యు.వి. క్రియేషన్స్, పాకెట్ సినిమా
హ్యాపి వెడ్డింగ్
తారాగణం: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల, మురళీశర్మ, నరేష్, తులసి, ఇంద్రజ, పవిత్రా లోకేష్, పూజిత పొన్నాడ, అన్నపూర్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.బాల్‌రెడ్డి
ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: థమన్
నిర్మాణం: పాకెట్ సినిమా
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
విడుదల తేదీ: 28.07.2018
ప్రేమకథలు, ఫ్యాక్షన్ కథలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలు, కామెడీ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్... ఇలా మనకు తెలిసిన సినిమాలు ఇవే. ఇవి కాకుండా ఒక కొత్త కథ రాస్తున్నానన్న భావనతో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాకు రచన చేశాడు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నదేమిటి? పెళ్ళి నిశ్చయమైనప్పటి నుంచి పెళ్ళి రోజు వరకు ఆ రెండు కుటుంబాల మధ్య, హీరో, హీరోయిన్ మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? హ్యాపి వెడ్డింగ్ అనే టైటిల్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథగా చెప్పుకోవాలంటే కథానాయకుడు ఆనంద్(సుమంత్ అశ్విన్), అక్షర(నిహారిక)కు పెళ్ళి నిశ్చయమైపోయింది. తాంబూలాలు కూడా మార్చుకున్నారు. ఇక అక్కడి నుంచి పెళ్ళి వరకు వారిద్దరి ప్రయాణం ఎలా కొనసాగింది? ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది ఈ సినిమా కథ. అయితే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే అమ్మాయికి గతంలో ఓ ప్రేమకథ ఉండడం. మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన తర్వాత ప్రస్తుత హీరోతో కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత పెళ్ళి ఫిక్స్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల మాజీ ప్రియుడు విజయ్‌తో అక్షర బ్రేకప్ అవుతుంది. ఇప్పుడా కారణాలు ఆనంద్‌లోనూ కనిపిస్తాయి అక్షరకి. ప్రతి విషయంలోనూ కన్‌ఫ్యూజ్ అయ్యే అక్షర తన పెళ్లి విషయంలోనూ అదే కన్‌ఫ్యూజన్ మెయిన్‌టెయిన్ చేస్తుంది. ఆనంద్ తన విషయంలో శ్రద్ధ చూపించడం లేదని ఫీల్ అవుతుంది. వివాహబంధం ఎలా ఉంటుందోనన్న భయం ఆమెలో మొదలవుతుంది. ఆ భయంతోనే ఆనంద్‌తో పెళ్ళి వద్దు అనుకుంటుంది. ఇద్దరి కుటుంబాల్లో మాత్రం పెళ్ళి హడావిడి జరుగుతూ ఉంటుంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు. ఆనంద్, అక్షర విడిపోదామనుకున్న విషయం పెద్దవారికి తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఆనంద్‌గా సుమంత్ అశ్విన్ నటన అత్యుత్సాహంగా ఉంటుంది. ఎక్కడా నేచురాలిటీ కనిపించదు. చెప్పే డైలాగ్స్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ అన్నీ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో చిరాకును కూడా తెప్పిస్తుంది. హీరోయిన్ నిహారిక విషయానికి వస్తే ఒక్కో సీన్‌లో ఫ్రెష్‌గా కనిపిస్తూ, ఒక్కో సీన్‌లో డల్‌గా కనిపిస్తుంది. పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే తనకు కథతో సంబంధం లేదు అన్నట్టు ఆమె నటన ఉంది. కొన్ని సీన్స్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా నిలబడి ఉంటుంది. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే మురళీశర్మ, నరేష్, తులసి, అన్నపూర్ణ... ఇలా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రేక్షకుల్ని నవ్వించడానికో, జీవిత సత్యాలను బోధించడానికో మేం ఉన్నాం అన్నట్టుగా ఉంటుంది.
సాంకేతిక అంశాల గురించి చెప్పుకోవడానికి ఇందులో ఏమీ లేవు. సినిమాటోగ్రఫీ చాలా సాదాసీదాగా ఉంది. అద్భుతం అనిపించే విజువల్స్ ఒక్కటి కూడా లేదు. శక్తికాంత్ కార్తీక్ చేసిన పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకునేవిగా లేవు. సినిమాలో విషయం లేనపుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఏమీ ఎఫెక్ట్ ఇవ్వలేదు. థమన్ చేసిన ఆర్ ఆర్ కూడా అలాగే ఉంది. కృష్ణారెడ్డి ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. రెండు గంటల సినిమా అయినప్పటికీ మూడు గంటల సేపు చూసిన ఫీల్ కలుగుతుంది. భవానీ ప్రసాద్ రాసిన మాటలు కూడా అక్కడక్కడ బాగున్నాయి అనిపించాయి తప్ప ఓవరాల్‌గా బాగాలేదు. ఇక దర్శకుడు లక్ష్మణ్ కార్య గురించి చెప్పాలంటే అతను రాసుకున్న కథలో కొత్తదనం అనేది ఎక్కడా కనిపించదు. హీరో, హీరోయిన్, హీరోయిన్ మాజీ లవర్... ఇలా ఏ క్యారెక్టర్ కూడా మనకు సహజంగా అనిపించదు. దానికి తగ్గట్టుగానే వారి పెర్‌ఫార్మెన్స్ కూడా నేచురల్‌గా ఉండదు. హీరోయిన్‌కి ఉండే కన్‌ఫ్యూజన్, భవిష్యత్తుపై భయం.. ఇవన్నీ ప్రేక్షకులకు చిరాకు తెప్పించే అంశాలే తప్ప ఆకట్టుకునేవి కావు. ఈరోజుల్లో అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆనంద్‌ని అక్షర అపార్థం చేసుకునే కొన్ని సీన్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన అక్షరను రిసీవ్ చేసుకోవడానికి ఆనంద్ రాడు. ఆ టైమ్‌లో తన మాజీ ప్రియుడికి ఫోన్ చేసి అతని కారులో వస్తుంది. ఇలాంటి సిల్లీ సీన్స్ సినిమాలో కోకొల్లలుగా ఉంటాయి. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు హైదరాబాద్, విజయవాడ పేర్లు విని విని ప్రేక్షకులకు విసుగుపుడుతుంది. కథ పరంగా, కథనం, పరంగా, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ పరంగా... ఏ విధంగా చూసినా హ్యాపి వెడ్డింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమైన పనే. ఒక దశలో మనం సినిమా చూస్తున్నామా టి.వి. సీరియల్ చూస్తున్నామా అనే అనుమానం కూడా వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే హ్యాపి వెడ్డింగ్ చిత్రం ఏ వర్గం ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా లేదు. సినిమా స్లో నేరేషన్‌తో ప్రారంభం అవుతుంది అదే స్పీడ్‌ను చివరి వరకు కంటిన్యూ చేశాడు దర్శకుడు. సినిమా ఎప్పుడు క్లైమాక్స్ వస్తుంది, ఎప్పుడు థియేటర్ నుంచి బయట పడదాం అనే ఆలోచనతో ఉంటారు ప్రేక్షకులు. ఏ విధంగా చూసినా ఈ సినిమాకు సరైన ఆదరణ లభిస్తుందనేది సందేహమే.
ఫినిషింగ్ టచ్: విసిగించే వెడ్డింగ్