స్నేహితుల్లాగే ఆ పిల్లలు కూడా ఎప్పుడూ స్నేహంగా ఉంటారు. వారిద్దరికీ పెద్దయిన తర్వాత పెళ్ళి చెయ్యాలన్నది ఆ రెండు కుటుంబాల ఆలోచన. ఇదిలా ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి నడుపుతున్న కంపెనీని డెవలప్ చేసిన నలుగురు ఎంప్లాయీస్‌కి షేర్స్ ఇస్తూ తమ పార్టనర్స్‌గా చేసుకుంటారు. బ్యాడ్ బాయ్స్ అయిన ఆ నలుగురు ఆ రెండు కుటుంబాలను ఒక బాంబ్ బ్లాస్ట్‌తో అంతం చేయాలనుకుంటారు. కానీ, అమర్, ఐశర్య తప్పించుకుంటారు. ఆ తర్వాత అనుకోకుండా విడిపోతారు. ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. చిన్నతనంలోనే ఓ నేరం కింద జైలులో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించి వస్తాడు అమర్(రవితేజ). ఐశ్వర్య తన ఐడెంటిటీ వల్ల ప్రమాదముందని గమనించి తన పేరును పూజ(ఇలియానా)గా మార్చుకుంటుంది. జైలు నుంచి వచ్చిన అమర్ లక్ష్యం తమ కుటుంబాలను నాశనం చేసిన ఆ నలుగుర్నీ చంపడం. పూజ లక్ష్యం తన చిన్ననాటి నేస్తం అమర్‌ని కలుసుకోవడం. జైలు నుంచి విడుదలైన అమర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒకసారి అమర్‌గా, మరోసారి అక్బర్‌గా, ఇంకోసారి ఆంటోనిగా పరిస్థితులను బట్టి మారుతుంటాడు. ఆ సయమంలో ఆయా క్యారెక్టర్స్‌లోకి వెళ్ళిపోయి ప్రవర్తిస్తుంటాడు. దీన్ని డిస్‌అసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్‌గా చెబుతారు. పూజ కూడా కొన్ని మాటలు విన్నప్పుడు విచిత్రంగా ప్రవర్తించడం, ఆ మాటలు అన్నవారిని చితక్కొట్టడం చేస్తుంటుంది. ఈ స్థితిలో ఉన్న హీరో, హీరోయిన్ చివరికి కలుసుకున్నారా? తమ కుటుంబాన్ని నాశనం చేసిన నలుగురు విలన్లపై హీరో పగ తీర్చుకున్నాడా? అనేది మిగతా కథ.
ఈమధ్యకాలంలో మన హీరోలు రోగగ్రస్తులైపోతున్నారు. ఏదో ఒక డిజార్డర్ లేకుండా పెద్ద హీరోలకు కథలు దొరకడం లేదు. అలా వచ్చిన కొన్ని సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నాయి. మరికొన్ని డిజాస్టర్ అవుతున్నాయి. గతంలో కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన అతనొక్కడేలోని రివెంజ్ సోరీ, విక్రమ్ సినిమా అపరిచితుడులోని డిజార్డర్‌ని మిక్స్ చేసి, బ్యాక్‌డ్రాప్ మార్చి ఒక కొత్త కథని వండే ప్రయత్నం చేశాడు శ్రీను వైట్ల. కథకు సంబంధం లేకుండా ఒక కామెడీ ట్రాక్‌ని నవ్వించడం కోసం పెట్టుకున్నాడు. అతను ఎంచుకున్న కథ కొత్తది కాదు, క్రియేట్ చేసిన కామెడీ ట్రాక్ కొత్తది కాదు. ఈ రెండింటితో రెండున్నర గంటలకుపైగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు శ్రీను వైట్ల. కొత్త దర్శకులు కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తూ విజయాలు సాధిస్తుంటే శ్రీను వంటి డైరెక్టర్లు పాత చింతకాయ పచ్చడిలాంటి కథలతోనే ఇంకా కుస్తీ పడుతున్నారు. ప్రేక్షకుల విలువైన సమయంతో ఆడుకుంటున్నారు. ఈ సినిమా కథలో, కథనంలో ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఓ పక్క కథ నడుస్తూ ఉంటే మరో పక్క ప్యారలల్‌గా వాటా(హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్) పేరుతో ఓ కామెడీ ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది. అందులో కొంతమంది కమెడియన్స్ తమ శక్తిమేర నవ్వించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు వేసే పంచ్‌లకు, పేల్చే జోకులకు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడక్కడా నువ్వుకున్నారు ఆడియన్స్. జోకులకే కాదు, సిల్లీగా అనిపించే కొన్ని సీరియస్ సీన్లను చూసి కూడా అంతే నవ్వుకున్నారు. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఏ ఒక్క ఆర్టిస్టు కూడా ఇది బాగా చేశారు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు ఇప్పటికే మనం చాలా చూసేశాం. కాబట్టి మనకి ఏదీ కొత్తగా అనిపించదు. కాకపోతే కమెడియన్ నుంచి హీరోగా వెళ్ళి మళ్ళీ కమెడియన్‌గా వచ్చిన సునీల్ మాత్రం తన పెర్‌ఫార్మెన్స్‌తో అక్కడక్కడా నవ్వించాడు. మూడు షేడ్స్ వున్న క్యారెక్టర్‌ని రవితేజ ఎప్పటిలాగే చేశాడు.
టెక్నికల్ టీమ్‌లో మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి. దిలీప్ గురించి. సినిమా మొత్తంలో మనకు బాగుంది అనిపించేది ఫోటోగ్రఫీ మాత్రమే. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించడంలో వెంకట్ సక్సెస్ అయ్యాడు. థమన్ చేసిన పాటల్లో డాన్ బాస్కో పాట ఒక్కటే హుషారుగా, వినదగ్గదిగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కూడా థమన్ మెరుపులు ఏమీ కనిపించలేదు. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్‌కి మరికాస్త పనిపెట్టి ఉంటే బాగుండేది. రెండున్నర గంటల సినిమా ఓ 15 నిమిషాలు తగ్గించి ఉంటే పావుగంట ముందు ఆడియన్స్ బయటికి వచ్చేవారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి చెప్పాలంటే తన పంథా మార్చుకోకుండా ఇలాంటి సినిమాలు ఎన్ని చేసినా ఆడియన్స్ తిప్పి కొడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కథలోగానీ, కథనంలోగానీ కొత్తదనం లేకపోవడం, క్యారెక్టరైజేషన్లు కూడా బలహీనంగా ఉండడం, కథకు సంబంధం లేకపోయినా సెపరేట్ కామెడీ ట్రాక్‌తో ఆడియన్స్‌ని చక్కిలిగింతలు పెట్టి నవ్వించాలన్న ధోరణి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చెయ్యాల్సినంత స్టఫ్ కథలో ఏముంది? అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఫైనల్‌గా చెప్పాలంటే రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో కొన్ని సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం వారిద్దరికీ నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఈ కాంబినేషన్‌ని చూసి బాగా ఎంటర్‌టైన్ అవుతామని థియేటర్స్‌కి వెళ్ళిన ప్రేక్షకుల్ని కూడా అమర్ అక్బర్ ఆంటోని డిజప్పాయింట్ చేసింది.
ఫినిషింగ్ టచ్: హిట్ టైటిల్‌తో ఫ్లాప్ సినిమా