ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్
ఆటగాళ్ళు
తారాగణం: నారా రోహిత్, జగపతిబాబు, దర్శన బానిక్, బ్రహ్మానందం, సుబ్బరాజు, తులసి, జీవా, చలపతిరావు తదితరులు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
సంగీతం: సాయికార్తీక్
నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర
రచన, దర్శకత్వం: పరుచూరి మురళి
విడుదల తేదీ: 24.08.2018
బాణంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్‌కి విజయాల శాతం తక్కువే అయినా సినిమాల సంఖ్య మాత్రం ఎక్కువే. ఇప్పటివరకు కమర్షియల్‌గా సక్సెస్ అయిన సినిమాలు అతని కెరీర్‌లో లేవనే చెప్పాలి. అయినా వరసగా విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా చేసిన మరో సినిమా ఆటగాళ్ళు. పెదబాబు, ఆంధ్రుడు వంటి సూపర్‌హిట్ చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాలు చేసిన పరుచూరి మురళి కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా ఇది. నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నారా రోహిత్ కెరీర్‌కి ప్లస్ అయిందా? పరుచూరి మురళి మరో సూపర్‌హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి చూద్దాం.
అతని పేరు సిద్ధార్థ్(నారా రోహిత్). సినిమా డైరెక్టర్‌గా మంచి ఫామ్‌లో ఉన్న అతనికి తన ఇమేజ్ అంటే ప్రాణం. ఇమేజ్ ముందు మిగతావన్నీ తక్కువగానే కనిపిస్తాయి. ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఏమైనా చెయ్యడానికి అతను సిద్ధం. మరో పక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వీరేందర్(జగపతిబాబు)కు న్యాయవాదిగా మంచి పేరు ఉంది. అతను ఒక కేసు టేకప్ చేశాడంటే గెలిచి తీరతాడు. అతని వాదన ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుంది. న్యాయాన్ని గెలిపించడమే అతని లక్ష్యం. ఇవీ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల తీరుతెన్నులు. కథ విషయానికి వస్తే సినిమా ప్రారంభంలోనే ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్‌లో ఒక రైతు చనిపోతాడు. అది తెలుసుకున్న అతని భార్య పిల్లలకు విషమిచ్చి, తాను కూడా తీసుకుంటుంది. అయితే ఇద్దరు పిల్లల్లో ఒక అమ్మాయికి మాత్రం ప్రాణగండం తప్పుతుంది. తల్లీ, తండ్రి లేని ఆ అమ్మాయిని సిద్ధార్థ్ దత్తత తీసుకుంటాడు. కట్ చేస్తే సిద్ధార్థ్ తన భార్య అంజలి(దర్శన బానిక్)ని హత్య చేశాడని టీవీల్లో వార్తలు వస్తాయి. పోలీసులు సిద్ధార్థ్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తారు. అంజలిని చంపింది సిద్ధార్థేనని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాడు వీరేందర్. న్యాయం ఉన్న వైపే వీరేందర్ వాదిస్తాడు కాబట్టి, తనవైపు న్యాయం ఉంది కాబట్టి తన తరఫున వాదించాల్సిందిగా వీరేందర్‌ని కోరతాడు సిద్ధార్థ్. అలా అంజలి కేసు కొత్త మలుపు తిరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వీరేందర్ డిఫెన్స్ తరఫున వాదించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతారు. అయినా న్యాయాన్ని గెలిపించడానికే నిర్ణయించుకుంటాడు వీరేందర్. ఇక అక్కడి నుంచి కేసు ఎన్ని మలుపులు తిరిగింది? సిద్ధార్థ్ నిజంగానే తన భార్యను హత్య చేయలేదా? మరి అంజలిని ఎవరు చంపారు? సిద్ధార్థ్ నిరపరాధి అని వీరేందర్ నిరూపించగలిగాడా? లేక అంజలి హత్యలో మిస్టరీ ఏదైనా దాగి ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇప్పటివరకు నారా రోహిత్ చేసిన బాణం, సోలో, ప్రతినిధి వంటి కొన్ని సినిమాల్లో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పెర్‌ఫార్మర్‌గా అతనికి వంక పెట్టలేం. