Advertisement

సినీజోష్‌ రివ్యూ: సాక్ష్యం


 

Advertisement

అభిషేక్‌ పిక్చర్స్‌ 

సాక్ష్యం 

తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్‌కుమార్‌, రావు రమేష్‌, జయప్రకాష్‌, పోసాని, మీనా, పవిత్రా లోకేష్‌, వెన్నెల కిశోర్‌, రఘుబాబు, అశుతోష్‌ రాణా, రవికిషన్‌, బ్రహ్మాజీ, ఝాన్సీ, ప్రత్యేక పాత్రలో అనంతశ్రీరామ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఎ. విల్సన్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌ 

మాటలు: సాయిమాధవ్‌ బుర్రా 

సమర్పణ: దేవాంశ్‌ నామా 

నిర్మాత: అభిషేక్‌ నామా 

రచన, దర్శకత్వం: శ్రీవాస్‌ 

విడుదల తేదీ: 27.07.2018 

అల్లుడు శీను అనే ఓ భారీ బడ్జెట్‌ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, జయ జానకి నాయక చిత్రాలు కూడా అదే స్థాయి బడ్జెట్‌తో రూపొందాయి. తాజాగా శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించిన సాక్ష్యం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. పంచభూతాల నేపథ్యంలో శ్రీవాస్‌ రాసుకున్న ఓ రివెంజ్‌ డ్రామాకి తెరరూపమే ఈ చిత్రం. తను చేసే పాపాలు, నేరాలు ఎవరూ చూడడం లేదని మనిషి భావిస్తాడు. కానీ, పంచభూతాలు వాటికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఎప్పటికైనా ఆ పంచభూతాల వల్ల శిక్ష అనుభవించక తప్పదు అని ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాడు శ్రీవాస్‌. తనెంతో వైవిధ్యం రాసుకున్న ఈ కథని తెరపై ఎలా ఆవిష్కరించాడు? బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ కథకు హీరోగా ఎంతవరకు న్యాయం చేశాడు? నేపథ్యం కొత్తదే అయినా ఈ కథలోని కొత్తదనం ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

అతని పేరు విశ్వ(బెల్లంకొండ శ్రీనివాస్‌). అమెరికాలో స్థిరపడిన వేల కోట్ల అధిపతి శివప్రకాశ్‌(జయప్రకాశ్‌) తనయుడు. అమెరికాకు చుట్టం చూపుగా వచ్చి అక్కడి తెలుగువారికి ప్రవచనాలు బోధించే సౌందర్యలహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందేందుకు తపిస్తాడు. సౌందర్య ఇండియా వచెయ్యడంతో ఆమెను ఫాలో అవుతూ విశ్వ కూడా వస్తాడు. సినిమాటిక్‌గా వారి కుటుంబంలో చేరిపోతాడు. వీడియో గేమ్‌ ప్రోగ్రామర్‌ అయిన విశ్వ ఓ కొత్త తరహా గేమ్‌ని ప్లాన్‌ చెయ్యాలనుకుంటాడు. దానికి వాల్మీకి(అనంతశ్రీరామ్‌) ఓ కొత్త కాన్సెప్ట్‌ చెప్తాడు. పంచభూతాల నేపథ్యంలో సాగే ఆ గేమ్‌లో భూమి, నీరు, నిప్పు, గాలి... నాలుగు లెవల్స్‌ ఉంటాయి. ఆ గేమ్‌లోని హీరో... విలన్స్‌ని ఈ పంచభూతాల సాయంతోనే హతమారుస్తాడు. వాల్మీకి ఏదైతే డిజైన్‌ చేసాడో దాని ప్రకారమే విశ్వ నిజజీవితంలో ఒక్కొక్కరినీ చంపుతూ ఉంటాడు. అయితే వారిని ఎందుకు చంపుతున్నాడో విశ్వకు తెలీదు. అలాగే తాము ఏ కారణంతో చనిపోతున్నారో చనిపోయేవారికి కూడా తెలీదు. ఈ కథలోని నలుగురు విలన్స్‌.. హీరోకి చేసిన అన్యాయం ఏమిటి? అసలు విశ్వ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఇది నాలుగో సినిమా. అతను చేసే సినిమాల్లో భారీ తనం, పెద్ద డైరెక్టర్స్‌, టాప్‌ హీరోయిన్స్‌, టాప్‌ టెక్నీషియన్స్‌, భారీ తారాగణం... ఇలా అన్నీ భారీగానే ఉంటాయి. అయితే పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆ రిచ్‌నెస్‌ అతనిలో కనిపించదు. నటన విషయంలోగానీ, డాన్స్‌గానీ, ఫైట్స్‌గానీ మెకానికల్‌గా ఉంటాయే తప్ప నేచురల్‌గా అనిపించవు. ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే గ్లామర్‌ సినిమాకి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. ఏ దశలోనూ పూజా ఆకట్టుకోలేకపోయింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఈ సినిమాలో చెప్పుకోదగిన నటుడు జగపతిబాబు. మునుస్వామి క్యారెక్టర్‌కి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశాడు. హీరో ఫ్రెండ్‌గా వెన్నెల కిశోర్‌ కామెడీ చెయ్యాలని అక్కడక్కడా ప్రయత్నించినా వర్కవుట్‌ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో రావు రమేష్‌, జయప్రకాశ్‌, శరత్‌కుమార్‌, అశుతోష్‌ రాణా తదితరులు ఓకే అనిపించారు. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే సంగీతం, సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి. ఆర్థర్‌ ఎ. విల్సన్‌ ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫారిన్‌ లొకేషన్స్‌లో తీసిన విజువల్స్‌ చాలా బాగున్నాయి. పాటల పిక్చరైజేషన్‌లో కూడా ఆ రిచ్‌నెస్‌ని చూపించాడు. సంగీత దర్శకుడు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ చేసిన పాటల్లో రెండు పాటలు మినహా ఆకట్టుకోలేదు. అందులో సౌందర్యలహరి పాట చాలా బాగుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని మాత్రం అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందించే క్వాలిటీ హర్షవర్థన్‌ మ్యూజిక్‌లో కనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళాడని చెప్పొచ్చు. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా చాలా సందర్భాల్లో ఆకట్టుకుంటాయి. పీటర్‌ హెయిన్స్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక్కో ఫైట్‌ని ఒక్కోలా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫైట్స్‌ని పెర్‌ఫార్మ్‌ చేసే క్రమంలో చాలా చోట్ల మనకు పాజ్‌ వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. చురుగ్గా ఫైట్స్‌ సాగుతున్న ఫీల్‌ కలగదు. ఎడిటింగ్‌ విషయానికి వస్తే రెండు గంటల నలభై ఆరు నిమిషాల నిడివి వున్న సినిమాని కనీసం 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. అభిషేక్‌ నామా పెట్టిన ఖర్చు స్క్రీన్‌మీద కనిపిస్తుంది. ప్రతి సీన్‌ బాగా రిచ్‌గా రావడంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదనేది అర్థమవుతుంది. ఇక దర్శకుడు శ్రీవాస్‌ గురించి చెప్పాలంటే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేసినప్పటికీ ఓవరాల్‌గా ఇది ఒక రివెంజ్‌ డ్రామాగా మిగిలిపోయింది. పంచభూతాలు అనే కాన్సెప్ట్‌ తప్ప జనరల్‌గా మనం చూసే రెగ్యులర్‌ ఫార్మాట్‌ కమర్షియల్‌ సినిమాలాగే అనిపిస్తుంది. సినిమాలో చాలా లూప్‌ హోల్స్‌ ఉన్నాయి. హీరో తనకు తెలియకుండానే విలన్స్‌ని చంపుతూ వెళ్తుంటాడు. వాల్మీకి డిజైన్‌ చేసిన గేమ్‌లోలాగే బయట కూడా జరుగుతూ ఉంటుంది. కానీ, హీరో మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోడు. గేమ్‌ డిజైన్‌ చేసినట్టుగానే తను ఎందుకు చంపుతున్నాడనేది ఆలోచించడు. అలాగే హీరో చేతుల్లో మరో ఇద్దరు చావబోతున్నారని ఓ అఘోరా చెప్పినా వాళ్ళని తనెందుకు చంపాల్సి వస్తోందని ఆరా తియ్యడు. అలాగే హీరో ఫ్లాష్‌బ్యాక్‌లో తల్లిదండ్రులను ఆ నలుగురు విలన్స్‌ వల్లే కోల్పోయాడనే విషయం చివరి వరకు తెలుసుకోలేడు. ఫైనల్‌గా చెప్పాలంటే పంచభూతాలు అనే కాన్సెప్ట్‌ పక్కన పెడితే రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కొంతవరకు ఈ సినిమాని ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంది. 

ఫినిషింగ్‌ టచ్‌: రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీ

telugu movie sakshyam review :

bellamkonda srinivas new movie sakshyam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement