Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: పందెంకోడి 2


విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌, లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి 

Advertisement
CJ Advs

పందెంకోడి 2 

తారాగణం: విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌ 

ఎడిటింగ్‌: కె.ఎల్‌.ప్రవీణ్‌ 

సంగీతం: యువన్‌ శంకర్‌రాజా 

సమర్పణ: బి.మధు 

నిర్మాతలు: విశాల్‌, ధవల్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా 

రచన, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి 

విడుదల తేదీ: 18.10.2018 

13 ఏళ్ళ క్రితం విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన పందెంకోడి సూపర్‌హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌ని టర్న్‌ చేసింది. ఆ సినిమా మాస్‌ యాక్షన్‌ హీరోగా విశాల్‌కి కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. తెలుగులో కూడా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత విశాల్‌ చేసినవన్నీ మాస్‌ ఓరియంటెడ్‌ మూవీసే. ఒక్కో సినిమా ఒక్కో బ్యాక్‌డ్రాప్‌లో చేసినప్పటికీ అతని లుక్‌లో ఏమాత్రం మార్పు ఉండదు. దాదాపు అన్ని సినిమాల్లోనూ విశాల్‌ ఒకేలా కనిపిస్తాడు. అయితే కథలో బలం, దర్శకుడు ఆ కథను తెరకెక్కించిన తీరు, తన పెర్‌ఫార్మెన్స్‌... ఈ అంశాలు విశాల్‌ సినిమాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఈమధ్య వచ్చిన డిటెక్టివ్‌, అభిమన్యుడు చిత్రాలు కూడా ఈ విషయాన్ని ప్రూవ్‌ చేశాయి. పదమూడేళ్ళ క్రితం చేసిన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌గా ఫ్యాక్షన్‌ తరహా కథాంశంతో పందెంకోడి 2 చిత్రాన్ని రూపొందించాడు లింగుస్వామి. ఫ్యాక్షన్‌ కథలకు, ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ కథాంశాలకు దాదాపుగా కాలం చెల్లిపోయిన రోజులివి. ఓ కొత్త తరహా సబ్జెక్ట్‌తో చేయకుండా ఫ్యాక్షన్‌ కథనే ఎంచుకోవడంలో లింగుస్వామి కాలిక్యులేషన్‌ ఏమిటి? రెండు సూపర్‌హిట్‌ సినిమాల తర్వాత వచ్చిన పందెంకోడి2 చిత్రంలో ఉన్న కొత్తదనం ఏమిటి? విశాల్‌ కెరీర్‌ని టర్న్‌ చేసిన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన పందెంకోడి 2 అతని కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మొదటి భాగంలాగే రెండో భాగం కూడా తొలిరోజే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుందా? అనేది సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. 

అతని పేరు రాజారెడ్డి(రాజ్‌కిరణ్‌). ఆ ఊళ్ళో పెద్దమనిషిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆ ఊరే కాదు చుట్టుపక్కల ఊళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉంది. ప్రతి ఏటా ఆ ఊరిలో వీరభద్రుడి జాతర జరుగుతుంది. ఆ జాతరలో భోజనాల దగ్గర చిన్న విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలవుతుంది. ఒక కుటుంబానికి చెందిన భవాని(వరలక్ష్మీ శరత్‌కుమార్‌) భర్తను చంపేస్తారు రాజారెడ్డి మనుషులు. దీంతో పగ పెంచుకున్న భవాని ఆ గొడవలో ఉన్నవారందర్నీ చంపిస్తుంది. చివరకు గోపి అనే వ్యక్తి ఒక్కడే మిగులుతాడు. అతనికి రాజారెడ్డి అండగా నిలబడతాడు. ఇది జరిగి ఏడు సంవత్సరాలవుతుంది. ఈ ఏడు సంవత్సరాలు ఆ ఊళ్లో వీరభద్రుడి జాతర జరగదు. ఆ ఏడాది రెండు ఊళ్ళవారు గొడవలన్నీ మర్చిపోయి జాతర జరుపుకోవాలని నిర్ణయించుకుంటారు. ఎలాంటి గొడవలు జరగకుండా రెండు వర్గాలవారు ఉండాలని పాలంటి ప్రమాణం చేస్తారు. ఇదిలా ఉంటే రాజారెడ్డి కొడుకు బాలు(విశాల్‌) ఏడు సంవత్సరాల తర్వాత విదేశాల నుంచి జాతర కోసం ఇండియా వస్తాడు. హింస వద్దని ప్రమాణం చేసినప్పటికీ భవాని, ఆమె అనుచరులు గోపీని చంపేందుకు పథకాలు వేస్తుంటారు. గోపీకి బాలు కూడా అండగా ఉండి అనుక్షణం అతన్ని కాపాడుతుంటాడు. ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? జాతర సజావుగా జరగడానికి బాలు ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు? గోపీని చంపేందుకు భవానీ చేసిన ప్రయత్నాల్ని బాలు ఎలా అడ్డుకున్నాడు? చివరికి ఆ ఊరిలో హింస రాజ్యమేలిందా? అహింస గెలిచిందా? అనేది మిగతా కథ. 