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే నటనలో ఎలాంటి అనుభవం లేని ఓ కొత్త హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి సిట్యుయేషన్‌కైనా ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో ఆద్యంతం విసుగు పుట్టించాడు రోహిత్. అయితే అది పూర్తిగా దర్శకుడి వైఫల్యం అని చెప్పక తప్పదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏ దశలోనూ తన అసలైన నటనని ప్రదర్శించలేకపోయాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జగపతిబాబు పెర్‌ఫార్మెన్స్ బాగానే ఉంది. అతని పాత్ర పరిధి మేరకు అత్యుత్తమ నటనను ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ దర్శన బానిక్‌కి కూడా నటించే అవకాశం తక్కువగానే వచ్చిందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఇప్పటికే అతని కామెడీ ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా అతని రొటీన్ కామెడీ విసిగించింది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించిన తులసి తన క్యారెక్టర్‌కి న్యాయం చేసింది. మిగతా నటీనటుల పాత్రల గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతికంగా చూసే విజయ్ సి. కుమార్ ఫోటోగ్రఫీ ఓకే అనిపించింది. కథ, కథనాల ప్రకారం విజువల్‌గా ఎలాంటి వండర్స్ చెయ్యాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫోటోగ్రఫీ సాదా సీదాగా అనిపిస్తుంది. సాయికార్తీక్ చేసిన నీవల్లే నీవల్లే... అనే పాట కాస్త ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తాడని సాయికార్తీక్‌కి పేరుంది. కానీ, ఈ సినిమా విషయంలో ఆ అద్భుతంగా జరగలేదు. రణగొణ ధ్వనులు తప్ప వీనుల విందైన సంగీతం ఎక్కడా వినిపించదు. ఇక దర్శకుడు పరుచూరి మురళి గురించి చెప్పాలంటే గతంలో అతను చేసిన సినిమాల్లో ఎంతో కొంత విషయం ఉండేది. జయాపజయాలు పక్కన పెడితే అతను చెప్పాలనుకున్న పాయింట్ ఆమోదయోగ్యంగానే ఉండేది. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కథనం కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ప్రారంభమైన ఐదు నిమిషాలకే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో ఒక నిర్థారణకు వస్తాం. టీవీ ఛానల్స్‌కి సంబంధించి చూసిన సీన్సే మళ్ళీ మళ్ళీ చూడాల్సి రావడం, కథను పక్కన పెట్టి బ్రహ్మానందంతో కామెడీ చేయించే ప్రయత్నం చెయ్యడం, సాయికార్తీక్ అండ్ టీమ్‌తో ఒక డాన్స్ సాంగ్ పెట్టడం వంటివి కథకు పెద్ద అవరోధాలుగా మారాయి. నిజం చెప్పాలంటే ఈ కథతో షార్ట్ ఫిలిం చెయ్యవచ్చు తప్ప రెండున్నర గంటల సినిమా తియ్యడం, దాన్ని ప్రేక్షకులు చూసే సాహసం చెయ్యడం కరెక్ట్ కాదు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నారా రోహిత్ నుంచి మంచి నటనను రాబట్టడంలో మురళి విఫలమయ్యాడు. ఏ దశలోనూ అతనిలోని నటుడ్ని బయటికి తీసుకురాలేకపోయాడు. ఆటగాళ్ళు అనే టైటిల్ చూసి ఓ కొత్త తరహా కథతో సినిమా చేసి ఉంటారు, సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి, సినిమా చూస్తూ థ్రిల్ అయిపోతాం అనుకుంటే పొరపాటే. ఇందులో అలాంటి అంశాలు ఏమీ ఉండవు. ఆహా అనిపించే సన్నివేశాలు కూడా కనిపించవు. తాను క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఇటీవల నారా రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఈ సినిమాకి ఎందుకొచ్చామా అని బాధపడే ప్రేక్షకులకు సెకండాఫ్‌లో కాస్త ఫర్వాలేదు అనిపించే కొన్ని సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. నారా రోహిత్ పరాజయాల వరసలో ఆటగాళ్ళు కూడా చేరిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫినిషింగ్ టచ్: ఓడిపోయిన ఆటగాళ్ళు