స్టూడియో గ్రీన్
నోటా
తారాగణం: విజయ్ దేవరకొండ, మెహరీన్, నాజర్, సత్యరాజ్, సంచనా నటరాజన్, ప్రియదర్శి తదితరులు
సినిమాటోగ్రఫీ: సంతాన కృష్ణన్, రవిచంద్రన్
ఎడిటింగ్: రేమండ్ డెరిక్ క్రాస్టా
సంగీతం: శామ్ సి.ఎస్
కథ: షాన్ కుప్పుస్వామి
నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా
దర్శకత్వం: ఆనంద్ శంకర్
విడుదల తేదీ: 05.10.2018
అర్జున్‌రెడ్డి సినిమాకి ముందు విజయ్ దేవరకొండ కొన్ని సినిమాలు చేసినప్పటికీ అర్జున్‌రెడ్డి తర్వాత హీరోగా అతనికి వచ్చిన క్రేజ్ మూమూలుది కాదు. ముఖ్యంగా యువతీ యువకులు విజయ్‌కి వీరాభిమానులుగా మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం చిత్రంతో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఈ సినిమా తమిళ్‌లో కూడా భారీ వసూళ్ళు సాధించడంతో టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన సినిమా నోటా. విజయ్‌కి ఉన్న క్రేజ్‌కి నోటా అతను చెయ్యాల్సిన సినిమా కాదు. పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా అతని కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడని సినిమా. కథ, కథనాల ప్రకారం కూడా ఎక్కడా కొత్తదనం లేని ఈ సినిమా విజయ్ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో అర్థం కాదు. గత 15 రోజులుగా ఈ సినిమాకి సంబంధించి చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసాయి. తద్వారా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. మరి ఈ నోటా కథ, కథనాలు ఎలా సాగాయి? విజయ్ చేసిన ఈ కొత్తజోనర్ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? ఆనంద్ శంకర్ ఈ కథను ఎలా డీల్ చేశాడు? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అతని పేరు వరుణ్(విజయ్ దేవరకొండ). తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కుమారుడు. లండన్‌లో వీడియో గేమింగ్ చేసే వరుణ్ హాలీడేస్‌కి హైదరాబాద్ వస్తాడు. ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకుంటూ జాలీగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో రాత్రికి రాత్రే వాసుదేవ్ సి.ఎం. పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దాంతో కొడుకు వరుణ్‌ని సి.ఎం.గా ప్రకటిస్తాడు వాసుదేవ్. సున్నా పొలిటికల్ నాలెడ్జ్ వున్న వరుణ్ ఈ పరిణామానికి షాక్ అవుతాడు. ఒక అవినీతి కేసులో నిందితుడుగా ఉన్న వాసుదేవ్‌కి ఓ రెండు వారాల్లో బెయిల్ వస్తుందని, అంతవరకు సి.ఎం.గా కొనసాగాల్సిందిగా వరుణ్‌ని కోరుతుంది పార్టీ నాయకత్వం. సి.ఎం.గా ఇంటినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు వరుణ్. ఇదిలా ఉంటే ఢిల్లీ కోర్టు వాసుదేవ్‌ని దోషిగా నిర్ధారించి జైలుకి తరలిస్తుంది. దీంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయి. ఆ అల్లర్లలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోతుంది. ఆ ఘటన చూసి చలించిపోయిన వరుణ్ సి.ఎం.గా తన బాధ్యతలు ఏమిటో తెలుసుకుంటాడు. తను చేసే మంచి పనులతో మంచి సి.ఎం.గా ప్రజల్లో పేరు తెచ్చుకుంటాడు. ఆ తరుణంలో వాసుదేవ్‌కి బెయిల్ వస్తుంది. పదవీకాంక్షతో ఉన్న వాసుదేవ్.. తన కొడుకు పరిపాలన చూసి తట్టుకోలేకపోతాడు. కొడుకుపైనే పగ పెంచుకుంటాడు. మరోపక్క వాసుదేవ్‌ని హత్య చేయాలని ఒక వర్గం ఎదురుచూస్తుంటాడు. ప్రతిపక్ష పార్టీ వరుణ్‌కి ప్రజల్లో చెడ్డ పేరు ఎలా తేవాలా అని ఆలోచిస్తుంటుంది. ఇన్ని సమస్యల మధ్య వరుణ్ సి.ఎం.