ఎమోషనల్‌గా ఉంటూ శత్రువుల గుండెల్లో అలజడి పుట్టించే పక్కా మాస్‌ హీరో క్యారెక్టర్‌ చెయ్యడం విశాల్‌కి కొత్తేమీ కాదు. ఈ తరహా క్యారెక్టర్లు గతంలో చాలా సినిమాల్లో చేసిన విశాల్‌ ఈ సినిమాలో కూడా తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో, యాక్షన్‌ సీన్స్‌లో తన సత్తా చూపించాడు. అలాగే లవ్‌ సీన్స్‌లో, రొమాంటిక్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. మహానటి వంటి అద్భుతమైన పాత్ర చేసిన కీర్తి సురేష్‌ దానికి భిన్నంగా ఈ సినిమాలో పక్కా మాస్‌ క్యారెక్టర్‌లో నటించింది. తన గ్లామర్‌తో, పెర్‌ఫార్మెన్స్‌తో అలరించింది. రాజారెడ్డి పాత్రని రాజ్‌కిరణ్‌ ఎంతో సెటిల్డ్‌గా చేశాడు. పగతో రగిలిపోయే భవాని పాత్రను చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే శక్తివేల్‌ ఫోటోగ్రఫీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పల్లెటూరి నేపథ్యాన్ని తెరపై అందంగా ఆవిష్కరించాడు. విశాల్‌ చేసిన చాలా సినిమాలకు యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించాడు. అయితే ఈ సినిమాలో మాత్రం యువన్‌ చేసిన ఒక్క పాట కూడా వినదగ్గదిగా లేదు. పాటల్లోని సాహిత్యం కూడా అర్థం కాని రణగొణ ధ్వనులతో కూడిన సంగీతాన్ని చేశాడు యువన్‌. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఎడిటింగ్‌ విషయానికి వస్తే ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో కథనాన్ని దెబ్బతీసే సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని ఎడిట్‌ చేసి ఉంటే సినిమా స్పీడ్‌గా ఉండేది. ఈ విషయంలో ఎడిటర్‌ ప్రవీణ్‌ తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ప్రొడక్షన్‌ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్‌లోనూ వందల సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులతో చేసిన సీన్స్‌ సినిమాలో కోకొల్లలు. ఆ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చాలా రిచ్‌గా సినిమా నిర్మించారు. ఇక డైరెక్టర్‌ లింగుస్వామి విషయానికి వస్తే.. అతను రాసుకున్న కథలోగానీ, కథనంలోగానీ ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఈ తరహా కథ, కాన్‌ఫ్లిక్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ పాత సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది తప్ప కొత్త సినిమా చూస్తున్నామన్న భావన రాదు. ఒక అమ్మాయి విలన్‌ అయితే, ఆమె హీరోతో తలపడితే ఎలా ఉంటుందనేది గతంలో విశాల్‌ చేసిన పొగరు చిత్రంలో చూశాం. అయితే ఆ సినిమాలో అది ఒక ఎపిసోడ్‌ మాత్రమే. ఈ సినిమా విషయానికి వస్తే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆ ఎమోషన్‌ కొనసాగుతుంది. అయితే భవాని క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కనిపించిన ప్రతిసారీ రెండు, మూడు డైలాగులతో, అవసరానికి మించిన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె క్యారెక్టర్‌ని ఎలివేట్‌ చెయ్యాలని ట్రై చేశాడు. కానీ, అది అంతగా రక్తి కట్టలేదు. క్లైమాక్స్‌లో బాలు, భవాని మధ్య వచ్చే ఫైట్‌ కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. రెండు ఊళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి అనే క్యూరియాసిటీతో చూస్తున్న ప్రేక్షకులకు కాస్త రిలీఫ్‌ ఇచ్చేందుకు విశాల్‌, కీర్తి సురేష్‌ మధ్య చేసిన లవ్‌ ట్రాక్‌ బాగుంది. అయితే ఆ ట్రాక్‌ మరికాస్త పెంచితే బాగుండేది. ఇక సినిమా మొత్తం తమిళ నేటివిటీ కనిపిస్తుంది. విశాల్‌, కీర్తి సురేష్‌ తప్ప తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటీనటులు సినిమాలో కనిపిస్తారు. దానికితోడు వెంట వెంటనే వచ్చే జాతర సీన్స్‌ వల్ల మనం థియేటర్‌లో కాకుండా జాతరలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. కొన్ని బిల్డప్‌ సీన్స్‌, హీరో, హీరోయిన్‌ మధ్య నడిచే సీన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఫస్ట్‌హాఫ్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి ఎక్కడ ఆగిన కథ అక్కడే ఉంటుంది. కథను ముందుకు నడిపించకుండా కాలయాపన చేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి బి, సి సెంటర్స్‌లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌గానీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లుగానీ ఆయా సెంటర్స్‌ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: మరో ఫ్యాక్షన్‌ సినిమా

pandem kodi 2 review:

vishal new movie pandem kodi 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs