Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ఎం.ఎల్‌.ఎ


 

Advertisement
CJ Advs

 

 

బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ 

ఎం.ఎల్‌.ఎ(మంచి లక్షణాలున్న అబ్బాయి) 

తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్‌, కాజల్‌, రవికిషన్‌, నాగినీడు, మనాలి రాథోడ్‌, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, అజయ్‌, శివాజీరాజా, పృథ్వీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మురెళ్ళ 

ఎడిటింగ్‌: తమ్మిరాజు 

సంగీతం: మణిశర్మ 

సమర్పణ: టి.జి.విశ్వప్రసాద్‌ 

నిర్మాతలు: కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి 

రచన, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్‌ 

విడుదల తేదీ: 23.03.2018 

ఒక సినిమాని ప్రేక్షకులు ఆదరించాలన్నా, కమర్షియల్‌ మంచి విజయం సాధించాలన్నా చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటాడు సగటు ప్రేక్షకుడు. మంచి కథ, ఆకట్టుకునే కథనం, వినసొంపైన పాటలు, కథ నుంచి కాస్త రిలాక్స్‌ అవ్వడానికి కామెడీ.. ఇలా అన్నీ ఉంటేనే ఆ సినిమాకి హిట్‌ మార్కులు వేస్తారు. అయితే కొంతమంది దర్శకుడు దీన్నే కొలమానంగా తీసుకొని బలమైన కథ లేకపోయినా మిగిలినవన్నీ అవసరానికి మించి నింపేసి సినిమాని ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. సినిమాలో అన్నీ ఉండాలని కోరుకునే ప్రేక్షకులు అంత తెలివి తక్కువ వారు కాదు. శ్రుతి మించితే దేన్నయినా సహించరు. వెంటనే తిప్పి కొడతారు. ఈ శుక్రవారం విడుదలైన ఎం.ఎల్‌.ఎ కూడా ఆ కోవకు చెందిన సినిమాయే. నందమూరి కల్యాణ్‌రామ్‌, కాజల్‌ జంటగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ రూపొందించిన ఈ సినిమా కోసం ఎంచుకున్న కథావస్తువు ఎలాంటిది? దాన్ని ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు చెప్పగలిగాడా? పటాస్‌ తర్వాత హిట్‌ లేని కల్యాణ్‌రామ్‌కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎం.ఎల్‌.ఎ ఫుల్‌ ఫామ్‌గా మంచి లక్షణాలున్న అబ్బాయి అంటూ ఓ కొత్త టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలో నిజంగానే మంచి లక్షణాలు ఉన్నాయా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

ఓపెన్‌ చేస్తే సజావుగా జరుగుతున్న ఓ పెళ్లికి లేటెస్ట్‌ బైక్‌పై వచ్చిన హీరో కల్యాణ్‌(కల్యాణ్‌రామ్‌) పదుల సంఖ్యలో అక్కడున్న పోలీస్‌ ఆఫీసర్లను బురిడీ కొట్టించి పెళ్లి కొడుకుని ఎత్తుకెళ్ళిపోతాడు. తన చెల్లెలితో అతని పెళ్ళి చేస్తాడు. వారి ప్రేమ వివాహం నచ్చని తండ్రి చెల్లెలితోపాటు అన్నయ్యను కూడా గెటౌట్‌ అంటాడు. చెల్లెలు, బావతో కలిసి బెంగళూరు వచ్చి సెటిల్‌ అవుతాడు కల్యాణ్‌. బావ సాయంతో ఓ కంపెనీలో జాబ్‌ సంపాదించుకుంటాడు. అనుకోకుండా అప్పుడప్పుడు కలిసిన ఇందు(కాజల్‌)ని ప్రేమిస్తాడు. ఇందు తన బాస్‌ కూతురని కల్యాణ్‌కి తెలుస్తుంది. అయినా తన లవ్‌ కంటిన్యూ చేస్తాడు. ఇందు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటే దాన్ని సాల్వ్‌ చేసి ఆమెను ఇంప్రెస్‌ చేస్తాడు. ఇందు.. తన బాస్‌ కూతురు కాదని తెలుసుకొని షాక్‌ అవుతాడు కల్యాణ్‌. ఆమె కథ మొత్తం తెలుసుకుంటాడు. ఇందుని పెళ్ళి చేసుకోవాలంటే తను ఎమ్మెల్యే అవ్వాలి. ఆమె తండ్రి ఈ కండిషన్‌ పెడతాడు. ఇందు ప్రేమను దక్కించుకోవడానికి కల్యాణ్‌ ఎమ్మెల్యే అయ్యాడా? ఇందు... కల్యాణ్‌ బాస్‌ కూతుర్నని ఎందుకు అబద్ధం చెప్పింది? తన కూతర్ని ఎమ్మెల్యేకే ఇచ్చి చేస్తానని ఇందు తండ్రి ఎందుకు పట్టుపట్టాడు? ఎమ్మెల్యే అవ్వడానికి కల్యాణ్‌ ఎలాంటి ట్రిక్స్‌ ప్లే చేశాడు? అనేది మిగతా కథ. 