గా ఎలా నెగ్గుకొచ్చాడు? అతని వెనుక జరిగే కుట్రలను, రాజకీయాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఇంచుమించు ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు లీడర్, భరత్ అనే నేను. లీడర్ సంగతి పక్కన పెడితే భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిందే అయినా దానికి కొన్ని కమర్షియల్ హంగులు కూడా అద్దడంతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగింది. నోటా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి సీన్ సీరియస్‌గానే ఉంటుంది. ప్రేక్షకులకు ఏ దశలోనూ రిలీఫ్ అనేది ఉండదు. ఇక ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండకు ఏమాత్రం సూట్ అవ్వని క్యారెక్టర్ ఇది. దానికి తగ్గట్టుగానే నటన పరంగా అతని గత చిత్రాల్లో కనిపించిన గ్రేస్ ఈ సినిమాలో కనిపించదు. ఈ క్యారెక్టర్ ఎవరు చేసినా ఒక్కటే అనే విధంగా ఉంటుంది తప్ప ఏమాత్రం ప్రత్యేకత కనిపించదు. వాసుదేవ్‌గా నటించిన నాజర్ క్యారెక్టర్ కూడా సాదా సీదాగానే ఉంటుంది. సెకండాఫ్‌లో యాక్సిడెంట్ తర్వాత అతనికి భయంకరమైన మేకప్ వేసి ప్రేక్షకుల్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. జర్నలిస్ట్‌గా కనిపించిన సత్యరాజ్ క్యారెక్టర్ కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. అతని కూతురుగా మెహరీన్ నటించింది. అయితే ఆ క్యారెక్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ సున్నా అని చెప్పొచ్చు. దాని కోసం మెహరీన్‌ని తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక ప్రతిపక్ష నేత కుమార్తెగా నటించిన సంచనా నటరాజన్ క్యారెక్టర్ బాగుంది. ఆమె పెర్‌ఫార్మెన్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమాలోని క్యారెక్టర్లుగానీ, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌గానీ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసేలా లేదనేది వాస్తవం.
టెక్నికల్ ఎస్సెట్స్ గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా ఏమీ లేవు. సినిమాటోగ్రఫీగానీ, ఎడిటింగ్‌గానీ, మ్యూజిక్‌గానీ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. సినిమాలో ఉన్న రెండు మూడు పాటలు అర్థం పర్థం లేకుండా, ప్రేక్షకులకు అర్థం కాకుండా ఉన్నాయి. పిక్చరైజేషన్ కూడా చాలా నాసిరకంగా ఉంది. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయనిపించినా సెకండాఫ్‌కి వచ్చే సరికి కథ నత్త నడకతో సాగడం విసుగు పుట్టిస్తుంది. సత్యరాజ్ తన ప్రేమకథని దాదాపు 15 నిమిషాలు చెప్పడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. ఇక క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా సాదా సీదాగా ముగించేశారు. హీరో తండ్రిని చంపాలని ప్రయత్నించిన స్వామీజీ ఊసు ఉండదు. గల్లంతయిన సి.ఎం. వేల కోట్ల ఆస్తి గురించి ఆరా ఉండదు. ఇలా చాలా విషయాల్ని వదిలేసి హడావిడిగా సినిమాని ముగించేశారనిపిస్తుంది. డైరెక్టర్ ఆనంద్ శంకర్ గురించి చెప్పాలంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ సన్నివేశాన్నీ ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. విజయ్ దేవరకొండ వంటి హీరో నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయాడు. సినిమాలో లవ్ అనేది మచ్చుకైనా లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ అసలే లేదు. పోనీ బలమైన కథ, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా అంటే అవీ లేవు. ఫైనల్‌గా చెప్పాలంటే అర్జున్‌రెడ్డి, గీత గోవిందం సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో వస్తున్నాడని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ, నిస్పృహలను మిగిల్చే సినిమా నోటా.
ఫినిషింగ్ టచ్: సహనాన్ని పరీక్షించే నోటా