షైన్ స్క్రీన్స్
కృష్ణార్జున యుద్ధం
తారాగణం: నాని(ద్విపాత్రాభినయం), అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్, నాగినీడు, బ్రహ్మాజీ, సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: సత్య జి.
సంగీతం: హిప్‌హాప్ తమిళ
సమర్పణ: వెంకట్ బోయనపల్లి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేదీ: 12.04.2018
వరస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న నాని తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ముచ్చటగా మూడోసారి నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామన్ ఆడియన్స్‌కి కనెక్ట్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన నాని ఈ సినిమాతో ఎంతవరకు ఎంటర్‌టైన్ చెయ్యగలిగాడు? మేర్లపాక గాంధీ.. నాని సక్సెస్ గ్రాఫ్‌ని మరింత పెంచడంలో సక్సెస్ అయ్యాడా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కృష్ణ(నాని) చిత్తూరు జిల్లాలోని అక్కుర్తి గ్రామంలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఉంటాడు. ఏ అమ్మాయి కనిపించినా ఇంప్రెస్ చెయ్యాలని ట్రై చేస్తుంటాడు, చివాట్లు తింటూ వుంటాడు. అలాంటి కృష్ణకి సిటీ నుంచి వచ్చిన రియా(రుక్సర్ మీర్) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక రాక్‌స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్(నాని) దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు. ఏ అమ్మాయినైనా మ్యాగీ ప్రిపేర్ చేసినంత సేపట్లో లైన్‌లో పెట్టగల లవర్‌బోయ్. అయితే ఏ అమ్మాయినీ అతను ప్రేమించలేదు, ఎవర్నీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అయితే అతనికి తారసపడ్డ సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ని మాత్రం సిన్సియర్‌గా లవ్ చేస్తాడు. కానీ, అర్జున్ గురించి తెలుసుకున్న సుబ్బలక్ష్మి అతను ఎన్ని విధాలుగా ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తుంది. కొన్ని కారణాల వల్ల కృష్ణకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది రియా. యూరప్‌లో అర్జున్ వల్ల ఇబ్బంది పడుతున్న సుబ్బలక్ష్మి కూడా అతనికి తెలియకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది. వారిని వెతుక్కుంటూ కృష్ణ, అర్జున్ కూడా హైదరాబాద్ వస్తారు. కానీ, ఇద్దరూ ఇంటికి చేరుకోరు. వారిద్దరూ ఏమయ్యారు? వారి ఆచూకీ తెలుసుకోవడానికి కృష్ణ, అర్జున్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలేమిటి? చివరికి ఈ రెండు జంటల ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా కథ.
చిత్తూరు స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్తూ పల్లెటూరి యువకుడు కృష్ణ క్యారెక్టర్‌లో నాని ఒదిగిపోయాడు. అమాయకత్వంతో అతను చేసే పనులు ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. రాక్‌స్టార్ అర్జున్‌గా నాని అంతగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి. ఈ రెండు క్యారెక్టర్స్‌లో కృష్ణ క్యారెక్టరే ఎక్కువగా ఎలివేట్ అయింది. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం మెప్పించిన నాని అమ్మాయిల్ని ఇట్టే వలలో వేసుకునే అర్జున్ క్యారెక్టర్ అతనికి సూట్ అవ్వలేదు. అయితే రెండు క్యారెక్టర్లను ఎంతో సమర్థవంతంగా పోషించాడు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ క్యారెక్టర్లు కథలో ఒక భాగం మాత్రమే. ఈ ఇద్దరు హీరోయిన్లు సినిమాకి పెద్ద ప్లస్ అవ్వలేదు. సినిమా అంతా నాని ఒన్ మ్యాన్ షోలాగే రన్ అవుతుంది. బ్రహ్మాజీ తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. మిగతా క్యారెక్టర్లలో నాగినీడు, సుదర్శన్ తదితరులు ఓకే అనిపించారు.
సాంకేతికంగా చూస్తే కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫీ సినిమాకి చాలా ప్లస్ అయింది. యూరప్‌లో తీసిన సీన్స్, విలేజ్‌లో తీసిన విజువల్స్ ఎంతో అందంగా అనిపిస్తాయి. ముఖ్యంగా యూరప్‌లో కార్ ఛేజ్ చాలా ఎఫెక్టివ్‌గా వచ్చింది. మూడు పాటల పిక్చరైజేషన్ బాగుంది. హిప్‌హాప్ తమిళ చేసిన పాటల్లో దారి చూడు, ఐ వాన్నా ఫ్లై పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. రెండు గంటల నలభై నిమిషాల నిడివిని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఫస్ట్‌హాఫ్ 90 నిమిషాలు ఉండడం వల్ల లెంగ్తీ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలో రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ గాంధీ గురించి చెప్పాలంటే ఫస్ట్‌హాఫ్‌ని డీల్ చేసినంత పర్‌ఫెక్ట్‌గా సెకండాఫ్‌ని చెయ్యలేకపోయాడు. విలేజ్‌లో కృష్ణకి సంబంధించిన సీన్స్‌ని, యూరప్‌లో అర్జున్‌కి సంబంధించిన సీన్స్‌ని లింక్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కథ, కథనాలు ఫస్ట్‌హాఫ్‌లో ఉన్నంత కొత్తగా సెకండాఫ్‌లో లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. నెక్స్‌ట్ ఏం జరగబోతోందనే క్యూరియాసిటీని ఫస్ట్‌హాఫ్‌లో కలిగించిన డైరెక్టర్ సెకండాఫ్‌కి వచ్చేసరికి రొటీన్ డ్రామాగా మార్చేశాడు. మిస్ అయిన హీరోయిన్ల జాడ కనిపెట్టడమే లక్ష్యంగా బయల్దేరిన కష్ణ, అర్జున్ ఏం చెయ్యబోతారనేది ముందే తెలిసిపోవడం వల్ల సెకండాఫ్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. కొన్ని కామెడీ సీన్స్, డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్, కొత్తగా అనిపించే సీన్స్‌తో ఫస్ట్‌హాఫ్ బాగుందన్న ఫీల్ కలుగుతుంది. సెకండాఫ్ అందరూ ఊహించినట్టుగానే ఉండడంతో రొటీన్ సినిమా అనిపిస్తుంది. ఆడియన్స్‌లో నానికి ఉన్న ఫాలోయింగ్‌ని బట్టి ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఫినిషింగ్ టచ్: ఫస్ట్‌హాఫ్ ఒకే.. సెకండాఫ్ రొటీన్