ఈమధ్య వచ్చిన కల్యాణ్‌రామ్‌ సినిమాలను పరిశీలిస్తే... ఒక్కో సినిమాలో ఒక్కో లుక్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక కొత్త లుక్‌ ట్రై చేశాడు. అయితే అది ఏమాత్రం వర్కవుట్‌ అవ్వలేదు. ఇప్పటివరకు కల్యాణ్‌రామ్‌ చేసిన సినిమాల్లో బ్యాడ్‌ లుక్‌ ఇదేనని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అతను కొత్తగా ట్రై చేసింది ఏమీ లేదు. రెగ్యులర్‌గా అతని పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే డాన్సుల్లో, ఫైట్స్‌లో, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో ఫర్వాలేదు అనిపించాడు. హీరోయిన్‌ కాజల్‌ కేవలం పాటలకే పరిమితమైపోయింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరో చేతిలో బఫూన్‌ అయ్యే విలన్‌ క్యారెక్టర్‌లో రవికిషన్‌ పెర్‌ఫార్మెన్స్‌ రొటీన్‌గానే ఉంది. వెన్నెల కిషోర్‌, పృథ్వీ, బ్రహ్మానందం, పోసాని అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే అది అంతగా వర్కవుట్‌ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్స్‌ చేసిన నటీనటులు ఓకే అనిపించుకున్నారు. 

సాంకేతికంగా చూస్తే ప్రసాద్‌ మురెళ్ళ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నంలో ప్రసాద్‌ సక్సెస్‌ అయ్యాడు. తమ్మిరాజు ఎడిటింగ్‌ ఫర్వాలేదు. సినిమాని 2 గంటల 9 నిమిషాలకు కుదించడంలో తమ్మిరాజు సక్సెస్‌ అయ్యాడు. ఇక మణిశర్మ మ్యూజిక్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక్క పాట కూడా వినదగినవిగా లేవు. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సోసోగా ఉంది. ఇక డైరెక్టర్‌ ఉపేంద్ర మాధవ్‌ గురించి చెప్పాలంటే.. తనకు వచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి సినిమా డైరెక్టర్‌లో ఉండే కసి అతనిలో కనిపించలేదు. కథను పక్కాగా రెడీ చేసుకోవడంలో, సీన్స్‌ని అద్భుతంగా పండించడంలో అతని ప్రతిభ కనిపించలేదు. సినిమాలో మంచి సీన్స్‌ కంటే నాసిరకంగా ఉన్న సీన్సే ఎక్కువ. అక్కడా నవ్వించిన కొన్ని కామెడీ డైలాగ్స్‌ తప్ప మాటల విషయంలో కూడా కేర్‌ తీసుకోలేదు. ఇప్పటివరకు మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన ఛాలెంజ్‌లు, సిట్యుయేషన్లు ఈ సినిమాలో కనిపిస్తాయి. పాట, ఫైట్‌, కామెడీ.. ఇలా కమర్షియల్‌ ఫార్మాట్‌లోనే సినిమా తీసుకుంటూ వెళ్ళిపోయాడు. రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. కానీ, కొత్తదనం కావాలి అనుకునే వారికి ఈ సినిమా నూటికి నూరు శాతం నచ్చదు. లాజిక్‌ లేని సీన్స్‌, తేలిపోయిన సన్నివేశాలు, సీన్‌లో ఎమోషన్‌ ఉన్నా ఆడియన్స్‌ కనెక్ట్‌ అవ్వని సందర్భాలు సినిమాలో కోకొల్లలు. నటీనటుల నుంచి సరైన నటనను రాబట్టుకోవడంలో కూడా దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్‌గా స్టార్ట్‌ అయి హీరో, హీరోయిన్‌ మధ్య సీన్స్‌, రొటీన్‌ కామెడీ, ఇంటర్వెల్‌లో ఓ సాదా సీదా ట్విస్ట్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ముగించారు. సెకండాఫ్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించే ఆడియన్స్‌కి తీవ్ర నిరాశ తప్పదు. ఫస్ట్‌హాఫ్‌ వరకు సినిమా ఏదో నడుస్తోందిలే అని సరిపెట్టుకున్న ఆడియన్స్‌కి సెకండాఫ్‌లో హీరో ఎమ్మెల్యే అయ్యే క్రమం విసుగు పుట్టిస్తుంది. దర్శకుడు తనకు తోచినట్టు సినిమాను తీసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప లాజిక్‌ మిస్సవుతున్నామని, కాస్త అతి చేస్తున్నామని అనుకోలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఏమాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో రూపొందిన ఎంఎల్‌ఎ సినిమాలో ఇది సినిమాకి హైలైట్‌ అని చెప్పుకోదగిన అంశం ఒక్కటీ లేదు. ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారు, కమర్షియల్‌గా విజయం సాధిస్తుందా అనేది డౌటే. 

ఫినిషింగ్‌ టచ్‌: మిస్సైన లాజిక్స్‌తో అరకొరగా..

mla movie review:

kalyan ram movie mla
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs